Site icon vidhaatha

free electricity । ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్తు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

free electricity । తెలంగాణలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు (government educational institutions) ఉచితంగా విద్యుత్తు (free electricity) సరఫరా చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క (Mallu Bhatti vikramamarka) ప్రకటించారు. రాష్ట్రంలో 27, 862 విద్యాలయాలు ఉన్నాయని, ఈ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్తు శాఖకు చెల్లిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం విద్యతోపాటు గురువులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి(Ravindra Bharati)లో  జరిగిన గురుపూజోత్సవ (Guru Pujotsavam) కార్యక్రమంలో భట్టివిక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత దశాబ్ద కాలంగా ఈ రాష్ట్రంలో డీఎస్సీ(DSC)ని నిర్వహించలేదని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 11,062 పోస్టులకు నోటిఫికేషన్ వేయడంతో పాటు పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో మరో 6వేల పైబడి పోస్టులకు నోటిఫికేషన్  విడుదల చేయనున్నామని చెప్పారు.

 

గత పది సంవత్సరాల పాలనలో ఉపాధ్యాయులు పదోన్నతికి, బదిలీలకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 45 వేల మంది ఉపాధ్యాయుల బదిలీలు (transferred) నిర్వహించామని తెలిపారు. 30 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చామన్నారు. ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యా విధానం మారాలని పాఠశాలలో వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు వేసి వాటి నిర్వహణ స్వయం సహాయక సంఘాల (self-help groups) సభ్యులకు అప్పగించి  ప్రభుత్వం 667 కోట్ల రూపాయలను వెచ్చించిందని భట్టివిక్రమార్క తెలిపారు. ఇప్పటివరకు పరిశ్రమలకు పనికొచ్చే సిలబస్ (syllabus) అందుబాటులో లేకపోవడం వల్ల పరిశ్రమలు అభివృద్ధి కూడా వెనకడుగు పడిందని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ (skill university) ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలలో గురువుల ఆలోచనలు కచ్చితంగా తీసుకుంటామని తెలిపారు. వారితో చర్చించిన తర్వాతే విధానపరమైన నిర్ణయాలు (policy decisions) తీసుకుంటామన్నారు.

 

ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ నిర్మాణం కావడానికి గురువుల పాత్ర కీలకంగా ఉపయోగపడాలని ఉప ముఖ్యమంత్రి అభిలషించారు. విద్యా బుద్ధులతో పాటు మంచి అలవాట్లు, సంస్కారం నేర్పించిన మానవ వనరులు సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను ఎదుర్కొని సమాజానికి ఉపయోగపడతారని చెప్పారు. సమాజం మనుగడ కోసం పునాదులు వేయాల్సింది గురువులేనన్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2007 సంవత్సరంలో ప్రభుత్వ బడులలో తెలుగు మీడియంతో పాటు ఆంగ్ల మీడియం (English medium) చెప్పాలని ఆనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రోత్సహించి ఉపాధ్యాయులు అమలు చేయడం వల్లే నేడు ప్రపంచంతో పోటీ పడే విధంగా మన విద్యార్థులు రాణిస్తున్నారని అన్నారు. అభ్యుదయ భావాలతో గురువులు ఉండటం వల్ల ఆ స్ఫూర్తితో ఈ రాష్ట్రం ప్రగతిశీలంగా (progressive state) అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది గురువులు గొప్ప వాళ్లు ఉండటం, ప్రోగ్రెసివ్ ఆలోచనలు కలిగి ఉన్నందుకు సంతోషంగా గర్విస్తున్నానని అన్నారు.

Exit mobile version