విధాత: గూగుల్ మ్యాప్ కొంపముంచింది. ఓ ఇద్దరు వైద్యుల ప్రాణాలను బలి తీసుకున్నది. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ఐదుగురు వ్యక్తులు కలిసి కారులో కొడుంగల్లూరు నుంచి కొచ్చికి ఆదివారం రాత్రి బయల్దేరారు.
గూగుల్ మ్యాప్ ఆధారంగా కారు ముందుకు కదులుతోంది. అయితే రాత్రి 12.30 గంటల సమయంలో కారు పెరియార్ నదిలోకి వెళ్లింది. దీంతో కారు నీట మునిగింది. కారు ముందు భాగంలో ఉన్న ఇద్దరు డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. వెనుకాల కూర్చున్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
కారు నీట మునగడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు వెలికితీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులను అద్వైత్(29), అజ్మల్(29)గా పోలీసులు గుర్తించారు.
వీరిద్దరూ కొచ్చిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో వైద్యులుగా పని చేస్తున్నారు. అయితే వైద్యులు ప్రయాణిస్తున్న కారు.. గూగుల్ మ్యాప్‌లో చూపించిన ఆధారంగా లెఫ్ట్ టర్న్ తీసుకోవడంతో, అది పెరియార్ నదిలోకి వెళ్లి నీట మునిగింది. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు.