MLC Kadiyam | మంత్రిని కలవకుండా ఆఫీసర్లతో కడియం..దేవాదాయ శాఖ అధికారులతో సమావేశం

అభివృద్ధి పనుల విషయంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ఒక ఎమ్మెల్యే కలిసి చర్చించడం తప్పుకాకపోవచ్చేమోగానీ...సొంత జిల్లాకు చెందిన సంబంధిత శాఖ మంత్రిని కలువకుండా అధికారులకు ప్రతిపాదనలివ్వడం తాజాగా చర్చకు తావిస్తోంది. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంగళవారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హరీశ్‌తో మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

అభివృద్ధి పనుల విషయంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ఒక ఎమ్మెల్యే కలిసి చర్చించడం తప్పుకాకపోవచ్చేమోగానీ…సొంత జిల్లాకు చెందిన సంబంధిత శాఖ మంత్రిని కలువకుండా అధికారులకు ప్రతిపాదనలివ్వడం తాజాగా చర్చకు తావిస్తోంది. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంగళవారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హరీశ్‌తో మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ చేనేత భవన్ లోని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కార్యాలయంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని ఆలయాల అభివృద్ధి పై సమావేశం నిర్వహించారు. అధికారులతో జరిగిన సమావేశంలో దేవాలయ అభివృద్ధికి అనేక ప్రతిపాదనలు, పెండింగ్ అంశాలు గుర్తు చేశారు. కానీ, దేవాదాయ శాఖ మంత్రిగా వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

కాగా, మంత్రితో కొద్ది రోజులుగా కడియానికి విభేదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మంత్రిని కలువకుండా అధికారులను కలిసి విన్నవించారనే చర్చ సాగుతోంది. మంత్రితో ఇంకా సయోధ్య కుదరకపోవడంతో సీనియర్ నేతగా ఉన్న కడియం అధికారులకు తన ప్రతిపాదనలు అందించినట్లు భావిస్తున్నారు. పనిలో పనిగా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు , క్రికెట్ స్టేడియం నిర్మాణం పై ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జేయేష్ రంజన్, వీసీఅండ్ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోని బాలదేవితో కూడా కడియం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

దేవాదాయ అధికారులకు ప్రతిపాదనలు

ఈ సమావేశంలో ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ జిల్లాలోనే అతి ప్రాచీనమైన, ప్రముఖ్యత కలిగిన ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులను కోరారు. చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ. 5కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రతిపాదనలు సిద్ధం చేసి, ఆక్రమణలు తొలగించాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న అర్చకుల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. జీడికల్ రామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 5కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించాలని తెలిపారు. వచ్చే నెల 4నుండి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. నవాబ్ పేట కోదండ రామస్వామి ఆలయ అభివృద్ధికి రూ. 1.03 కోట్ల పనుల ప్రతిపాదన ఫైల్ పెండింగ్ లో ఉందని, తిరుమలనాథ స్వామి ఆలయానికి చెందిన 1.09 ఎకరాల దేవాదాయ శాఖ భూమిలో కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు మున్సిపాలిటీ లీజుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఆలయాలకు చెందిన భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కడియం సూచించారు.