భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) కీలక నిర్ణయం తీసుకున్నారు. నాసా (NASA) నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. తన 27 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణానికి వీడ్కోలు పలికారు. గత ఏడాది డిసెంబర్ 25వ తేదీ నుంచే ఈ రిటైర్మెంట్ అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని నాసా అధికారికంగా ప్రకటించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆమె చూపిన నాయకత్వం, టెక్నాలజీ అభివృద్ధికి చేసిన సేవలు చంద్రుడు, మార్స్‌పై భవిష్యత్తులో చేయబోయే మిషన్లకు బలమైన పునాది వేశాయని నాసా పేర్కొంది. సుదీర్ఘ అనుభవం ఉన్న సునీత విలియమ్స్ నాసా నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం యావత్ ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ నేపథ్యంలో సునీత గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సునీతా పాండ్య..
సునీతా విలియమ్స్ భారతీయ మూలాలున్న అమెరికా జాతీయురాలు. ఆమె తండ్రి డాక్టర్ దీపక్ పాండ్య గుజరాత్ వాసి. అనాథగా పెరిగినా, ఎన్ని కష్టనష్టాలు ఎదుర్కొన్నా బాగా చదువుకుని శరీర నిర్మాణ శాస్త్రం (న్యూరోఅనాటమీ) మీద పట్టు సాధించారు. 1985లో ఆయన అమెరికాకు వలస వెళ్లారు. అక్కడ ఉర్సులైన్ అనే స్లొవేనియా మహిళను పెళ్లాడి అక్కడే స్థిరపడ్డారు. పాండ్యా దంపతులకు ముగ్గురు సంతానం. సునీత చిన్న కుమార్తె. 1965 సెప్టెంబర్ 19న ఓహియోలో జన్మించింది. పాండ్యా దంపతులు ఆమెకు సునీతా పాండ్య అని పేరు పెట్టుకున్నారు. అయితే, అమెరికా జాతీయుడైన ఫెడరల్ పోలీస్ ఆఫీసర్ మైఖేల్ జె. విలియమ్స్‌ని పెళ్లి చేసుకొని సునీతా విలియమ్స్ అయింది.
యుద్ధాల్లోనూ..
యు.ఎస్.నావల్ అకాడమీలో ఫిజికల్ సైన్స్‌లో బ్యాచ్‌లర్ డిగ్రీ చదివింది సునీత. ఆ తర్వాత ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్) పూర్తిచేసింది. వెంటనే అమెరికా నావికా దళంలో ఏవియేటర్ (గగనతల యుద్ధ సైనికురాలు)గా కెరీర్ మొదలుపెట్టింది. దశాబ్దకాలం యుద్ధాల్లో పాల్గొన్నది. యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడమీలో చేరిన సునీత నావల్ ఏవియేషన్ (యుద్ధ నౌక రక్షణ కోసం ఎయిర్ ఫైటర్లను నడిపే పైలట్) శిక్షణ తీసుకున్నది. అమెరికన్ నావికా దళంలో చేరిన సునీత హెలికాప్టర్ నడపడంలో తిరుగులేదనిపించుకుంది. యుద్ధాలు మొదలుకొని ప్రకృతి వైపరీత్యాల వరకూ.. పైలట్‌గా అపారమైన సేవలు అందించింది.
పర్షియన్ గల్ఫ్ యుద్ధ సమయంలో సునీత అమెరికా యుద్ధ నౌకలకు రక్షణగా ఉండే హెలికాప్టర్‌లను నడిపింది. మధ్యప్రాచ్యం, ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్‌లో జరిగిన యుద్ధాల్లో పాల్గొన్నది. అమెరికాలో 1992లో హరికేన్ ఆండ్రూ సంభవించినప్పుడు మియామి ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టింది. యుద్ధాలు, విపత్తుల సమయంలో పనిచేసిన అనుభవం సునీత గుండె ధైర్యాన్ని పెంచింది.
అరుదైన రికార్డులు..
