విధాత: పెంపుడు కోడి కాళ్లు విరగ్గొట్టిన వ్యక్తిపై కేసు పెట్టాలంటూ ఓ వృద్దురాలు పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఘటన వైరల్ గా మారింది. నల్గొండ జిల్లా నకిరేకల్ లో గంగమ్మ అనే వృద్ధురాలికి చెందిన కోడి, తన గడ్డివాములో గింజలు తింటుందని రాకేష్ అనే వ్యక్తి ఆ కోడిపై దాడి చేసి కర్రతో కొట్టాడు. దీంతో కోడి కాళ్లు విరిగాయి. ఈ ఘటనను చూసిన గంగమ్మ వెంటనే గాయపడిన కోడితో సహా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. నా కోడి కాళ్లను అన్యాయంగా విరగ గొట్టిన వ్యక్తిపై కేసు పెట్టి శిక్ష పడేలా చేయాలని కోరింది. ఊరు అన్నాక మనుషులతో పాటు కోళ్లు, పశువులు ఉంటాయని..పశువులు చేను మేస్తే దండగా కట్టిస్తారని..ఈ కోడికి కూడా దండగా కట్టించుకోకుండా కాళ్లు విరగగొట్టాడని గంగమ్మ వాపోయింది. ఈ మాత్రం దానికి కేసు ఎందుకమ్మ..నష్టపరిహారం ఇప్పిస్తామంటే..నాకు పరిహారం వద్దని..మళ్లీ ఇలా ఆ వ్యక్తి కోళ్లపై దాడి చేయకుండా..నా జోలికి రాకుండా కేసు పెట్టి శిక్షించాలంటూ కోరింది.
నా కోడికి జరిగినట్లు ఊళ్లో ఏ కోడికి జరగకూడదు అని గంగమ్మ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. పోలీసులు గంగమ్మ ఫిర్యాదుపై తలలు పట్టుకుని ఇదేక్కడి కేసురా బాబు అనుకుంటూ నవ్వుతునే నిందితుడిని పిలిచి విచారిస్తామని చెప్పి ఆమెకు సర్థి చెప్పి పంపించారు. ప్రస్తుతం వెళ్లి కోడికి చికిత్స చేయించుకోమని ఇంటికి పంపించారు. ఈ కోడి పంచాయితీని చివరకు ఎలా తేల్చుకోవాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు.