ఒకే కుటుంబంలో 150 మందికి ఆరేసి వేళ్లు..! ఎక్క‌డంటే..!!

కొంత‌మంది పిల్ల‌ల‌కు పుట్టుక‌తోనే ఆరు వేళ్ల‌తో జ‌న్మిస్తుంటారు. చేతుల‌కు లేదా పాదాల‌కు ఆరు వేళ్ల‌ను క‌లిగి ఉంటారు. ఇలాంటి వారు వంద‌లో ఒక‌రిద్ద‌రు ఉంటారు.

  • Publish Date - November 22, 2023 / 03:15 AM IST

విధాత‌: కొంత‌మంది పిల్ల‌ల‌కు పుట్టుక‌తోనే ఆరు వేళ్ల‌తో జ‌న్మిస్తుంటారు. చేతుల‌కు లేదా పాదాల‌కు ఆరు వేళ్ల‌ను క‌లిగి ఉంటారు. ఇలాంటి వారు వంద‌లో ఒక‌రిద్ద‌రు ఉంటారు. కానీ ఒకే కుటుంబంలో 150 మంది ఆరేసి వేళ్ల‌తో జ‌న్మించారు. ఈ కుటుంబం గురించి తెలుసుకోవాలంటే హ‌ర్యానాలోని పానిప‌ట్ జిల్లాకు వెళ్లక త‌ప్ప‌దు.


మ‌రి ఆ కుటుంబంలోని ఓ యువ‌కుడి మాట‌ల్లో.. పానిప‌ట్ జిల్లాలోని బాబ‌ర్‌పూర్ గ్రామం మాది. నా పేరు జానీ. నాకు పుట్టుక‌తోనే చేతుల‌కు, పాదాల‌కు ఆరేసి వేళ్లు ఉన్నాయి. మా నాన్న‌కు కూడా ఆరు వేళ్ల‌తో జ‌న్మించారు. కానీ ఆరో ఫింగ‌ర్ పెద్ద‌గా అస‌మానంగా ఉంది. నాకు పెళ్లైంది. నా పెద్ద కుమారుడు కూడా పాదాల‌కు ఆరు వేళ్ల‌తో జ‌న్మించాడు. మా ఇంటి ఆడ‌పిల్ల‌లు వేరే వారిని వివాహం చేసుకున్న త‌ర్వాత కూడా, వారికి పుట్టిన పిల్ల‌ల్లోనూ ఆరేసి వేళ్ల‌తో జ‌న్మించారు.


ఇలా మా కుటుంబంలోని 150 మంది.. అది చేతుల‌కు కావొచ్చు, పాదాల‌కు కావొచ్చు ఆరేసి వేళ్ల‌తో జ‌న్మించారు. ఇక ఈ ఆరు వేళ్ల‌తో మాకు ఎలాంటి స‌మ‌స్య‌లు లేవు. చెప్పులు, షూ ధ‌రించిన‌ప్పుడు కాస్త ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. మా కుటుంబ స‌భ్యులు బాబ‌ర్‌పూర్‌తో పాటు ప‌క్క‌నే ఉన్న నోహ్రా గ్రామంలోనూ నివ‌సిస్తున్నారు అని జానీ తెలిపాడు.


ఒకే కుటుంబంలో చాలా మంది ఆరు వేళ్ల‌తో జ‌న్మించ‌డాన్ని వైద్య ప‌రిభాష‌లో పాలీడాక్టిలీ అంటార‌ని వైద్యాధికారి డాక్ట‌ర్ జైన్ శ్రీ తెలిపారు. ఇలాంటి స‌మ‌స్య వార‌స‌త్వంగా వ‌స్తుంద‌న్నారు. ఇది జెనిటిక్ ప్రాబ్లం అని, కొన్ని త‌రాల వ‌ర‌కు ఇది కొన‌సాగే అవ‌కాశం ఉంద‌న్నారు. ఈ స‌మ‌స్య‌ను హోమియోప‌తి మెడిసిన్ ద్వారా అరిక‌ట్టే అవ‌కాశం ఉంద‌ని జైన్ శ్రీ తెలిపారు.