- నాగార్జునసాగర్ ఎడమ కాలువకు పడిన గండ్లను వెంటనే పూడ్చాలి
- రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ డిమాండ్
భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పొలాలకు ఎకరాకు రూ.15,000 ల నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు డిమాండ్ చేశారు. మంగళవారం కాగితం రామచంద్రపురం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుండి పాలేరుకు వెళ్లే ప్రధాన కాలువ రెండు చోట్ల తెగిపోయిన ప్రాంతాన్ని ఆమె రాష్ట్ర కౌలు రైతుల ప్రధాన కార్యదర్శి కొప్పోజు సూర్యనారాయణ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి దొడ్డ వెంకటయ్య కంబాల శ్రీనివాస్ , సిరిపురం గ్రామ రైతు శ్రీహరి తదితరులతో కలిసి సందర్శించారు. అక్కడే గుమికుడిన రైతులతో విచారించారు. వారం రోజుల లోపు ఈ గండ్ల నిర్మాణం పూర్తి కాకపోతే వరి పొలాలు ఎండిపోతాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గండ్ల నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు.
30 నుంచి 50 సెంటీమీటర్ల వర్షం రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ,హైదరాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలలో కురువడంతో స్తంభించిపోయిందన్నారు. పాలేరు నుంచి నీళ్లు వెనక్కి రావటమే మరింత నష్టానికి దారి తీసిందన్నారు. ఈ భారీ వర్షాలు ప్రకృతి వైపరీత్యంగా పర్యావరణంలో వస్తున్న విపరీతమైన మార్పులకు కారణంగా కేంద్ర పాలకులు పరిగణించాలని జాతీయ విపత్తుగా ప్రకటించి సహాయక చర్యలు పునరావాస చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు.