విధాత : తెలంగాణలో మొంథా తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఖమ్మం, వరంగల్, అదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాద్, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలోని 16 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం జన్నారం వద్ద బ్రిడ్జిపై నుంచి వ్యాన్ పడిపోయిన ఘటనలో డ్రైవర్ గల్లంతయ్యాడు. రెస్క్యూ బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా అంబటిపల్లి-అసలికుంట మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు వరదలో ఓ కారు చిక్కుకుంది. పోలీసులు సకాలంంలో జేసీబీ సాయంతో కారుని బయటకు తీయడంతో అందులో ఉన్న వారు సురక్షితంగా బయటపడ్డారు. నల్లగొండ జిల్లా దేవరకొండ కోమ్మెపల్లి గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో వరదనీటిలో చిక్కుకున్న విద్యార్ధులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బృందం సురక్షితంగా బయటకు తరలించింది.
రాష్ట్ర వ్యాప్తంగా నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. పలు జిల్లాల్లో రహదారులపై వరద నీరు పారుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహబూబబాద్, డోర్నకల్ రైల్వే స్టేషన్లలో పట్టాలపై నీరు చేరడంతో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు.
మొంథా’ ఎఫెక్ట్ తో 127 రైళ్లు రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో 14రైళ్లను దారి మళ్లించారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగులోకోణార్క్ ఎక్స్‌ప్రెస్, డోర్నకల్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ లను, ఏపీలోని కృష్ణా జిల్లా కొండపల్లిలో సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ ను నిలిపివేసినట్లుగా తెలిపారు.
