Hyderabad FSI Rule | ఇకనైనా ఎఫ్ఎస్ఐ తెస్తారా? లేక హైదరాబాద్ నగరాన్ని చంపుతారా?

ముంబైలో హెక్టార్‌ విస్తీర్ణంలో 274 మంది నివసిస్తుంటే.. అది ఢిల్లీలో 239గా ఉంది. మరి మన హైదరాబాద్‌లో? 10వేల మందికిపైగా నివసించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌ పరిమితులు లేకపోవడంతో రియల్టర్లు యథేచ్ఛగా ఆకాశహర్మ్యాలు నిర్మిస్తున్నారు. సమీప ప్రాంతాలను సంక్షోభంలోకి నెడుతున్నారు.

Hyderabad FSI Rule | ఇకనైనా ఎఫ్ఎస్ఐ తెస్తారా? లేక హైదరాబాద్ నగరాన్ని చంపుతారా?
  • అడ్డగోలు నిర్మాణాలకు కేరాఫ్ హైదరాబాద్
  • ఎన్బీసీ ప్రమాణాలకు నిలబడని కట్టడాలు
  • పట్టించుకోని అధికారులు.. చెలరేగుతున్న రియల్టర్లు

హైదరాబాద్, విధాత ప్రతినిధి:

Hyderabad FSI Rule | హైదరాబాద్‌! ప్రపంచంలోనే ప్రఖ్యాత నగరంగా ఎదిగిన మెట్రోపాలిటన్‌ సిటీ! కానీ.. అంతర్జాతీయ ఖ్యాతిని దెబ్బతీసేలా నగరంలోని నిర్మాణ పరిస్థితులు ఉంటున్నాయన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అడ్డూ అదుపూ లేకుండా జరుగుతున్న హైదరాబాద్ మహానగర అభివృద్ధి గురించి ప్రభుత్వం, పౌరసమాజం మేల్కొనవలసిన సమయం ఆసన్నమైందని నిపుణులు చెబుతున్నారు. నగరాభివృద్ధిలో పాటించవలసిన అన్ని ప్రమాణాలనూ ఉల్లంఘించి నిర్మాణరంగం విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. నగరంలో ఎక్కడపడితే అక్కడ ఆకాశ హర్మ్యాల నిర్మాణాలను అనుమతిస్తున్నారు. అనుమతించిన చోట కూడా అడ్డగోలుగా అపరిమిత నివాసాలను గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. దీంతో నగరంలో ఏ మూల చూసినా ట్రాఫిక్ జామ్‌లు నిత్యకృత్యాలు అయ్యాయి. తాగునీరు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతున్నది. నగరంలో పచ్చదనం బాగా తగ్గిపోతున్నది. సైబర్ టవర్స్‌ నుంచి నియోపోలిస్ దాకా ఒక్కటి కూడా విశాలమైన ఉద్యానవనం లేదు. ఉన్న భూమినంతా ప్రభుత్వం వేలం వేసుకుంటూ పోతున్నది. సామాన్యుల సంగతి సరేసరి.. ఎగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు కూడా నివాసాలు కొనుక్కోలేని విధంగా భూముల ధరలను, ప్లాట్లు, ఫ్లాట్ల ధరలను రిగ్గింగ్‌ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అమ్మకం కాని నివాస యూనిట్ల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. అదే సమయంలో ఖాళీగా ఉండే వాణిజ్య భవనాల సంఖ్యా పెరుగుతున్నది.

కృత్రిమ వాతావరణంలో.. కుక్కేస్తున్నారు!

మన్నికయిన, నివాసయోగ్యమైన, తగినంత ఖాళీస్థలం, ఉద్యానవనాలతో కూడిన నిర్మాణాల బదులు కృత్రిమమైన వాతావరణంలో వేలాది మందిని కుక్కే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు. మొదటిది, నగరంలో జోనింగ్ విధానం అంటూ లేదు. రెండు.. ఎంత వైశాల్యంలో ఎంత స్థల (ఎస్‌ఎఫ్‌టీ) నిర్మాణం చేయవచ్చు అన్నదానికి సంబంధించిన పరిమితి లేదు. దేశంలో అన్ని నగరాల్లో –వైశాల్యం, నిర్మించే స్థల సూచీ (ఎఫ్ఎస్ఐ)– అమలులో ఉంది. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం ఒక అడుగు విస్తీర్ణంలోని భూమికి 1.5 నుంచి 2.5 అడుగుల విస్తీర్ణం స్థలాన్ని(ఎస్ఎఫ్‌టీ) నిర్మించుకోవడానికి అనుమతిస్తారు. నగరాన్ని జోన్లుగా విభజించి కొన్ని జోన్లలో మాత్రమే ఆకాశ హర్మ్యాలను నిర్మించడానికి అనుమతిస్తారు. కానీ హైదరాబాద్‌లోనే అన్ని పరిమితులను ఎత్తివేసి నిర్మాణాలను అనుమతిస్తున్నారు.

