విధాత: అరుదైన వ్యాధుల (Rare Diseases) బారిన పడిన వారికి మేడ్ ఇన్ ఇండియా ఔషధాలు (Made in India Medicine) ఆర్థికంగా ఎంతో ఉపశమనాన్ని కలగజేస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం.. దేశ ఫార్మా పరిశ్రమలు ఈ తరహా మందులను తయారు చేసిన తర్వాత.. రోగి చికిత్సకు పెట్టే ఖర్చు 100 రెట్లు తగ్గిందని తేలింది. ముఖ్యంగా టైరోసినేమియా టైప్ 1, గౌచర్ డిసీజ్, విల్సన్ డిసీజ్, డార్వెట్ లెనాక్స్ గాస్‌టౌట్ సిండ్రోమ్ వంటి వ్యాధుల బారిన పడిన వారికి మేడ్ ఇన్ ఇండియా ఔషధాలు గొప్ప ఊరటను ఇస్తున్నాయి. పై వ్యాధులన్నింటికీ భారత ఫార్మా పరిశ్రమ ఔషధాలు విజయవంతంగా ఉత్పత్తి చేస్తోంది.
వీటికే కాకుండా మరో నాలుగు అరుదైన వ్యాధులకు మందుల తయారీని 2024 నుంచి ప్రారంభించనున్నారు. 5 ఏళ్ల లోపు చిన్నారులకు వచ్చే హైడ్రాక్సియా వ్యాధకి పేదలకు కూడా అందుబాటులో ఉండేలా మందులు తయారుచేయాలని పరిశ్రమలకు భారత ప్రభుత్వం సూచించింది. దేశంలో ఉత్పత్తి పెరగడం వల్ల విదేశాల నుంచి ఔషధాలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం బాధితులకు ఉండదు. ఈ మేరకు డాలర్ల ఖర్చు, దిగుమతి సుంకాలు, నిల్వ ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా ఆర్థిక భారం తప్పుతుంది.
ఉదాహరణకు గౌచర్ డిసీజ్‌కు ఉపయోగించే ఎలిగ్లస్టాట్ ట్యాబెట్ల ఖర్చు చూసుకుంటే ఏడాదికి ఒక వ్యక్తికి గతంలో రూ.3.6 కోట్లు ఖర్చవుతుండగా ఇప్పుడు అది రూ.6 లక్షలకు తగ్గిపోయింది. ఈ వ్యాధితో బాధపడేవారి అంతర్గత అవయవాలు ఉబ్బిపోయి మరణానికి దారితీస్తాయి. విల్సన్ డిసీజ్‌కు వేసుకునే ట్రైన్‌టైన్ క్యాప్సుల్స్ ఖర్చు రూ 2.2 కోట్లు ఖర్చు అయ్యేది. అది ఇప్పుడు రూ 2.2 లక్షలకు తగ్గింది. ఈ వ్యాధి ఉన్నవారికి కాపర్ మూలకాలు శరీరంలో పేరుకుపోయి మానసికపరమైన సమస్యలు తలెత్తుతాయి. టైరోసైనేమియా టైప్ 1కు ఉపయోగించే నిటిసైనోన్ క్యాప్సుల్స్ ధర రూ.2.2 కోట్ల నుంచి రూ.2.5 లక్షలకు తగ్గిపోయింది. ఈ వ్యాధి ఉన్నవారికి కాలేయం చెడిపోయే ప్రమాదముంటుంది.
డార్వెట్ లెనాక్స్ గాస్టౌట్ సిండ్రోం అనే వ్యాధి నియంత్రణకు ఉపయగించే కానాబిడాయిల్ ఓరల్ సొల్యూషన్ ఖర్చు గతంలో రూ.34 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు ఈ ఔషధం దేశీయంగా ఉత్పత్తి అవడంతో ఆ ఖర్చు రూ.1 లక్షకు తగ్గింది. భారత ప్రభుత్వ భాగస్వామ్యం, ప్రోత్సాహంతో ఈ ఔషధాలను సంస్థలు లాభాపేక్ష లేకుండానే ఉత్పత్తి చేస్తున్నాయి. దేశ జనాభాల్లో సుమారు 6 నుంచి 8 శాతం.. అంటే సుమారు 10 కోట్ల మంది ప్రజలు ఏదో ఒక అరుదైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీటిలో అతి ముఖ్యమైనవిగా భావించిన 13 వ్యాధులకు చవకైన ఔషధాలను దేశీయంగా ఉత్పత్తి చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి లభ్యతను పెంచడానికి కూడా చర్యలు చేపట్టింది.