అమరావతి : అధిక వడ్డీల పేరుతో పేద ప్రజలను వేధిస్తే.. ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిస్తూ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. వడ్డీ వ్యాపారస్తులకి కట్టే బాకీలు ఆపివేయాలని.. ఎవరైనా వేధిస్తే తమకు తెలియజేయాలని లేఖలో పేర్కొంది. ఈ మేరకు.. భద్రాద్రి-అల్లూరి సీతారామరాజు జిల్లాల కమిటీ కార్యదర్శి లచ్చన్న పేరుతో లేఖ విడుదల చేసింది. వడ్డీ వ్యాపారస్తుల వేధింపులకు భయపడిపోయి ప్రాణాలు కోల్పోవద్దని కోరింది. వడ్డీ వ్యాపారులు తమ దోపిడీ, వసూళ్లతో దౌర్జన్యాలు, బెదిరింపులు ఆపకపోతే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించింది.
వడ్డీ వ్యాపారస్తుల వేధింపులతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని..కొందరు అప్పులు తీర్చలేక అన్ని అమ్ముకుంటు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఇకమీదట ప్రజలు ఎవరు కూడా వడ్డీ వ్యాపారస్తులకు భయపడాల్సిన పని లేదని..ఎవరైన వేధిస్తే తమకు సమాచారం అందించాలని..ఎవరు వడ్డీలు కట్టకండని మావోయిస్టు పార్టీ సూచించింది.