India vs Pakistan:: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థల స్థావరాలపై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ వైమానిక దాడులకు కౌంటర్ గా పాకిస్తాన్ కూడా ప్రతి దాడులకు సిద్ధమవుతోంది. పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. అన్ని ఎయిర్పోర్టులను, విద్యాసంస్థలను, వాణిజ్య సంస్థలను మూసివేశారు. మెడికల్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు. భారత్ మెరుపుదాడులతో లాహోర్, సియాల్‌కోట ఎయిర్‌పోర్ట్‌లు మూసివేశారు. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. పాక్ పంజాబ్‌లో విద్యాసంస్థలు మూసివేయాలని ఆదేశించారు.
మరోవైపు సరిహద్దులో భారత్ చెక్ పోస్టులు లక్ష్యంగా పాకిస్తాన్ మిలిటరీ కాల్పులకు తెగ బడింది. పాక్ సైన్యం కాల్పుల్లో 8 మంది భారత పౌరులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. యూరీ, కుప్వారా ,రాజోలి, పూంచ్ సెక్టార్లో కాల్పులు కొనసాగాయి. ప్రతిగా భారత సైన్యం కాల్పుల్లో పలువురు పాక్ సైనికులు మరణించినట్లుగా తెలుస్తోంది. పాక్ ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దార్ ఆపరేషన్ సింధూర్ పై స్పందిస్తూ భారత్‌ది పిరికిపంద చర్య. మా పౌరులు 8 మంది చనిపోయారు. ఇండియాలో మేం ఎప్పడు ఎక్కడ ప్రతి దాడులు చేస్తామో..!చెప్పం అంటూ ప్రగల్భాలు పలికారు.
మరోవైపు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ అత్యవసరంగా జాతీయ భద్రత మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారత్ పై ప్రతి దాడులు నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.