విధాత: ప్రస్తుతం జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నిక (Elections) ల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఒక నివేదిక (ADR Report) ను రూపొందించింది. ఈ మొత్తం అభ్యర్థుల్లో 29 శాతం మంది లక్షాధికారులేనని, 2,371 మంది కోటీశ్వరులని నివేదికలో పేర్కొంది. 18 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు స్వయంగా అఫిడవిట్‌లో పేర్కొన్నారని వెల్లడించింది.
మొత్తం 1,452 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా.. వీరిలో 959 (12 శాతం) మందిపై ఉన్నవి అత్యంత తీవ్రమైన ఆరోపణలని ఏడీఆర్ నివేదిక చెబుతోంది. ఈ కేసుల్లో దోషులుగా తేలితే 5 ఏళ్లు అంతకు పైబడి జైలులో శిక్ష అనుభవించాల్సి వస్తుందని పేర్కొంది. ఎన్నికల సంఘం నమోదు చేసిన కేసులు, చెక్ బౌన్స్‌లు, దాడులు, హత్యలు, అపహరణలు, అత్యాచారాలు, మహిళలపై వేధింపులు తదితర కేసులు ఈ 959 మందిపై ఉన్నట్లు పేర్కొంది.
దాదాపు 22 మంది అభ్యర్థులు హత్య కేసుల్లో నిందితులుగా ఉండగా.. 107 మంది మహిళలపై దాడులు చేసిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 107 మందిపై ఏకంగా అత్యాచార ఆరోపణలు ఉండటం గమనార్హం. అయిదు రాష్ట్రాల్లో పోటీ చేస్తున్న 8,054 మంది అభ్యర్థుల్లో 8,051 మంది అఫిడవిట్‌లను విశ్లేషించి ఏడీఆర్ ఈ నివేదికను రూపొందించింది.
తెలంగాణలో అత్యధికం..
అయిదు రాష్ట్రాల్లోనూ క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు ఎక్కువగా పోటీ చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ అభ్యర్థుల్లో 45 మంది మహిళలపై దాడులు, 27 మంది హత్యాయత్నాల కేసుల్లో నిందితులుగా ఉన్నారు. తెలంగాణ తర్వాతి స్థానంలో రాజస్థాన్ ఉంది. ఇక్కడ 36 మంది మహిళలపై దాడులు, 34 మంది హత్యాయత్నం కేసుల్లో ఉన్నారు. తర్వాతి స్థానల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ఏ అభ్యర్థి కూడా మహిళలపై దాడి యత్నించినట్లు, హత్యకు ప్రయత్నించినట్లు కేసులు ఎదుర్కోవడం లేదు.
అలాగే ఏ పార్టీ కూడా 2020లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించడం లేదని ఏడీఆర్ నివేదిక తేల్చిచెప్పింది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న అభ్యర్థులను పోటీలో నిలబెడితే.. వారికి ఎందుకు టికెట్ ఇవ్వాల్సి వచ్చిందో సదరు రాజకీయ పార్టీ కారణాలను బహిరంగంగా వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఈ ఆదేశాలను పాటించకపోవడం గమనార్హం.