TDR Hyderabad Real Estate | త్రిమూర్తుల చేతుల్లో ‘టీడీఆర్’ బందీ!

టీడీఆర్‌ అంటేనే హైదరాబాద్‌ రియల్టర్లు, డెవలపర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఒకప్పుడు బహిరంగ మార్కెట్‌లో లభించిన టీడీఆర్‌లు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఓ ముగ్గురు చేతుల్లోకి గంపగుత్తగా వెళ్లిపోయాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విధాత, హైదరాబాద్ :
TDR Hyderabad Real Estate | టీడీఆర్. ట్రాన్స్ ఫర్ డెవలప్‌మెంట్‌ రైట్స్. ఈ పేరు వింటేనే బిల్డర్ల గుండెల్లో గడ్డపారలు గుచ్చుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు విక్రయం కాని ఫ్లాట్లు కన్పించినా, అప్పులిచ్చిన వారు వచ్చినా డెవలపర్లకు నిద్రపట్టేది కాదు. కానీ ఇప్పుడు టీడీఆర్ పేరు వింటేనే బీపీ వచ్చినట్లుగా వణికిపోతున్నారు. హైదరాబాద్ మహా నగరంలో రియల్ వ్యాపారం చేయాలా వద్దా అనే స్థితికి హైదరాబాద్ డెవలపర్లు వచ్చారంటే కాంగ్రెస్ సర్కార్ ఎంతగా భయపెడుతుందో అర్థమవుతున్నదని చిన్న బిల్డర్లు చెబుతున్నారు. రెండేళ్లుగా జనాల నుంచి టీడీఆర్‌లను గుంజుకుని తమ జేబులో వేసుకునే పనిలో ముగ్గురు ప్రముఖులు నిమగ్నమై ఉన్నారు. ఇక మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు టీడీఆర్‌లు లేవని నిర్థారణకు వచ్చిన తరువాత అసలు కథ మొదలు పెట్టారు.

గతంలో ఎవరైనా డెవలపర్ టీడీఆర్ కొనుగోలు చేయాలనుకుంటే.. బహిరంగ మార్కెట్‌లో పలువురు అందుబాటులో ఉండేవారు. తమకు అవసరం అయినంత మేరకే టీడీఆర్‌ను తక్కువ ధరకు విక్రయించే వారి దగ్గర నుంచి కొనుగోలు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేకుండా చేసి ముగ్గురి వద్దే తప్పనిసరిగా కొనుగోలు చేసేలా పరిస్థితులను తీసుకువచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ (పాతది), హెచ్ఎండీఏ పరిధిలో పది అంతస్తులకు మించి బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణం చేసేవారు టీడీఆర్ కొనేలా ఉత్తర్వులు జారీ చేశారు. అది కూడా దరఖాస్తు చేసుకోవడానికి ముందే కొనుగోలు చేయాలని నిబంధన విధించారు. దీంతో తమ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా మారిందని డెవలపర్లు వాపోతున్నారు.

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పరిస్థితి దారుణంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రియల్టర్ల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారిందని చెబుతున్నారు. ఇప్పటి కంటే.. గత ప్రభుత్వాలే మేలనే విధంగా బిల్డర్లలో చర్చలు సాగుతున్నాయి. ఈ రంగంపై ఆధారపడి లక్షల మంది కార్మికులు, అనుబంధ రంగాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్ రంగం ఎన్నో వ్యాపారాలతో ముడిపడి ఉంది. ఈ రంగం కుదేలైతే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోపాటు ప్రజల కొనుగోలు శక్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి రంగంపై నీలి నీడలు కమ్మేలా ప్రభుత్వం వ్యవహరించిందనే విమర్శలు గతంలో విన్నాం. కానీ ఈసారి అలా కాకుండా అడ్వాన్స్ ప్లాన్ తో ప్రభుత్వ పెద్దలు వ్యూహం రూపొందించారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ అక్రమాలకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్, ప్లానింగ్ అధికారులు సంపూర్ణంగా సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సంస్థల పరిధిలో ఉన్న టీడీఆర్ లబ్ధిదారుల జాబితాను టౌన్ ప్లానింగ్ విభాగం అధిపతుల నుంచి సేకరించి, వారికి అధికారులతో నేరుగా ఫోన్ చేయించి, తమ కార్యాలయానికే పిలిపించుకుని బేరసారాలు ఆడారనే ఆరోపణలు రియల్‌ ఎస్టేట్‌ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. తమ మాట వినని వారిని బెదిరింపులకు గురి చేసి, చౌక ధరకు స్వాధీనం చేసుకున్నారని టౌన్ ప్లానింగ్ ఉద్యోగులే చెబుతున్నారు. ఇంతటి దారుణం ఏ ప్రభుత్వంలో కూడా చూడలేని వారు వ్యాఖ్యానించడం విశేషం.

