HYDRA Land Protection| రూ.15వేల కోట్ల భూములను పరిరక్షించిన హైడ్రా

గాజుల రామారంలో రూ.15 వేల కోట్ల విలువైన 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించే ప్రయత్నాలు హైడ్రా చేపట్టింది. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్‌కి కేటాయించిన భూములలో బడా బాబుల ఆక్రమ కట్టడాలను నిర్మించి ఆక్రమించారు. ఈ భూముల్లో పేదవారి పేరు చెప్పి బడాబాబులు వేసిన షెడ్ల కూల్చివేతను హైడ్రా ఆదివారం చేపట్టింది.

విధాత, హైదరాబాద్: ఆక్రమణదారుల చెర నుంచి ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో హైడ్రా(HYDRA Land Protection) మరో ముందడుగు వేసింది. గాజుల రామారంలో(Gazularamaram land encroachment) రూ.15 వేల కోట్ల విలువైన 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించే ప్రయత్నాలు చేపట్టింది. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్‌కి కేటాయించిన భూములలో బడా బాబుల ఆక్రమ కట్టడాలను నిర్మించి ఆక్రమించారు. ఈ భూముల్లో పేదవారి పేరు చెప్పి బడాబాబులు వేసిన షెడ్ల కూల్చివేతను హైడ్రా ఆదివారం చేపట్టింది.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం పరిధిలోని సర్వే నెంబర్లు 307 342.329/1, 397లలోని ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేసి ప్లాట్లను చేసి విక్రయించడంతో పాటు.. 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి రూ.10 లక్షల చొప్పున విక్రయాలు చేస్తున్నారు. ఈ అక్రమణల దందాలపై ఫిర్యాదులు అందుకున్న హైడ్రా ప్రభుత్వ భూముల పరిరక్షణకు రంగంలోకి దిగింది. కబ్జాలు నిర్ధారించుకుని ఆదివారం ఉదయం నుంచి తొలగింపు పనులు చేపట్టింది. నివాసాల జోలికి వెళ్లకుండా ఆక్రమణల తొలగింపు పనులు కొనసాగిస్తుంది.

అధికారులు, నేతలు కలిసి కబ్జా : హైడ్రా కమిషనర్

ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిలో రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు ఉన్నారని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చెప్పారు. 40 ఎకరాల్లో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. అధికారులతో స్థానిక నేతలు కుమ్మక్కై పేదలకు స్థలాలు విక్రయించారని పేర్కొన్నారు.

ఇటీవల మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా బాలాన‌గ‌ర్ మండ‌లం, మూసాపేట స‌ర్కిల్ ప‌రిధిలోని స‌న‌త్‌న‌గ‌ర్ కోప‌రేటివ్ సొసైటీకి చెందిన లే అవుట్ లో వెయ్యి గ‌జాల పార్కు స్థ‌లాన్ని కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లంలోని మ‌దీన‌గూడ విలేజ్‌లో పార్కుతో పాటు ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన 600ల గ‌జాల స్థ‌లాన్ని హైడ్రా కాపాడింది. 1600గజాలలోని ఆ భూముల విలువ రూ.16కోట్ల మేరకు ఉంటుంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్‌లోని మాధ‌వా హిల్స్ ఫేజ్‌-2లో 11.50కోట్ల విలువైన పార్కు స్థ‌లం వేయి గజాలను కాపాడింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శాతంరాయ్ గ్రామంలోని సర్వే నంబర్ 17 లో కబ్జాకు గురైన రూ.500 కోట్ల విలువైన 112 ఎకరాల భూమిని పరిరక్షించి హైడ్రా స్వాధీనం చేసుకుంది.