విధాత, హైదరాబాద్ : మొయినాబాద్ ఫామ్ హౌస్(Moinabad Farmhouse Case), ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్న అప్పటి బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు అంతా బీజేపీలో చేరుతారన్న ప్రచారం మరోసారి ఊపందుకుంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju)తాజాగా బీజేపీ(BJP)లో చేరిపోగా.. పైలెట్ రోహిత్ రెడ్డి(Pilot Rohith Reddy), రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలు కూడా బీజేపీలో టచ్ లో ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. వారిలో ముందుగా పైలట్ రోహిత్ రెడ్డి బేజేపీలో చేరుతారని…ఈ క్రమంలో మిగతా వారు కూడా బీజేపీలో చేరుతారన్న వార్తలు పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తున్నాయి. 2022లో జరిగిన మొయినా బాద్ ఫామ్ ఘటనలో రోహిత్ రెడ్డి కీలకంగా ఉన్నారు. బీజేపీలో చేరడానికి సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి తనకు రూ.100 కోట్లు ఆఫర్ చేశాడని..ఎమ్మెల్యేలను తీసుకొస్తే ఒక్కొక్కరికి 50కోట్లు ఇస్తామని డీల్ మాట్లాడారని అప్పట్లో రోహిత్ రెడ్డి ఆరోపించారు.
నంద కిషోర్ మధ్యవర్తిత్వం తర్వాత ఢిల్లీకి చెందిన సతీష్ శర్మ, తిరుపతికి చెందిన సింహయాజీలు ముగ్గురు కూడా నా ఫామ్‌హౌస్‌కు వచ్చారని ఆరోపించారు. నేను బీజేపీలో చేరకపోతే, నాపై ఈడీ, సీఐబీ కేసులు పెడతామని బెదిరించారు” అని కూడా రోహిత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర సివిల్ కాంట్రాక్టులతో పాటు కేంద్ర ప్రభుత్వంలో సీనియర్ పదవులు ఇస్తామని కూడా వారు నాకు చెప్పారని రోహిత్ రెడ్డి తెలిపారు. మొయినాబాద్ పోలీసులు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫిర్యాదుపై స్వామీజీ సింహయాజీ, సతీష్ శర్మ, నందకిషోర్ లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై అప్పటి సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టు జడ్జీలకు, పలు రాజకీయ పక్షాల నాయకులకు కూడా ఫామ్ హౌస్ చర్చల ఆడియో, వీడియో టేప్ లను సైతం పంపించి రచ్చ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక ఆనాటి ఫామ్ హౌస్ ఘటనలోని వారు ఒక్కొక్కరుగా కేసీఆర్ కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఇప్పటికే బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారమంతా కేసీఆర్ స్కెచ్ మేరకే జరిగిందని వెల్లడించడం విశేషం.