కమర్షియల్ వంటగ్యాస్​ కొరత: మూసివేత దిశగా హోటళ్లు, హాస్టళ్లు?

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో భారత్‌లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా తగ్గుతోంది. మెట్రో నగరాల్లో హోటళ్లు, హాస్టళ్లు మూసివేత హెచ్చరికలు వినిపిస్తున్నాయి. పూణేలో గ్యాస్ శవదహన వాటికలు కూడా తాత్కాలికంగా మూసివేశారు. తెలంగాణలో హోటళ్ల నిరసన గళం.

కమర్షియల్ వంటగ్యాస్​ కొరత: మూసివేత దిశగా హోటళ్లు, హాస్టళ్లు? పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో భారత్‌లో గ్యాస్ సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్నాయి

War Shock to India: Commercial LPG Shortage Sparks Hotel Shutdown Fears

సారాంశం
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో భారత్‌లో కమర్షియల్ ఎల్పీజీ సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్నాయి. మెట్రో నగరాల్లో హోటళ్లు, హాస్టళ్లు గ్యాస్ కొరత ముప్పును ఎదుర్కొంటున్నాయి.
  • యుద్ధం కొనసాగితే.. ఇంతే సంగతులు!
  • మెట్రో నగరాల్లో మొదలైన గ్యాస్​ గొడవ
  • పూణేలో మూతబడ్డ గ్యాస్ శ్మశాన వాటికలు

విధాత, 10 మార్చి 2026, హైదరాబాద్

మెట్రో నగరాల్లో కమర్షియల్ సిలిండర్ల డెలివరీ పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో హోటల్ పరిశ్రమ విలవిల్లాడుతోంది. ఒకటి రెండు రోజుల్లో సిలిండర్లు నిండుకుంటాయని, ఇలాగైతే హోటళ్లను నడపడం బదులు మూసివేసుకోవడమే ఉత్తమమంటూ కర్నాటక రాష్ట్ర హోటల్ పరిశ్రమల యాజమాన్యం సోమవారం నాడు ఆల్టిమేటం జారీ చేసింది. దీనిపై పరిష్కారం మార్గం చూపించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరాయి. ఇదే పరిస్థితి ముంబై, కొలకత్తా నగరాలను కూడా వేధిస్తున్నది హైదరాబాద్ లో కూడా ఇప్పటికిప్పుడు ఆందోళన పడాల్సిన పరిస్థితులు లేనప్పటికీ వారం పదిరోజుల్లో కమర్షియల్ సిలిండర్ల లభ్యత తగ్గితే గగ్గోలు మొదలవుతుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తల నేపథ్యం, హర్మూజ్ జల సంధిలో క్రూడాయిల్ రవాణా నిలిచిపోవడం, డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడంతో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. వీలైనంత మేరకు ఎల్పీజీ ఉత్పత్తి పెంచాల్సిందిగా ఆయిల్ కంపెనీలను సోమవారం నాడు ఆదేశించింది.

యుద్ధ ప్రభావం.. చమురు సరఫరా అంతరాయం

Crude oil production rigs and barrels illustrating rising oil prices amid Middle East conflict - AI image

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పెరుగుతున్న క్రూడాయిల్ ధరలను సూచించే చమురు తవ్వక యంత్రాలు, ఆయిల్ బారెల్స్

ఇరాన్ దేశంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఊపిరి సలపని విదంగా ముప్పెట దాడిని కొనసాగిస్తున్న విషయం అందరికీ విధితమే. ఏమాత్రం తగ్గేది లేదు అనే విధంగా విరుచుకుపడుతుండడంతో ఇరాన్ తీవ్రంగా నష్టపోతున్నది. దీనికి ప్రతిగా ఇరాన్ దేశం అరబ్ దేశాలపై దాడులు జరుపుతున్నది. ఫలితంగా ఆ ప్రభావం క్రూడాయిల్ తవ్వకాలు, సరఫరా పై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఇప్పటికే హర్మూజ్ జల సంధి మార్గం గుండా చమురు నౌకలను ముందుకు కదలకుండా ఇరాన్ అడ్డుకట్టలు వేస్తున్నది. ఈ జల సంధి మార్గం ద్వారా భారతదేశానికి పెద్ద మొత్తంలో (80 శాతం) చమురు రవాణా అవుతుంది. దేశంలో సాలీనా వినియోగిస్తున్న 31.3 మిలియన్ టన్నులలో 87 శాతం గృహ‌ అవసరాలకు వినియోగిస్తుండగా, కేవలం 13 శాతం మాత్రం కమర్షియల్ అవసరాలకు మళ్లిస్తున్నారు.

