విధాత: భారీ భూకంపం..సునామీ హెచ్చరికలతో రష్యా దేశ వాసులు వణికిపోయారు. బుధవారం రష్యా(Russia)లో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో జపాన్(Japan), రష్యాలో సునామీ(Tsunami) ఏర్పడింది. 3 మీటర్ల ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. రష్యా తీరంలోని కమ్చట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్‌కు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈక్రమంలో శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరఅప్రమత్తమైంది. అమెరికాలోని కాలిఫోర్నియా సహా పశ్చిమ రాష్ట్రాల్లో నివసిస్తున్న భారతీయులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అమెరికా అధికారులు ఇచ్చే సూచనలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. వాటిని పాటించాలని చెప్పింది. జపాన్‌లోని నాలుగు పెద్ద దీవులకు ఉత్తరాన ఉన్న హక్వైడో నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూప్రకంపనల నేపథ్యంలో పెట్రోపావ్లోవ్స్క్-కామ్చాట్‌స్కీ నగరంలోని భవనాలు కంపించాయని రష్యా మీడియా తెలిపింది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీసినట్లు సమాచారం.ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్లీ ఇప్పుడేనని శాస్త్రవేత్తల కథనం. ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలియలేదు. జపాన్ తీరంలో 2011 మార్చిలో 9.0 తీవ్రతతో వచ్చిన శక్తిమంతమైన భూకంపం భారీ సునామీకి కారణమయ్యింది. ఆ సమయంలో సముద్ర అలలు 130 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఎగిసిపడ్డాయి. ఆ సునామీ కారణంగా 25వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
సునామీ దెబ్బకు తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలాలు
రష్యాలోని కురిల్ దీవులు, జపాన్‌లోని ఉత్తర ద్వీపమైన హక్వైడో తీర ప్రాంతాలను సునామీ తాకింది. హోనోలులులో సునామీ హెచ్చరిక సైరన్లు మోగాయి. భయాందోళనకు గురైన ప్రజలు నివాస ప్రాంతాలను వీడుతున్నారు. రష్యాలోని కురిల్ దీవులలోని ప్రధాన స్థావరమైన సెవెరో-కురిల్స్క్ తీర ప్రాంతాన్ని తాకింది. ఇక్కడి ఓడరేవు మునిగిపోయింది. సఖాలిన్ ద్వీపంలోని నివాసితులను ఖాళీ చేయిస్తున్నారు. జపాన్ తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలోని సునామీ దెబ్బకు సముద్రం మధ్యలో ఉండాల్సిన భారీ తిమింగలాలు తీరానికి కొట్టుకొచ్చి పడ్డాయి. తీరంలో పడేసినట్లుగా ఉన్న తిమింగలాలు విలవిలలాడుతున్నాయి. జపాన్‌లోని చింబా తీరంలోని ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. జపాన్ లోని ఫుకుషిమా డయీచీ అణుకేంద్రం నుంచి ఉద్యోగులను రేడియేషన్ లీకేజీతో సమస్యాత్మకంగా మారిన నేపథ్యంలో ట సురక్షిత ప్రదేశాలకు తరలించారు.
సునామీ ముప్పు భారీన మరిన్ని దేశాలు
సునామీ ముప్పు బారిన కోస్టారికా, ఫ్రెంచ్ పాలినేషియా, గువామ్, హవాయి, జపాన్, జార్విస్ ఐలాండ్, జాన్‌స్టన్ అటోల్, కిరిబాటి, మిడ్‌వే ఐలాండ్, పాల్మిరా ఐలాండ్, పెరూ, సమోవా, సోలోమన్, ఈక్వెడార్, వాయువ్య హవాయి దీవులున్నాయి. 0.3 నుంచి 1 మీటరు ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉన్న జాబితాలో అంటార్కిటికా, ఆస్ట్రేలియా, చుక్, కొలంబియా, కుక్ దీవులు, ఎల్ సాల్వడార్, ఫిజీ, గ్వాటెమాలా, ఇండోనేషియా, మెక్సికో, న్యూజిలాండ్, నికరాగ్వా, పనామా, పపువా న్యూగినీ, ఫిలిప్పీన్స్, తైవాన్ తదితర దేశాలున్నాయి.
0.3 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో అలలు వచ్చే ముప్పు ఉన్న జాబితాలో బ్రూనై, చైనా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, మలేసియా, వియత్నాం దేశాలు ఉన్నాయి. ఇప్పటికే అమెరికాలోని పశ్చిమ తీర రాష్ట్రాలతో పాటు న్యూజిలాండ్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు.