Health Tips | ఏ వయసు వారు రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలో తెలుసా..?

రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలో తెలుసా? వయసును బట్టి నీటి అవసరాలు ఎలా మారుతాయో, ఏ వయసు వారు ఎంత తాగాలి అనే పూర్తి వివరాలు మీకోసం..

Daily Water Intake

ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం రోజూ పౌష్టికాహారం తీసుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో రోజూ త‌గిన‌న్ని నీళ్ల (Water)ను తాగ‌డం కూడా అంతే అవ‌స‌రం. నీళ్లను తాగ‌డం వ‌ల్ల జీవ‌క్రియ‌లు స‌క్రమంగా నిర్వహించ‌బ‌డ‌తాయి. దీంతో శ‌రీరంలోని వ్యర్థాలు సుల‌భంగా బ‌య‌ట‌కు పోతాయి. ఆరోగ్యంగా ఉంటారు. అందుకే రోజుకు కనీసం 7 నుంచి 8 గ్లాసులు తాగాలని నిపుణులు చెబుతుంటారు. నీళ్లు సరిగా తాగకపోతే డీహైడ్రేషన్‌కు గురవుతారు. శరీరంలో తేమ స్థాయి తగ్గిపోయి అనేక సమస్యలు వస్తాయి. అయితే, నీళ్లు ఎక్కువగా తాగినా ప్రమాదమే. అందుకే మన శరీరానికి సరిపడా నీళ్లు మాత్రమే తీసుకోవాలి.

అయితే, చాలా మందికి రోజుకు ఎంత మోతాదులో నీళ్లను తీసుకోవాలన్న సందేహం వస్తుంటుంది. కొందరు రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లైనా తాగాలని చెబుతుంటారు. కానీ, రోజుకు ఇన్ని నీళ్లే తాగాలనే నియమానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని చెబుతున్నారు వైద్యులు. వయసు, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితులతో పాటు ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులపై నీటి మోతాదు ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. మన శరీరానికి నీరు కావాలని అనిపించినప్పుడు దాహం రూపంలో సంకేతం వస్తుందని వివరించారు.

వయసు వారీగా నీళ్లు ఇలా తీసుకోవాలి..

* 1-3 సంవత్సరాల వయస్సు గల పిల్లలు రోజుకు సుమారు 1 లీటరు (ఆహారంలో నీటితో సహా) నీళ్లు తాగాలి.
* అదే 4 నుంచి 8 సంవత్సరాల వయస్సుగల పిల్లలు రోజుకు సుమారు 1.2 లీటర్ల నీళ్లను తాగాలి.
* 9 నుంచి 13 సంవత్సరాల వయస్సుగల పిల్లలు రోజుకు సుమారు 1.6 నుంచి 1.9 లీటర్ల నీటిని తీసుకోవాలి.
* 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉన్న టీనేజర్లు రోజుకు దాదాపు 1.9–2.6 లీటర్ల నీళ్లను తాగాలి.
* అబ్బాయిలు అమ్మాయిల కంటే కొంచెం నీటిని ఎక్కువగానే తాగాలట. ఈ కొలతలు పిల్లలు ఎదగడానికి, నిర్జలీకరణం లేకుండా చురుకుగా ఉండటానికి సహాయపడతాయి.
* వాతావరణం, ఆహార పద్ధతుల దృష్ట్యా పురుషులు (19 ఏళ్లు పైబడిన వారు) 3 లీటర్ల నీటిని తాగాలి.
* మహిళలు (19 ఏళ్లు పైబడిన వారు) 2.5 నుంచి 2.7 లీటర్ల నీళ్లు తాగితే సరిపోతుంది.
* కాబోయే తల్లులు కొంచె నీళ్లు ఎక్కువగానే తీసుకోవాలి. గర్భధారణ సమయంలో ద్రవ అవసరాలు దాదాపు 3 లీటర్లు పెరుగుతాయి. అంతేకాదు పాలిచ్చే సమయంలో తల్లులకు 3.1 లీటర్ల వరకు నీటి అవసరం ఉంటుంది.
* ఇక వృద్ధుల విషయానికొస్తే.. వయస్సు పెరిగే కొద్దీ శరీర దాహాన్ని గ్రహించే సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకే 60 ఏళ్లు పైబడినవారు రోజుకు 1.6 నుంచి 2 లీటర్ల నీటిని తాగాలి.

ఇవి కూడా చదవండి :

JD Vance | యూఎస్‌ ఉపాధ్యక్షుడి ఇంట్లో సంబరాలు.. నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్న ఉషా వాన్స్‌
Rajamouli | కరోనా టైంలో చనిపోతానని అనుకున్నా.. కుటుంబమంతా ప్రమాదంలో పడింది

Latest News