తిరువనంతపురం : కేరళలోని శబరిమల ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. దర్శనం కోసం క్యూలైన్‌లో నిల్చున్న ఓ 11 ఏండ్ల బాలిక కుప్పకూలిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన ఓ 11 ఏండ్ల బాలిక అయ్యప్ప మాల ధరించారు. దీంతో దర్శనానికి ఆ బాలిక క్యూలైన్‌లో నిల్చుంది. భక్తులు అధిక సంఖ్యలో ఉండటంతో దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఈ క్రమంలో క్యూలైన్‌లో నిల్చున్న ఆ బాలిక ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన ఆలయ అధికారులు, హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. గుండెపోటు కారణంగానే బాలిక మృతి చెందిందని నిర్ధారించారు వైద్యులు. అయితే ఆ పాప మూడేండ్ల నుంచి గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు కుటంబ సభ్యులు పేర్కొన్నారు.
దర్శనానికి 18 గంటల సమయం పడుతుండటంతో క్యూలైన్లో ఎక్కువ సమయం నిరీక్షించలేక చాలా మంది భక్తులు బారికేడ్‌లను దూకేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగా పవిత్ర మెట్ల దగ్గర రద్దీ అధికంగా పెరుగుతోంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు కూడా భక్తులను నిలువరించలేకపోతున్నారు. ఈ పరిస్థితులు అక్కడ గందరగోళానికి దారి తీస్తున్నాయి.