కేరళ :
ఇస్లాం మతంలో రెండో వివాహం చేసుకోవడం సాధారణ విషయమే.. అది వాళ్ల మతంలో ఆచారంగా నడుస్తోంది. ఈ క్రమంలో ముస్లిం వ్యక్తి రెండో వివాహం నమోదు చేసుకునే ముందు అతని మొదటి భార్యకు వాదనలు వినిపించే అవకాశం తప్పక ఇవ్వాలని కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ఇచ్చిన తీర్పులో, ముస్లిం వ్యక్తికి కొన్ని సందర్భాల్లో రెండో వివాహం చేసుకోవడానికి వ్యక్తిగత మత చట్టాలు అనుమతించినప్పటికీ, వివాహాన్ని అధికారికంగా నమోదు చేయడంలో మాత్రం అంతిమంగా చట్టాలకు ప్రాధాన్యం కలిగి ఉంటుందని.. ‘మతం కంటే రాజ్యాంగ హక్కులు ముఖ్యమైనవి’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
2008 నాటి కేరళ వివాహ నమోదు నిబంధనల ప్రకారం.. మొదటి భార్యకు నోటీసు ఇవ్వకుండా రెండో వివాహాన్ని నమోదు చేయరాదని కోర్టు వెల్లడించింది. ముస్లిం వ్యక్తి తన రెండో భార్యతో కలిసి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హై కోర్టు తిరస్కరించింది. కాగా, ఆ వ్యక్తి మొదటి భార్యతో వివాహం ఇప్పటికీ చెల్లుబాటు అవుతూ, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండో వివాహం కూడా రిజిస్టర్ చేయాలని, తమ పిల్లలకు ఆస్తి హక్కులు రావాలనే ఉద్దేశంతో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై స్పందించిన కోర్టు.. మొదటి భార్య ఈ పిటిషన్‌లో పార్టీ కాలేనందున వారు మళ్లీ వివాహ నమోదు కోసం దరఖాస్తు చేస్తే, మొదటి భార్యకు నోటీసు ఇవ్వడం, ఆమె అభిప్రాయం వినడం అవసరం అని జస్టిస్ కున్హికృష్ణన్ తెలిపారు. మొదటి భార్య రెండో వివాహం చెల్లదని అభ్యంతరం తెలిపితే, వివాహ రిజిస్ట్రార్ ఆ వివాహాన్ని నమోదు చేయకూడదని స్పష్టం చేసింది. సంబంధిత వ్యక్తులను న్యాయ పరంగా చెల్లుబాటును నిర్ధారించుకునేందుకు కోర్టుకు పంపాలని తీర్పులో వెల్లడించింది. 2008 మ్యారేజెస్ రిజిస్ట్రేషన్ నియామావళిలోని 11వ నిబంధన ప్రకారం, రిజిస్ట్రార్ వివాహ పత్రంలో పొందుపరిచిన వివరాలను పరిశీలించాల్సిన బాధ్యత ఉందని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.
ఇస్లాం మతం రెండో వివాహానికి అనుమతించినా.. దానికి కూడా షరతులు వర్తిస్తాయని పేర్కొంది. భర్త తన ఇద్దరి భార్యలకు సమాన హక్కుతో పాటు ఇద్దరిని సమాచానంగా చూడాలని, వారికి సమానమైన ఆర్థిక సాయం అందించడంతో పాటు మొదటి భార్యను నిర్లక్ష్యం చేయకూడదని కేరళ హైకోర్టు పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 ప్రకారం మహిళల సమాన హక్కులకు రక్షణ ఉంది.. అందువల్ల మొదటి భార్య హక్కులు పక్కనపెట్టకూడదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.