విధాత: డిసెంబర్ 31 వచ్చిందంటే చాలు న్యూ ఇయర్ వేడుకలతో నగరం హోరెత్తించే జోరుతో ఊగిపోతోంది. ఇప్పటికే నగరమంతా న్యూ ఇయర్ జోష్ నెలకొంది. నూతన సంవత్సరం వేడుకలు అంబరాన్ని అంటేలా చేసేందుకు పబ్బులు, ఈవెంట్లు, రకరకాల పేరుతో ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మందుబాబులకు ట్విట్టర్‌లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. డిసెంబర్ 31 రాత్రి పార్టీల పేరుతో హద్దులు మీరితే కఠిన చర్యలు తప్పవని, కొత్త సంవత్సర వేడుకలు చేదు అనుభవాలుగా మిగిలిపోకుండా జాగ్రత్తగా ఉండాలని ట్వీట్లతో హెచ్చరించారు.
క్యాబ్ ఎక్కుతారా.. కోర్టు మెట్లు ఎక్కుతారా అంటూ ప్రశ్నించారు. చాలాన్ కంటే క్యాబ్ ధరే తక్కువ అంటూ ట్వీట్లు చేశారు. గూగూల్ లో లాయర్‌ను వెతకడం కంటే క్యాబ్‌ను వెతకడం ఎంతో మేలు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా పక్కా హైదరాబాదీ స్టైల్‌లో ‘Miyaa, drink kiya? Toh steering ko salaam bolke cab pakdo.’ మియా మద్యం తాగావా, అయితే స్టీరింగ్‌కు సలాం కొట్టి క్యాబ్ ఎక్కు అంటూ హెచ్చరించారు. ఇది మాత్రమే కాకుండా మరో ట్వీట్‌లో మా డాడీ ఎవరో తెలుసా, మా అన్న ఎవరో తెలుసా, మా అంకుల్ ఎవరో తెలుసా అని మా ఆఫీసర్లను అడగొద్దు. మీ ప్రైవసీకి రెస్పెక్ట్ చేస్తాం, వాహనం పక్కకు పెట్టి, మీ తేదీ వచ్చిన రోజు కోర్టులో పరిచయం చేసుకుందాం అని మందుబాబులకు వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ స్టైల్‌లో వార్నింగ్ ఇవ్వడం యువతను బాగా ఆకర్షిస్తున్నది.