దేశంలో సోమవారం నుంచి కమర్షియల్ సిలిండర్ల డెలివరీ తగ్గిపోవడం మూలంగా హోటల్ పరిశ్రమ మూసివేసే పరిస్థితి ఏర్పడిందని ఇండియా హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ శెట్టి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించకపోతే మూసుకోవడం మరో మార్గం లేదని నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా కేంద్రానికి స్పష్టం చేసింది. ఇప్పటికే గురుగ్రామ్​లో గ్యాస్​ స్థానంలో విద్యుత్  పొయ్యిలను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా స్థానిక అధికారులు  సూచించారు.

Commercial LPG cylinders stacked inside a hotel kitchen as chefs wait amid gas supply shortage - AI image

కమర్షియల్ ఎల్పీజీ సరఫరా తగ్గడంతో హోటల్ కిచెన్లలో గ్యాస్ నిల్వలపై ఆందోళనలు పెరుగుతున్నాయి

మహారాష్ట్ర పూణే నగరంలో గ్యాస్ తో నడిచే శ్మశాన వాటికలను మున్సిపాల్టీ అధికారులు మూసివేశారు. వాణిజ్య సిలిండర్ల సరఫరా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రత్యామ్నాయ పద్ధతుల్లో మృత‌దేహాల దహనం కోసం ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ప్రజలకు సూచించారు. ఎల్పీజీ సరఫరా మెరుగుపడిన తరువాత దహన వాటికలను పునరుద్దరిస్తామని అధికారులు స్పష్టం చేసారు.

కాగా, సరిపడా ఎల్పీజీ సరఫరా చేయడంలో విఫలమైనందున రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు హోటళ్లను మూసివేసి నిరసన తెలపాలని తెలంగాణ హోటల్స్​ అసోసియేషన్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, లేదంటే శాశ్వతంగా మూసుకోవాల్సిన దుస్థితి వస్తుందని హెచ్చరించారు. యుద్ధానికి ముందు వాణిజ్య సిలిండర్ ధర హైదరాబాద్ లో రూ.2,076.5 గా ఉంది. యుద్ధం కొనసాగుతుండడంతో పెట్రోలియం ఉత్పత్తుల కంపెనీలు కమర్షియల్ సిలిండర్ పై రూ.115, గృహావసర సిలిండర్ పై రూ.60 పెంచిన విషయం తెలిసిందే.

తెలంగాణలో ప్రతి నెలా 7.60 లక్షల సిలిండర్ల సరఫరా

LPG delivery worker carrying a gas cylinder amid rising demand and supply concerns in India

దేశంలో ఎల్పీజీ సరఫరా ఒత్తిడి మధ్య వినియోగదారులకు సిలిండర్లు పంపిణీ చేస్తున్న డెలివరీ సిబ్బంది

తెలంగాణ రాష్ట్రంలో 802 మంది ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఉండగా భారత్​ పెట్రోలియం, ఇండియన్​ ఆయిల్​, హిందుస్తాన్​ పెట్రోలియం కంపెనీలు ప్రతిరోజు దాదాపు 2,30,000 సిలిండర్లు వినియోగదారులకు చేరవేస్తున్నారు. ఈ మూడు కంపెనీలు ప్రతి నెలా 70 లక్షల 60వేల వరకు సిలిండర్లు డెలివరీ చేస్తున్నాయి. ప్రతి రోజు సగటున సరఫరా అవుతున్న డొమెస్టిక్ సిలిండర్లు (14.2 కేజీలు) 2,25,999 కాగా కమర్షియల్ సిలిండర్లు (19 కేజీలు) 23,500. కాగా, కమర్షియల్ సిలిండర్ల వినియోగం హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో అత్యధికంగా ఉంది.