Chennai |
విధాత: చెన్నై నగర శివారులో మంగళవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ చోటు చేసుకున్నది. వాహనాలు తనిఖీ చేస్తుండగా తమపై దాడికి యత్నించిన నలుగురు అగంతకులను అడ్డుకొనే క్రమంలో జరిపిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. చనిపోయిన ఇద్దరు నిందితులపై చాలా పెండింగ్ కేసులు ఉన్నట్టు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరణై-పుదుచ్చేరి-అరుంగల్ రహదారిపై పోలీస్ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. రాత్రి 3.30 గంటల ప్రాంతంలో పోలీసు అధికారులు ఓ కారును ఆపేందుకు ప్రయత్నించారు. కానీ, అతివేగంగా వచ్చిన ఆ కారు పోలీసు జీపునే ఢీకొట్టింది.
గాయపడిన ఇద్దరిని చెంగల్‌పట్టు ప్రభుత్వ దవాఖాన తరలించగా, మార్గమధ్యంలోనే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారని పోలీసు అధికారి వెల్లడించారు. మృతులను ఎస్ వినోద్ అలియాస్ చోటా వినోద్ (35), ఎస్ రమేశ్ (25)గా గుర్తించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితుల దాడిలో గాయపడిన సబ్ ఇన్‌స్పెక్టర్ శివగురునాథన్‌ను చికిత్స నిమిత్తం క్రోమ్‌పేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.