విమర్శలు గుప్పించిన మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్
విధాత, హైదరాబాద్ : షాద్‌నగర్ నగల దొంగతనం కేసులో దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. చోరీ కేసులో ఆరోపణలపై విచారణకు పిలిపించి రాత్రి 2గంటల వరకు దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి కొట్టారు. ఆమెతో పాటు ఆమె భర్తను, కొడుకును కూడా చితకబాదారు. వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటన సమాచారం తెలుసుసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులపై సీరియస్ అయ్యారు. వెంటనే ఘటనతో సంబంధమున్న పోలీసులను హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేసి, విచారణ జరిపించాలని ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి ఏసీపీని విచారణకు ఆదేశించారు. షాద్‌నగర్ డీఐ రామిరెడ్డిని సైబరాబాద్ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. బాధిత మహిళకు అన్ని విధాల న్యాయం చేయాలని ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ల పరామర్శ
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.ప్రీతమ్ ఆదివారం బాధితురాలు సునీతను పరామర్శించారు. సంఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. విచారణ పూర్తయ్యాక, బాధ్యులైన పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
అధికార దుర్వినియోగం: హరీశ్ రావు
షాద్‌నగర్ దొంగతనం అంగీకరించాలంటూ దళిత మహిళ, ఆమె భర్తపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. పోలీసుల క్రూరత్వం, అధికార దుర్వినియోగం ప్రభుత్వ పాలనను ప్రతిబింబిస్తోందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
ఇదేనా ఇందిరమ్మ పాలనా : కేటీఆర్
మాజీ మంత్రి, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దళిత మహిళపై ఇంత దాష్టీకమా..? ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన?.. దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా అంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. దొంగతనం కేసులో కొడుకు ముందే తల్లిని చిత్ర హింసలు పెడతారా.. రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితి, అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందని నిలదీశారు. నిక్కర్ తొడిగి, బూటు కాళ్లతో తన్నటమా..! ఇంత కర్కశత్వమా… సిగ్గు సిగ్గు అని దుయ్యబట్టారు.
మహిళలంటే ఇంత చిన్న చూపా… ఓ వైపు మహిళలపై అత్యాచారాలు, అవమానాలు మరోవైపు దాడులు, దాష్టీకాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. అలాగే యథా రాజా తథా ప్రజా అన్నట్లు ముఖ్యమంత్రే స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే.. పోలీసులు మాత్రం మేమేమీ తక్కువ అన్నట్టు వ్యవహరిస్తున్నారన్నారు. ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి మంచిది కాదని, వాళ్లను గౌరవించకపోయినా ఫర్వాలేదుగాని ఇలా దౌర్జన్యాలు మాత్రం చేయకండన్నారు. అలాగే షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరును బీఆరెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వెంటనే ఈ దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని.. బాధిత మహిళలకు న్యాయం చేయాలని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.