Site icon vidhaatha

CM Revanth Reddy| దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ : సీఎం రేవంత్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : దేశ యువతకు స్ఫూర్తి దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి(Rajiv Gandhi Jayanti)  సందర్బంగా సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రాణాలర్పించిన నేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు. పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడు రాజీవ్ గాంధీ ఆలోచన చేసి కంప్యూటర్ ను దేశానికి పరిచయం చేశారని..టెలికాం రంగంతో దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. రాజీవ్ స్ఫూర్తితో ఆనాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీకి పునాది పడిందన్నారు. 18 ఏండ్లు నిండిన వారికి ఓటు హక్కును కల్పించి దేశ భవిష్యత్ ను నిర్ణయించే అవకాశం కల్పించారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని స్మరించారు.రాజీవ్ స్ఫూర్తితో తెలంగాణను ఆర్థికంగా,సామాజికంగా ముందుకు తీసుకెళతాం అన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ లాంటి సామాజిక సమస్యలకు పరిష్కారం చూపాం అని గుర్తు చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకుని 21 ఏళ్లు నిండిన వారు శాసన సభకు పోటీ చేసేలా చట్టాన్ని సవరించేందుకు కృషి చేస్తామన్నారు. ఆ కలలన్నీ సాకారం కావాలంటే దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని..రాజీవ్ స్ఫూర్తితో రాహుల్ గాంధీని ప్రధానిగా చేసే వరకు విశ్రమించబోమన్నారు.

దేశంలో సంస్కరణలకు ఆద్యులు రాజీవ్‌ గాంధీ : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

దేశంలో సంస్కరణలకు ఆద్యులు రాజీవ్‌ గాంధీ అని..ప్రపంచంతో పోటీ పడేలా దేశాన్ని నూతన పథంలో నడిపించేలా ఆయన చేసిన కృషితో నేడు మనం అగ్రదేశాల సరసన నిలబడ్డాం అని టీపీసీసీ చీఫ్ బీ.మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమాజిగూడ సర్కిల్ లో రాజీవ్ గాంధీ విగ్రహానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్,ఎమ్మెల్యే దానం నాగేందర్ , ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్లు మెట్టు సాయికుమార్, కాల్వ సుజాత , మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ళ శారద, కార్పొరేటర్లు సంగీతా యాదవ్, విజయ లక్ష్మీ,ఇతర ముఖ్య నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఏఐ రంగంలో దేశం దూసుకుపోతుందంటే దానికి కారణం నాడు రాజీవ్‌ సాంకేతిక రంగానికి పెద్ద పీట వేయడమేనన్నారు. అన్ని రంగాల్లోనూ విజనరీతో భావితరాలకు రాజీవ్‌ గాంధీ స్ఫూర్తిగా నిలిచారన్నార. దేశం కోసం గాంధీ కుటుంబం సర్వం త్యాగం చేసిందని గుర్తు చేశారు. ప్రధాని పదవిని త్యాగం చేసిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఒకవైపు ఉంటే.. పదవుల కోసం ఎంతకైనా దిగజారే మోదీ, అమిత్ షా మరో వైపు ఉన్నారన్నారు. ఓట్ల చోరీతో మూడోసారి గద్దెనెక్కిన మోదీకి రాహుల్ గాంధీకి పోలిక ఏంటని అడుగుతున్నానన్నారు. ప్రధాని పదవిని తృణప్రాయంగా వదులుకున్న నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్నారు. నెహ్రూ లేగసిని మరిపించే ప్రయత్నం బీజేపీ నేతలు చేస్తున్నారని.. సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజమైన కాంగ్రెస్ వాది కాదని..తమ వారని చేసుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆరోపించారు. బీజేపీ కుట్రలను తిప్పి కొట్టల్సిన అవసరం యువతపై ఉందన్నారు.

Exit mobile version