విధాత, హైదరాబాద్ : తెలంగాణ పారిశ్రామిక రంగంలో పెను విషాదంగా నిలిచిన ‘సిగాచీ’ పరిశ్రమ( Sigachi Industries explosion) పేలుడు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిగాచీ సీఈవో అమిత్ రాజ్ సిన్హాను(CEO Amit Raj Sinha arrest) పోలీసులు అరెస్టు చేశారు. పటాన్‌చెరు పోలీసులు ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో జూన్ 30న భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 54 మంది కార్మికులు మృతి చెందారు. మరో 20మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనలో సిగాచీ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికి సిగాచీ మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అటు యాజమాన్యం, ఇటు ప్రభుత్వం తరుపున అందాల్సిన పరిహారం ప్యాకెజీలు పూర్తిగా అందలేదన్న ఆరోపణలు కొనసాగుతుండటం విచారకరం.
సిగాచీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రభుత్వ నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ నివేదికలో పేర్కొంది. అయితే ఈ కేసులో బాధ్యులను గుర్తించలేదు. ఈ విషయంలో తెలంగాణ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బాధ్యులను గుర్తించి.. దీనిపై ఏఏజీ నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
