విధాత : ఆంధ్రప్రదేశ్(AP) లోని ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రి(Indrakeeladri) కనక దుర్గా ఆలయంల(Kanaka Durga Temple)లో నేటి నుంచి భక్తులకు కొత్త నిబంధనలు(Temple new rules) అమలు చేయనున్నారు. శుక్రవారం నుంచి అమలులోకి వచ్చిన నూతన నిబంధనల మేరకు కొత్త డ్రెస్ కోడ్(Dress Code)ప్రవేశపెట్టారు. ఇకపై సాంప్రదాయ దుస్తుల్లో వచ్చే భక్తులకు మాత్రమే అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. కొద్ది రోజులు నుంచి భక్తులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు దుర్గగుడిలో సాంప్రదాయ దుస్తుల నోటీస్ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. భక్తులు ఆలయ దర్శనానికి వచ్చే సమయంలో పురుషులు ధోతి, అంగవస్త్రం ధరించాలి. మహిళలు చీర, హాఫ్ సారీ(చున్నీ) లేదా సంప్రదాయ రీతిలో ఉండే వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది. ఇతర మోడ్రన్ దుస్తుల్లో వచ్చే వారికోసం ఆలయ ప్రవేశ ద్వారాల్లో, ఘాట్ రోడ్ ఓం టర్నింగ్ వద్ద, మహా మండపం వద్ద ప్రత్యేకంగా చీరలు, చున్నీలు అందుబాటులో ఉంచారు. కొబ్బరికాయ/పూజా సామాగ్రి కౌంటర్ల వద్ద కూడా లభిస్తాయి.
షార్ట్‌లలో వచ్చే పురుషుల కోసం ఆలయ కౌంటర్ల వద్ద పంచెలను కూడా ఏర్పాటు చేశారు. భక్తులు, ఉద్యోగులందరికీ సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో ఉండే సమయంలో ఆలయ ఉద్యోగులు కచ్చితంగా ఐడీ కార్డులు ధరించాలని, అలాగే స్కానింగ్ పాయింట్, టికెట్ కౌంటర్ వద్ద కఠిన తనిఖీలు చేయాలని ఈవో వీకే శీనా నాయక్ పేర్కొన్నారు. అమ్మవారి ఆలయ ఆవరణలో సెల్‌ఫోన్ ల వాడకంపై నిషేధం విధించారు. దర్శనాలకు వచ్చే వారు తమ సెల్‌ఫోన్లను ఆఫీసులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆలయ సాంప్రదాయాలకు భంగం కలగకుండా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు ఈవో వీకే శీనా నాయక్ తెలిపారు.