- సాగు చేయని భూమికి 14లక్షల రైతుబంధు
Somesh Kumar | విధాత: కొత్తపల్లి గ్రామంలో మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ కొనుగోలు చేసిన భూమిపై 14 లక్షల రైతుబంధు తీసుకున్నారన్న విషయం సంచలనంగా మారింది. ఇప్పటికే సోమేశ్ కుమార్ తన భార్య పేరు మీద 25ఎకరాల 19గుంటల భూమి కొనుగోలు చేయడం వివాదస్పదంగా మారగా, ఆ భూమికి రైతుబంధు రైతుబంధు తీసుకోవడం ఇప్పుడు మరో వివాదంగా మారింది. మొత్తం రాళ్లు, గుట్టలతో ఉన్న సాగు చేయని భూమికి ఆరు నెలలకు 1లక్ష 27,375 చొప్పున ఇప్పటిదాకా 14లక్షల రూపాయల రైతుబంధు సోమేశ్ కుమార్ తీసుకోవడం వివాస్పదంగా మారింది.
భూముల కొనుగోలుతో పాటు రైతుబంధు తీసుకున్న విషయాన్ని సోమేశ్‌కుమార్ ఢిల్లీ డీవోపీటీకి సమాచారం ఇవ్వకపోవడం కూడా చర్చనీయాంశమైంది. సోమేశ్‌కుమార్ తరహాలోనే గత బీఆరెస్ ప్రభుత్వ హాయంలో చాల మంది బ్యూరోక్రాట్స్ ఫామ్‌హౌజ్‌లు, భూములను పెద్ద ఎత్తున సమకూర్చుకున్నారని, వాటికి రైతుబంధు తీసుకోవడం జరిగిందన్న ప్రభుత్వం గుర్తించింది. ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్న ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకునే దిశగా కదులుతుండటం విశేషం.
సోమేష్ కుమార్ భూములపై ఏసీబీ ఫోకస్
సోమేశ్ కుమార్ తన భార్య పేరిట కొనుగోలు చేసిన భూములపై ఏసీబీ దృష్టి సారించినట్లుగా సమాచారం. ఫార్మాసిటీ అంశం ముందే తెలుసుకొని అక్కడ భూములు కొనుగోలు చేసినట్టుగా ఆరోపణలు వినవస్తున్నాయి. ఫార్మాసిటీకి కిలోమీటర్ దూరంలో 25 ఎకరాల 19గుంటల భూమిని సోమేశ్ కుమార్ తన భార్య పేరిట కొనుగోలు చేశారు. రెవెన్యూ స్పెషల్ సీఎస్‌గా ఉన్నప్పుడే భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగిందని, ఆ భూమి పక్కనే సన్నిహిత కుటుంబానికి చెందిన 123 ఎకరాలు ఉన్నాయని, సోమేశ్ కుటుంబానికి వారం తేడాతోనే కొనుగోలు చేసినట్లుగా భావిస్తున్న భూములు రిజిస్ట్రేషన్ జరిగిందని తెలుస్తున్నది. సోమేశ్ కుమార్ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో సాదాభైనామాల పేరుతో కొనుగోలు చేసి ఎకరాకు రెండు లక్షల చెల్లించినట్టు గుర్తించారని, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగిందని, దాసరి రామమూర్తి, ఎల్లా వరలక్ష్మి, నామాల వేణుగోపాల్ ఇందులో కీలకపాత్ర పోషించినట్టు గుర్తించినట్లుగా సమాచారం. వారిని సైతం విచారించాలని ఏసీబీ భావిస్తుంది. వీరికి కోకాపేట్ లో అపార్ట్మెంట్లు, విల్లాలు ఉన్నట్లుగా సమాచారం. కోకాపేటలో వీరి విల్లాలకు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలోనే బహుమతిగా యాచారంలో 25 ఎకరాలు కట్టబెట్టారన్న కోణంలో ఏసీబీ ఫోకస్ పెట్టి అంతర్గత విచారణ చేపట్టిందని తెలుస్తున్నది.