Site icon vidhaatha

Mumbai | ప్ర‌భుత్వ హాస్ట‌ల్‌లో దారుణం.. విద్యార్థినిపై లైంగిక దాడి, హ‌త్య‌

Mumbai |

విధాత‌: మ‌హారాష్ట్రలోని అకోలాకు చెందిన విద్యార్థినిపై సెక్యూరిటీ గార్డ్ లైంగిక దాడి చేశాడు. అనంత‌రం యువ‌తిని దారుణంగా చంపేశాడు. ఆ త‌ర్వాత స‌మీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న ద‌క్షిణ ముంబైలో మంగ‌ళ‌వారం చోటుచేసుకున్న‌ది.

ద‌క్షిణ ముంబై (Mumbai)లో నాలుగు అంత‌స్థుల భ‌వ‌నంలో ప్ర‌భుత్వ బాలిక హాస్ట‌ల్ నిర్వ‌హిస్తున్నారు. ఈ హాస్ట‌ల్‌లో 40-50 మంది విద్యార్థులు ఉండి చ‌దువుకుంటున్నారు. పాలిటెక్నిక్ సెకండియ‌ర్ చ‌దువుతున్న 18 ఏండ్ల యువ‌తి నాలుగో అంత‌స్థు గ‌దిలో ఉంటున్న‌ది. తోటి విద్యార్థినులు సెల‌వుల్లో ఇండ్ల‌కు వెళ్ల‌గా, త‌ను ఒంటరిగా ఉంటున్న‌ది.

ఈ విష‌యం గ‌మ‌నించిన హాస్ట‌ల్ సెక్యూరిటీ గార్డ్‌, లాండ్రీ మ్యాన్‌గా ప‌నిచేసే ప్ర‌కాశ్ క‌నోజియా (35) విద్యార్థిపై లైంగిక‌దాడి చేసి చంపేసిన‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. చెర్ని రోడ్డు స్టేష‌న్ రైల్వే ప‌ట్టాల‌పై అత‌డి మృత‌దేహాన్ని మంగ‌ళ‌వారం ఉద‌యం పోలీసులు గుర్తించారు.

మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ప్ర‌కాశ్ బ‌ట్ట‌ల మూట తీసుకొచ్చి సెక్యూరిటీ గ‌ది ఎదుట ప‌డ‌వేసిన దృష్ట్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి. అత‌డు హాస్ట‌ల్‌కు నీళ్ల వ్య‌వ‌హారం కూడా చూసే వ్య‌క్తి కావ‌డంతో టెర్ర‌స్ తాళాలు కూడా అత‌డి వ‌ద్దే ఉన్నాయి.

మంగళ‌వారం సాయంత్రం విద్యార్థిని హ‌త్య విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. విద్యార్ఙిని సెల్‌కు ఎన్నిసార్లు కాల్ చేసినా స్పంద‌న రాలేదు. బ‌య‌ట‌కు వెళ్లిన‌ట్టు రిజిస్ట్ర‌ర్‌లో సంత‌కం కూడా చేయ‌లేదు. దీంతో హాస్ట‌ల్‌లో త‌న గదికి వ‌చ్చి చూడగా బ‌య‌ట నుంచి తాళం వేసి ఉన్న‌ది.

కిటికీలో నుంచి చూడగా విద్యార్థి రెండు మంచాల మ‌ధ్య విగ‌త జీవిగా ప‌డి ఉన్న‌ది. ఆమెను రేప్ చేసి చంపేసిన‌ట్టు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జేజే ద‌వాఖాన‌కు త‌ర‌లించారు.

పోస్టుమార్టం నివేదిక వ‌స్తే పూర్తి విష‌యాలు వెల్ల‌డ‌వుతాయ‌ని పోలీస్ అధికారులు తెలిపారు. తాను ఒక్క‌దాన్నే ఉన్నాన‌ని తోడుగా రావాల‌ని, స్నేహితురాలికి విద్యార్ఙిని సోమ‌వారం రాత్రి 11 గంట‌ల ప్రాంతంలో ఫోన్‌చేసిన‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు. కానీ, వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల స్నేహితురాలు వెళ్ల‌లేద‌ని, ఆ రాత్రే ఈ ఘోరం జ‌రిగి ఉంటుంద‌ని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version