Site icon vidhaatha

Vemula Veeresham | బీఆరెస్‌కు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం రాజీనామా.. మంత్రిపై ఫైర్‌

Vemula Veeresham |

విధాత: బీఆరెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బిగ్ షాక్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నకిరేకల్ నియోజకర్గం నుంచి మరోసారి సిటింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు టికెట్ ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వేముల వీరేశం గురువారం తన అనుచరులు, కార్యకర్తలతో భారీ సమావేశం నిర్వహించి బీఆరెస్‌కు రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.

ఆయన త్వరలోనే కాంగ్రెస్‌లో చేరవచ్చని తెలుస్తుంది. తన భవిష్యత్తు కార్యాచరణలో వారం రోజుల్లోగా వెల్లడిస్తానని తెలిపారు. తన అనుచరులతో జరిగిన సమావేశంలోనే ఆయన రాజీనామా నిర్ణయం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన బీఆరెస్ అధిష్టానం తీరుపైన, జిల్లా మంత్రి జి.జగదీశ్‌రెడ్డిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

సీఎం కేసీఆర్‌, కేటీఆర్ మూలాలను మరిచిపోయారని, నాలుగున్నరేళ్లుగా పార్టీలో బాధలు పడ్డానని, తనపై, తన అనుచరులపై అనేక కేసులు పెట్టి వేధించారన్నారు. బరాబార్ తాను మాజీ నక్సైలైట్‌నే, పేద ప్రజల కోసం పనిచేసే వ్యక్తినేనన్నారు. నా గెలుపే అన్నింటికి సమాధానం చెబుతుందని, ప్రముఖ రాజకీయ పార్టీ ద్వారానే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. జిల్లా పార్టీ నాయకత్వం నాపట్ల అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చిందన్నారు.

మంత్రి జి.జగదీశ్‌రెడ్డి నియోజకవర్గానికోక నీతి పాటిస్తున్నారని, ఇతర నియోజకవర్గాల్లో చాలా మందిని ప్రొత్సహిస్తున్న ఆయన నకిరేకల్‌లో మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడంటూ వీరేశం మండి పడ్డారు. జిల్లా మంత్రి చేస్తున్న పనులను ప్రజలు గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెబుతారన్నారు. నేను ఎవరికి ఏనాడు ద్రోహం చేయలేదని, నాపై మంత్రికి ఎందుకు మనసు సానుకూలంగా లేదో తెలియడం లేదని, ఇందుకు వారు చరిత్ర హీనులవుతారంటూ విమర్శించారు.

జిల్లా మంత్రికి నాకు పార్టీలో సభ్యత్వం ఇచ్చే శక్తి కూడా లేకపోయిందని, పూర్తిగా ఎమ్మెల్యేకు దాసోహమై పనిచేస్తున్నారన్నారు. ఈ రోజు నుంచి మీకు నాకు రాంరాం అంటు మంత్రి జగదీశ్‌రెడ్డిని ఉద్దేశించి వీరేశం వ్యాఖ్యానించారు. నకిరేకల్‌లో నేను బరాబర్ పోటీ చేస్తానని, నేను రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకున్నాకా మీ బండారం బయటపెడుతానన్నారు.

మీడియాలో నాపై అనేక కథనాలు రాయిస్తున్నారని, ఎమ్మెల్సీ ఇస్తారని రాయించారన్నారు. తాగుడికి, గంజాయి అలవాట్లపై నేను ఏ పరీక్షలకైనా సిద్ధమన్నారు. నియోజకవర్గంలో దారుణాలపై జిల్లా మంత్రికి, ఎమ్మెల్యే చిరుమర్తికి బహిరంగ చర్చకు రావాలని తాను సవాల్ చేస్తున్నానన్నారు. నాకు శత్రువులు ఎవరు లేరని, నేను ఏది చేసినా పార్టీ కోసమే చేశానన్నారు. ప్రజా సేవ కోసమే తాను రాజకీయాల్లో కొనసాగుతున్నా నన్నారు.

Exit mobile version