Shadnagar Gurukula College|గురుకుల ప్రిన్సిపాల్ అక్రమాలపై భగ్గుమన్న విద్యార్థులు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినిలు ప్రిన్సిపాల్ అక్రమాలను నిరసిస్తూ షాద్ నగర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనతో హోరెత్తించారు.

విధాత, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల(Shadnagar Gurukula College) విద్యార్థినిలు ప్రిన్సిపాల్ అక్రమాలను నిరసిస్తూ షాద్ నగర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన(Students Protest)తో హోరెత్తించారు. గురుకులంలో అక్రమాలు ఆపాలని, ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని, నాణ్యమైన విద్య, వసతులు అందించాలని నినదించారు.

ప్రిన్సిపాల్ శైలజ ప్రభుత్వ నిధులను, సరుకులను సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. విద్యార్థుల నుంచి ప్రిన్సిపాల్ డబ్బులు, ఫీజులు వసూలు చేస్తుందని ఆమెతో పాటు, అక్రమాలకు పాల్పడిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేసి విచారించాలని డిమాండ్ చేశారు.

కలెక్టర్ వచ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా విద్యార్థినులపై మఫ్టిలో ఉన్న కానిస్టేబుల్ జ్యోతి చేయి చేసుకోవడంతో ఆగ్రహించిన విద్యార్థినులు ఆమెను చుట్టుముట్టి జుట్టుపట్టి ఈడ్చిపారేశారు. న్యాయం చేయమని ధర్నా చేస్తుంటే..మమ్మల్నే కొడుతారా అంటూ విద్యార్థినులు ఆగ్రహంతో కానిస్టేబుల్ పై దాడి చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రెచ్చిపోయి కొంతమంది విద్యార్థినులను తమ వ్యాన్ లో తీసుకెళ్లారు. అయినప్పటికి విద్యార్థినులు బెదిరిపోకుండా అవేశంతో తమ న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు ఆందోళన విరమించేది లేదంటూ స్పష్టం చేశారు.