అమరావతి : కల్తీ మద్యం కేసులో నా ప్రమేయం లేదు అంటూ మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడ కనకదుర్గ అమ్మవారి ముందు గుడిలో చేతిలో దివ్వెను వెలిగించుకుని సత్య ప్రమాణం చేసి సంచలనం రేపారు. కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులతో కలిసి దుర్గమ్మ ముందు జోగి రమేష్ భావోద్వేగంతో ప్రమాణం చేశారు. కల్తీ మద్యం పేరుతో నా హృదయం గాయ పరిచారు. నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని..అమ్మ వారి సాక్షిగా చెబుతున్న నేను తప్పు చేయలేదు, చేయబోనన్నారు. ఏడు కొండలు సాక్షిగా, ఇంద్రకీలాద్రి సాక్షిగా నేను కల్తీ మద్యం కేసులో నాకు ఎలాంటి ప్రమేయం లేదని ప్రమాణం చేశానని తెలిపారు.
నా కుటుంబాన్ని అవమానపరిచి నా హృదయాన్ని గాయపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మని కోరుకున్నానని.. నేను ఏ తప్పు చేయను చేయలేదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి బెజవాడ దుర్గమ్మ పై ప్రమాణానికి నేను సిద్ధమని నేను చెప్పాను. ఆ సవాలకు కట్టుబడి నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేనన్నారు. నేను నాల్కో ఎనాలిసిస్, లైవ్ డిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నానని జోగి రమేష్ ప్రకటించారు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు కూడా సత్య ప్రమాణం చేసేందుకు రావాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. లైడిటెక్టర్ టెస్టుకైనా వచ్చే దమ్ముందా?. కనక దుర్గమ్మ సాక్షిగా వాళ్లు నేను తప్పు చేసినట్లు నిరూపించాలి’’ అని జోగి రమేష్ మరోమారు సవాల్ విసిరారు.
