Site icon vidhaatha

Emergency movie । కంగన రనౌత్‌ ఎమర్జెన్సీకి వదలని కష్టాలు! సర్టిఫికేషన్‌ కోసం ఆదేశించలేమన్న బాంబే హైకోర్టు

Emergency movie । దేశంలో ఎమర్జెన్సీ విధించిన నాటి పరిస్థితులపై బీజేపీ ఎంపీ, సినీ నటి కంగన రనౌత్‌ స్వీయదర్శకత్వంలో రూపొందించిన ‘ఎమర్జెన్సీ’ (Emergency) చిత్రం విడుదలకు ఆటంకాలు తొలగడం లేదు. ఈ సినిమాలో చారిత్రక వాస్తవాలను మసకబార్చారని పలు సిక్కు సంస్థలు పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈ అంశం న్యాయ అంశాల్లో చిక్కుకుపోయింది. ఈ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ను జారీ చేసేందుకు సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (Central Board of Film Certification) (CBFC) ని ఆదేశించలేమని బాంబే హైకోర్టు  (Bombay high court) బుధవారం పేర్కొన్నది. ఇప్పటికే ఈ సినిమాపై తలెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సర్టిఫికెట్‌ను జారీ చేయాలని ఇప్పటికే మధ్యప్రదేశ్‌ హైకోర్టు సీబీఎఫ్‌సీని ఆదేశించిన నేపథ్యంలో తాము ఈ విషయంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని జస్టిస్‌ బీపీ కోలాబవాలా (BP Colabawalla), జస్టిస్‌ ఫిర్దోశ్‌ పూనివాలా (Firdosh Pooniwalla) డివిజన్‌ బెంచ్‌ పేర్కొన్నది.

 

‘మధ్యప్రదేశ్‌ హైకోర్టు సీబీఎఫ్‌సీకి మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పుడు మేం ఏదైనా ఆదేశాలు జారీ చేస్తే.. ఆ ఉత్తర్వులను నేరుగా ఉల్లంఘించినట్టు (contravention) అవుతుంది. ఈ రోజు మేం ఏదైనా ఉత్తర్వులు జారీ చేస్తే మరొక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించాలని సీబీఎఫ్‌సీకి చెప్పినట్టు అవుతుంది. మేం ఆ పని చేయలేం. న్యాయపరమైన ఔచిత్యం మమ్మల్ని ఆపుతున్నది’ అని డివిజన్‌ బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఈ సినిమాపై తలెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సెప్టెంబర్‌ 18 నాటికి సర్టిఫికెట్‌ జారీ  చేయాలని సెన్సార్‌బోర్డును బాంబే హైకోర్టు కోరింది.

 

‘వెనుక ఏదో జరుగుతున్నదని మాకు తెలుసు. దానిపై మేం వ్యాఖ్యానించదల్చుకోలేదు. అభ్యంతరాలను సీబీఎఫ్‌సీ పరిగణనలోకి తీసుకుని, సెప్టెంబర్‌ 18 నాటికి ఒక నిర్ణయం తీసుకోవాలి’ అని డివిజన్‌ బెంచ్‌ తెలిపింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 19వ తేదీకి వాయిదా వేసింది.

 

మధ్యప్రదేశ్‌ హైకోర్టు (Madhya Pradesh high court) ఉత్తర్వుల నేపథ్యంలో ఎమర్జెన్సీ సినిమా సహ నిర్మాణ సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ (Zee Entertainment) బాంబే హైకోర్టును ఆశ్రయించింది. సెన్సార్‌ బోర్డు నిరంకుశంగా, చట్ట వ్యతిరేకంగా సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ను నిలిపివేసిందని పిటిషన్‌లో పేర్కొన్నది. సర్టిఫికెట్‌ను సిద్ధం చేసి కూడా జారీ చేయడం లేదని తెలిపింది. ఈ సినిమాకు కంగనా రనౌత్‌ దర్శకత్వం వహించడంతోపాటు.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ సినిమాలో మతపరమైన మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలు ఉన్నాయని, అవి అశాంతికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయని పలు సిక్కు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌ను మధ్యప్రదేశ్‌ హైకోర్టు మంగళవారం విచారించింది. సెన్సార్‌ సర్టిఫికెట్‌ను జారీ చేసే ముందు  పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించాలని సెన్సార్‌ బోర్డును ఆదేశించింది.

 

వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్‌ 6వ తేదీన విడుదల కావాల్సి ఉన్నది. కానీ.. శిరోమణి అకాలీదళ్‌ సహా పలు సిక్కు సంస్థలు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. సిక్కు మతాన్ని తప్పుగా చిత్రీకరించారని, చారిత్రక వాస్తవాలను సైతం తప్పుగా చూపారని పేర్కొన్నాయి. దీంతో సినిమా విడుదలపై నీలిమబ్బులు కమ్ముకున్నాయి.

Exit mobile version