Diamond Hunting: కర్నూల్, అనంతపురం జిల్లాల్లో చేనులు, చెల్కలు..బీడు భూముల్లో వజ్రాల వేట అదృష్టవంతుల దశను మారుస్తుంటుంది. వర్షాలు పడ్డాయంటే చాలు వేల మంది పోలో మంటూ వజ్రాల వేటకు బయలుదేరి భూముల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. ప్రస్తుతం తొలకరి జల్లులతో కొనసాగుతుండటంతో ఆ జిల్లాల్లో వజ్రాల వేట కొనసాగుతోంది. చిన్న వజ్రం దొరికినా తమ జీవితాలు మారిపోతాయనే ఆశతో పొలాలను జల్లెడ పడుతున్నారు.
కర్నూల్ జిల్లా పత్తికొండ ప్రాంతంలో మద్దికెర మండలం పెరవలి కొల్లాపూర్ లక్ష్మీదేవి ఆలయ పరిసరాల్లో కొనసాగుతున్న వజ్రాల వేటలో ఓ వ్యక్తి జాక్ పాట్ కొట్టేశాడు. పెరవలి గ్రామానికి చెందిన అతనికి దొరికిన వజ్రం భారీగానే ధర పలికింది. రూ.30లక్షలకు ప్రైవేటు వ్యాపారులకు గుట్టు చప్పుడు కాకుండా విక్రయించేసి దాంతోనే సంతృప్తి చెందాడు. పొలాల వద్ధకు వెళ్లి వ్యాపారులు రంగురాళ్లను, వజ్రాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే పెరవలి వ్యక్తికి దొరికిన వజ్రం విలువ బహిరంగ మార్కెట్ లో కోట్ల రూపాల్లో ఉంటుందని తెలుస్తుంది. వజ్రం దొరికిన ఘటనపై స్థానికి రెవెన్యూ, పోలీస్ అధికారులు ఆరా తీస్తున్నారు.
అంతకుముందు ఆదివారం కూడా పెరవలికి చెందిన ఓ రైతుకు వజ్రం లభిం చగా రూ. లక్షన్నర రుపాయలు చెల్లించి ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు.కర్నూలు జిల్లాలోని తుగ్గలి, మద్దికెర, జొన్నగిరి, పగిడిరాయి, పెరవలి, మహానంది, మహాదేవపురం ప్రాంతాలలోని ఎర్రనేలల్లో వర్షాకాలంలో ఏటా వజ్రాల వేట సాగుతుంటుంది. 2021లో ఓ రైతుకు రూ.1.2కోట్ల విలువైన 30క్యారెట్ల వజ్రం దొరికినట్లుగా ప్రచారం సాగింది.