సునీతా విలియమ్స్ 1998లో నాసాకు ఎంపికయ్యారు. 27 ఏళ్ల పాటు అమెరికా అంతరిక్ష కేంద్రంలో ఆమె పనిచేశారు. మొత్తం మూడు మిషన్లలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. సునీతా పేరిట చాలా అరుదైన రికార్డులే ఉన్నాయి. మొత్తం 608 రోజులు అంతరిక్షంలో గడిపి, అత్యధిక రోజులు స్పేస్‌లో గడిపిన అమెరికన్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు. అత్యధిక స్పేస్ వాక్‌లు చేసిన మహిళగా, అంతరిక్షంలో మారథాన్ చేసిన తొలి వ్యక్తిగా, అంతరిక్షంలో ఎక్కువగా రోజులు గడిపిన నారిగా.. ఇలా చాలా ప్రత్యేకతలు సాధించారు.
సునీతా విలియమ్స్ మూడు మిషన్లు..
అంతరిక్ష నౌక స్పేస్ షటిల్ డిస్కవరీలో 2006 డిసెంబర్ 14న ఫ్లైట్ ఇంజినీర్‌గా సునీత అంతరిక్షంలోకి తొలి ప్రయాణం చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరి నాలుగుసార్లు స్పేస్ వాక్ చేసింది. ఈ నాలుగు దఫాల్లో మొత్తం 29 గంటల 17 నిమిషా లు అంతరిక్ష కేంద్రం బయట గడిపింది. స్పేస్ స్టేషన్‌లో ఉన్నపుడు బోస్టన్ (అమెరికా)లో ఓ మారథాన్ పోటీ జరిగింది. అందులో పాల్గొనాలని సునీత కోరిక. అంతరిక్ష కేంద్రంలో ఉండే, ట్రెడ్ మిల్‌పై 42.2 కిలోమీటర్లకు సమానమైన పరుగు తీసింది..! 195 రోజులపాటు అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వర్తించిన ఆమె 2007 జూన్ 22న నేలకు దిగి వచ్చింది.
2012లో మళ్లీ స్పేస్ స్టేషన్‌లో పనిచేసే అవకాశం ఆమెకు వచ్చింది. రెండోసారి అంతరిక్ష యాత్రలో మూడుసార్లు స్పేస్ వాక్ చేసి, 21 గంటల 23 నిమిషాలపాటు స్పేస్ స్టేషన్ బయట గడిపింది. 127 రోజుల తర్వాత భూమికి తిరిగి వచ్చింది. అమెరికా వ్యోమగామి పెగ్గీ విట్సన్ తర్వాత అత్యధిక రోజులు అంతరిక్షంలో ఉన్న మహిళగా సునీతా విలియమ్స్ చరిత్రలో నిలిచిపోయింది.
అంతరిక్ష కేంద్రం చేరుకోవడం సాహసమే. అక్కడి అనుభూతి అద్భుతమే. కానీ, రోజుల తరబడి అక్కడే ఉండటం అందరూ చేయలేని సాహసం. సునీత ముచ్చటగా మూడోసారి సుసాధ్యం చేసింది..! 2024 ఏడాదిలో 58 ఏండ్ల వయసులో అంతరిక్షానికి వెళ్లింది. వాణిజ్య అంతరిక్ష నౌకలను ప్రయోగించేందుకు నాసా ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల్లో ఆమె ఒకరు. స్పేస్ ఎక్స్, క్రూ డ్రాగన్, స్టార్‌లైనర్ లాంటి వాణిజ్య అంతరిక్ష నౌకలను అంతరిక్షంలోకి తీసుకుపోయే బృందంతో గగనానికి దూసుకుపోయింది. దాదాపు 286 రోజులు అంతరిక్షంలో గడిపి 2025 మార్చిలో భూమిపైకి తిరిగొచ్చారు.
ఇవి కూడా చదవండి :
Rajamouli | కరోనా టైంలో చనిపోతానని అనుకున్నా.. కుటుంబమంతా ప్రమాదంలో పడింది
Priyanka Jain | శారీలో సీరియల్ బ్యూటీ అందాలు.. ప్రియాంక జైన్ క్యూట్ ఫోటోలు
