విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ నాయకులు తప్పు చేసినందునే…కమిషన్ నివేదికపై చర్చించకుండా కోర్టు కేసులను ఏకరువు పెడుతున్నారంటూ మంత్రి కోమటిరెడ్డి అసెంబ్లీలో మాజీ మంత్రి టి.హరీష్ రావు పై మండిపడ్డారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ చేయకుండా హరీష్ రావు చర్చను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చి కాళేశ్వరం కట్టి తప్పు చేసిన బీఆర్ఎస్ పాలకులను ఇప్పటికే ప్రజలు శిక్షించారని..మీరు శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు. పొరపాటున మరోసారి బీఆర్ఎస్ వస్తే కాళేశ్వరానికి మరో మూడు లిఫ్టులు కట్టి ఇంకో లక్ష కోట్లు దోచుకుంటారని వెంకట్ రెడ్డి ఆరోపించారు. నేరుగా కమిషన్ నివేదికపై చర్చించాలని వెంకట్ రెడ్డి సూచించారు.
వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందిస్తూ నన్ను మాట మారుస్తున్నారని..నేరుగా సబ్జెక్టు చర్చించాలని సూచిస్తున్నారని..ఆయన గతంలో కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు అంటూ మాట్లాడిన వీడియో చూపించాలా అంటూ ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన వెంకట్ రెడ్డి మీరు గతంలో ఇదే సభలో తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ వచ్చిందని చెప్పిన వీడియో కూడా ఉందంటూ కౌంటర్ వేశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరి సభలో గందరగోళం నెలకొంది. అసలు బీసీ రిజర్వేషన్, కాళేశ్వరం నివేదికపై చర్చ జరుగుతుంటే కేసీఆర్ సభకు ఎందుకు రాలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తప్పు చేశామని ప్రజలను కేసీఆర్ క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. మళ్లీ హరీష్ రావు మాట్లాడుతూ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేదుండేనని గతంలో వెంకట్ రెడ్డి అన్నారని వ్యాఖ్యానించగా..ఉత్తమ్ లేచి ఆగ్రహంతో ..సిగ్గుండాలి లక్షకోట్లు వృధా చేసి మీదకెళ్లి అబద్దాలు మాట్లాడుతున్నారంటూ హరీష్ రావుపై మండిపడ్డారు.