ఇక మార్కెట్‌లో ఎక్కడా టీడీఆర్‌లు లేవనే నిర్థారణకు వచ్చిన తరువాత… ముఖ్యనేతతో కలిసి తమ ప్రతాపాన్ని చూపించారు. హైదరాబాద్ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో పది అంతస్తులకు మించి భవనాలు నిర్మాణం చేసేవారు, ముందుగానే టీడీఆర్ కొనుగోలు చేయాలని షరతు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీఆర్ ఉంటేనే దరఖాస్తు అనుమతించేలా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేశారు.

ఒకప్పుడు మార్కెట్‌లో చౌకగా లభించిన టీడీఆర్…. ఈ ముగ్గురి పుణ్యమా అని మూడింతలు పెరిగిందని రియల్ ఎస్టేట్ వర్గాలు లబోదిబోమంటున్నాయి. కోట్లు వెచ్చించి కొనుగోలు చేసే బదులు దరఖాస్తు చేయకుండా నోరు మూసుకుని ఉండడమే ఉత్తమం అనే నిర్ణయానికి మెజారిటీ బిల్డర్లు వచ్చారనే ప్రచారం జరుగుతోంది. దరఖాస్తు సమయంలోనే టీడీఆర్ కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయలు వెచ్చించి, ఆ తరువాత అదనపు అంతస్తులు వేయకపోతే పూర్తిగా మునిగిపోతామనే భయం డెవలపర్లలో నెలకొన్నది. గతంలో అనుమతులు తీసుకున్న తరువాత, అదనపు అంతస్తులు వేయాలంటే ఆదాయ, వ్యయాలను అంచనా వేసి టీడీఆర్ లను కొనుగోలు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేకుండా చేశారని బిల్డర్లు భగ్గుమంటున్నారు.

ఇందుకోసమేనా జయేశ్‌ రంజన్‌ను తీసుకొచ్చింది?

మొన్నటి వరకు సీఎంవో కార్యాలయంలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ను అక్కడి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. సీఎంవో నుంచి బదిలీ చేసి మెట్రోపాలిటన్ ఏరియాకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనను నియమించారు. ఆ తరువాత జీహెచ్ఎంసీని ఇష్టారీతిన, ఒక పద్ధతి లేకుండా మూడు ముక్కలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లను కొనసాగిస్తూ, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్లలో 75 డివిజన్ల చొప్పున కొనసాగించారు. ఈ మూడు కార్పొరేషన్లకు ముఖ్య కార్యదర్శి స్థాయి ఐఏఎస్‌లను కమిషనర్లుగా నియమించాల్సి ఉండగా కార్యదర్శి స్థాయి కన్నా తక్కువ స్థాయి ఐఏఎస్‌లను నియమించడం గమనార్హం. ఈ మూడు కార్పొరేషన్లను పర్యవేక్షించే బాధ్యతలను జయేశ్‌ రంజన్‌కు అప్పగించారు. ఆయనకు పాలనాపరంగా, విధాన పరంగా నిర్ణయం తీసుకునే అధికారం ఇస్తూ విస్తృత‌ అధికారాలు కట్టబెట్టారు. ఇది… మూడు కార్పొరేషన్లలో విధానపరమైన నిర్థయాలు తీసుకునే అధికారం కమిషనర్లకు లేకుండా చేతులు కట్టేయడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జయేశ్‌ రంజన్‌.. సూపర్ పవర్‌గా మారారని అంటున్నారు. ఈ మూడు కార్పొరేషన్లలో ముఖ్యమైన పనుల కోసం ఆయన వద్దకే వెళ్లే విధంగా ఉత్తర్వులు ఇచ్చారనే చర్చ జరుగుతోంది.

Latest News