విధాత : దేశంలో కొందరు ఉద్యోగాలు దొరక్క బాధపడుతుంటే మరికొందరు చేసే ఉద్యోగంలో అవినీతి, నిర్లక్ష్యంతో విధులు నిర్వహిస్తుంటారు. ఖమ్మం(Khammam)కూసుమంచి(Kusumanchi) తహశీల్దార్ కార్యాలయం(Tahsildar’s office)లో జనన దృవీకరణ పత్రం(Birth certificate) కోసం దరఖాస్తు చేసిన వారికి మరణ దృవీకరణ పత్రం(Death certificate) జారీ చేసిన ఓ ఉద్యోగి నిర్వాకం(Negligence) వైరల్ గా మారింది. గట్టు సింగారం గ్రామానికి చెందిన కడారి ఉపేందర్, మమత దంపతులు తమ నాలుగేళ్ల కుమార్తె కడారి మాధవి జనన ధృవీకరణ పత్రం కోసం 6 నెలల క్రితం డిసెంబర్ 17న కూసుమంచి తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి జత పరిచిన పత్రాలు సరిగ్గా లేవంటూ సెక్షన్ అధికారి కాలయాపన చేస్తు వారిని కార్యాలయం చుట్టు తిప్పించాడు. ఎట్టకేలకు తాజాగా వారికి కూసుమంచి తహశీల్ధార్ ముద్రతో సర్టిఫికెట్ జారీ చేశారు. తమకు ఇచ్చిన సర్టిఫికెట్ చూసిన ఆ తల్లిదండ్రులు అవాక్కయ్యారు.
తాము బర్త్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేస్తే డెత్ సర్టిఫికెట్ ఇచ్చారని..ఇదేంటని ఉపేందర్, మమత దంపతులు సంబంధిత సెక్షన్ అధికారిని ప్రశ్నించారు. సదరు సెక్షన్ అధికారి వారినే దుర్భాషలాడి సర్టిఫికెట్ లాక్కుని చించివేశాడు. మళ్లీ కంప్యూటర్‌లో సరిచేసి బర్త్ సర్టిఫికెట్ అందించాడు. అందులో కూడా సరైన వివరాలు నమోదు చేయలేదు. అన్ని వివరాలు నమోదు చేయాలని బాధితులు కోరడంతో వారితో రెవిన్యూ అధికారి దురుసుగా ప్రవర్తించాడు. విధి నిర్వహణలో తప్పులు చేయడంతో పాటు దురుసుగా వ్యవహరించాడని బాధితులు తెలిపారు. సదరు తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఈ ఘటనపై తహశీల్దార్ రవికుమార్ స్పందిస్తూ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.