ఎఫ్‌ఎస్‌ఐ నిబంధన ఎత్తేసిన వైఎస్‌

నిర్మాణరంగాన్ని ప్రోత్సహించే పేరుతో ఎఫ్ఎస్ఐ నిబంధనను 2006లో అప్పటి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఎత్తివేసింది. అయినా అసాధారణ నిర్మాణాలేవీ పెద్దగా జరుగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్మాణ రంగానికి రెక్కలు వచ్చాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అపరిమిత నిర్మాణాలను అనుతిస్తూ పోయింది. పార్కులు, స్కూళ్లు, కమ్యూనిటీ స్థలాలు అంటూ ఏమీ లేకుండా చుక్కలనంటే నిర్మాణాలకు పచ్చ జెండాలు ఊపారు. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తాను ఎఫ్ఎస్ఐని తిరిగి ప్రవేశపెడతానని కూడా చెప్పారు. రెండేళ్లయినా ఆ ఊసు లేదు. నిర్మాణాల విశ్వరూపం ఎలా ఉందంటే– ఏడున్నర ఎకరాల్లో 3500 నివాస యూనిట్ల నిర్మాణం జరుగుతున్నది. ఎఫ్ఎస్ఐ నిబంధన లేకపోవడంతో దేశంలోని ఎక్కడెక్కడి నిర్మాణ సంస్థలూ హైదరాబాద్‌లోనే పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో భూముల ధరలు, ఫ్లాట్లు, విల్లాల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి.

ఒకవైపే కేంద్రీకరణ

అన్ని వైపులా విస్తరించడానికి అవకాశం ఉన్న హైదరాబాద్ నగరంలో ఒకేవైపు నిర్మాణాలు కేంద్రీకృతం అవుతున్నాయి. దీని వల్ల హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌, నియోపోలిస్‌ ప్రాంతాలపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతున్నది. ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో 60కిపైగా టవర్లు నిర్మిస్తున్నారంటే.. భవిష్యత్తులో ఆ ప్రాంతం ఏమి కానున్నదో అర్థం చేసుకోవచ్చు. గచ్చిబౌలి నుంచి నార్సింగి వరకు గత ఐదు సంవత్సరాల్లోనే రెండుసార్లు రోడ్ల విస్తరణ జరిగింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఆనుకుని పెంచిన గ్రీన్ స్పేస్ అంతా హరించుకుపోతున్నది. ఈ ప్రాంతాల్లో ప్రయాణించాలంటే ఉదయం, సాయంత్రం నరకమే చూడవలసి వస్తున్నదని వాహనదారులు చెబుతున్నారు. రెండు మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి కూడా కనీసం అరగంట నుంచి గంట సమయం వెచ్చించవలసి వస్తున్నది.

ఎన్బీసీ ప్రమాణాలేమిటి?

నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారం సాధారణంగా ఎకరానికి 30 నుంచి 100 నివాస యూనిట్ల వరకు ఉండవచ్చు. మహానగరాల్లో, ఆర్థిక జిల్లా ప్రాంతాల్లో అయితే ఎకరానికి 200 నివాస యూనిట్ల వరకు అనుమతించవచ్చు. జనసాంద్రత, మౌలిక సదుపాయాలు, గ్రీన్ స్పేసెస్ మధ్య తగినంత సమతుల్యత లేకపోతే నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించడం సాధ్యం కాదని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఒక హెక్టార్‌ విస్తీర్ణంలో 150 నుంచి 350 మంది వరకు నివసించే విధంగా నిర్మాణాలు జరగాలని నేషనల్ బిల్డింగ్ కోడ్ సూచిస్తున్నది.

హైదరాబాద్‌లో హెక్టారు విస్తీర్ణంలో 10,500 మంది!

ముంబైలో హెక్టారు విస్తీర్ణంలో 274 మంది నివసిస్తుంటే, ఢిల్లీలో హెక్టారుకు 239 మంది మాత్రమే నివసిస్తున్నారని ముంబైకి చెందిన ఆర్కిటెక్ట్ ఒకరు విశ్లేషించారు. ఎన్బీసీ ఇంకో ప్రమాణం కూడా చెబుతున్నది– ప్రతి మనిషికి నాలుగు చదరపు మీటర్ల ఓపెన్ స్పేస్ ఉండే విధంగా నగర నిర్మాణాలు ఉండాలని సూచిస్తున్నది. ఈ ప్రమాణాల ప్రకారం హైదరాబాద్‌లో ఎన్ని నిర్మాణాలు లెక్కకు వస్తాయి? ఏడున్నర ఎకరాల్లో 3500 నివాస యూనిట్లు నిర్మిస్తే అందులో సగటున నివాసానికి ముగ్గురిని లెక్కవేసినా 10500 మంది నివసించాల్సి ఉంటుంది. అంటే హెక్టారుకు సుమారు 3400 మంది నివసిస్తారు. పోనీ ఆ ప్రాంతంలో విశాలమైన గ్రీన్ స్పేసెస్ ఏమైనా ఉన్నాయా అంటే అదీ లేదు. హైదరాబాద్‌లో అనేక ఆకాశ హర్మ్యాల పరిస్థితీ ఇదే.

ఇవి చదివారా?

FSI : ఆకాశ‌హర్మ్యాలపై ప‌రిమితులు విధిస్తామంటే రియల్టర్లకు ఉలుకెందుకు?
Another SkyLab | పది పదిహేను రోజుల్లోనే భూమిపై పడనున్న మరో ‘స్కైలాబ్‌’.. పడేది ఎక్కడంటే..
హైదరాబాద్‌ ఇక నివాస యోగ్యం కాదా? పట్టని పాలకులు.. అడ్డగోలుగా అనుమతులు