Skyscrapers | హైదరాబాద్ నగరంలో ఆకాశ హర్మ్యాలతో లాభమా? నష్టమా?
మీ కాలనీలో రోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్ ఎందుకు పొంగి పొర్లుతున్నదో మీకు తెలుసా? ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనే పద్ధతిని పాటించకుండా.. యథేచ్ఛగా ఆకాశ హర్మ్యాలను నిర్మించుకునేందుకు బడా కాంట్రాక్టర్లకు ఎడాపెడా అనుమతులు ఇచ్చుకుంటూ పోవడం వల్లే. అర్థం కాలేదా? వెయ్యి మంది జీవించే ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థను లక్ష మంది ఉపయోగిస్తే? ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్నది ఇదే! అందుకే జనానికి ఈ కష్టాలు!!

Skyscrapers । హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆకాశహర్మ్యాలకు (Skyscrapers) విచ్చలవిడిగా అనుమతులిస్తున్నారు. ముప్పై, నలుబై అంతస్తుల కాలం పోయి ఇప్పుడు ఏకంగా యాభై, అరవై అంతస్తులకు అనుమతులిస్తున్నారు. దేశంలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (FSI) పరిమితులు లేని ఏకైక నగరం హైదరాబాద్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2006లో కొందరు బిల్డర్లకు మేలు చేయడంకోసం ఎఫ్ఎస్ఐ (Floor Space Index) నిబంధనలను ఎత్తివేశారు. అయినా ఆయన హయాంలో ముప్పై అంతస్తులకు మించి టవర్లు నిర్మించలేదు. కానీ గత ఐదారేళ్లలోనే అంతులేకుండా అంతస్తులను అనుమతిస్తూ పోతున్నారు. తాజాగా 60 అంతస్తులతో రెండు టవర్ల నిర్మాణం జరుగబోతున్నదని చెబుతున్నారు. హైదరాబాద్‌కు నలువైపులా విస్తరించడానికి అవకాశం ఉన్నా ఈ టవర్ల సంస్కృతిని పెంచిపోషించడం వల్ల ఒకే ప్రాంతంపై మౌలిక సదుపాయాల భారం (infrastructure burden) అనూహ్యమైన రీతిలో పడుతున్నది. గచ్చిబౌలి (Gachibowli) నుంచి వెళ్లే రోడ్లన్నీ గత ఐదేళ్లలోనే రెండుసార్లు విస్తరించారు. ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road) వెంట పెంచిన పచ్చని చెట్లను విచ్చలవిడిగా నరికేసి రోడ్డును విస్తరించారు.
ఒక కిలోమీటరు రేడియస్‌లోనే అనేక వెంచర్లు
మైహోం అవతార్ (MyHome Avatar), రాజపుష్ప ప్రొవిన్సియా, వాసవి అట్లాంటిస్ (Vasavi Atlantis), అపర్ణ జెనాన్, సుఖీ ఉబంటు, ఎస్వీఎస్ వ్యూ, ఫీనిక్స్ ట్రైటన్, ముప్పాస్ అలంకృత వెంచర్లన్నీ ఒక కిలోమీటరు రేడియస్‌లోనే ఉన్నాయి. ఈ వెంచర్లన్నింటిలో కలిపి సుమారు 56 టవర్ల నిర్మాణం జరుగుతున్నది. కొన్ని పూర్తయ్యాయి. మరికొన్ని నిర్మాణ దశలో (under construction) ఉన్నాయి. అటు నార్సింగి నుంచి గండిపేట వెళ్లే మార్గంలోనూ, కోకాపేటలోనూ ఎటు చూసినా టవర్లే. 50, 60 అంతస్తుల టవర్లన్నీ ఇక్కడే రాబోతున్నాయి. ఎకరా స్థలంలో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం వరకు నిర్మించాల్సింది పోయి ఇప్పుడు ఎకరాకు ఏడు ఎనిమిది లక్షల చదరపు అడుగుల వరకు నిర్మిస్తున్నారు. టవర్ల నిర్మాణం ఏదో ఒక ప్రాంతానికి పరిమితంగా లేదు. నగరం నలుమూలలా ఎక్కడపడితే అక్కడ అనుమతి ఇస్తున్నారు. ఆధునిక నగరాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే టవర్ల నిర్మాణం అనుమతిస్తారు. ఎక్కపడితే అక్కడ అనుమతులు ఇవ్వడం ఏ నగరంలోనూ ఉండదు. హైదరాబాద్ మాత్రం అందుకు మినహాయింపు. టవర్లను నిర్మించేటప్పుడు అవసరమైన నీరు, రోడ్ల విస్తృతి, డ్రైనేజీ వ్యవస్థ (drainage system), గ్రీన్ స్పేస్, పార్కులు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ హైదరాబాద్‌లో ముఖ్యంగా హైటెక్ సిటీ(Hi-Tech City), ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు(Financial District)లలో ఎవరికి ఎంత భూమి ఉంటే అంత భూమిలో సెల్లార్లు తీసి మొత్తం సిమెంటు రూఫు వేసి పైన టవర్లు నిర్మిస్తున్నారు. గ్రీన్ స్పేస్‌కు, చెట్ల పెంపకానికి అవకాశమే లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి.
ఇళ్ల కొనుగోలుదారులకు మేలు చేస్తున్నారా?
ఎఫ్ఎస్ఐ పరిమితులు లేకుండా నిర్మాణాలు అనుమతించినందుకు వినియోగదారులకు (home buyers) ఏమైనా ప్రయోజనం ఉందా అంటే అదీ లేదు. అడ్డగోలు ధరలు. ఎస్ఎఫ్‌టీకి 18,000/20,000 రూపాయల వరకు చెబుతున్నారు. నిజానికి నిర్మాణ వ్యయం (construction cost) ఎస్‌ఎఫ్‌టీకి 3000 నుంచి 4000 రూపాయలకు మించదని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఎకరా 150 కోట్లు పెట్టి కొన్న భూమిలో ఆరు లక్షల ఎస్ఎఫ్‌టీ నిర్మిస్తే ఎస్ఎఫ్‌టీకి అయ్యే ఖర్చు సుమారు 2500 రూపాయలు. అంటే మొత్తంగా భూమి, నిర్మాణ వ్యయం అంతా కలిపి 6500 నుంచి ఏడువేల రూపాయల లోపే. అయినా హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లలో ఎస్‌ఎఫ్‌టీ 12000 రూపాయలలోపు ఎక్కడా అమ్మడం లేదు. ఇక సామాన్యులు కొనుగోలు చేసేదెక్కడ?
సైబరాబాద్‌లో ఒక్క పార్కూ లేదు!
విషాదం ఏమంటే హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లలో ఒకప్పటి బొటానికల్ గార్డెన్ (botanical garden) తప్ప కొత్తగా ఒక పెద్ద పార్కు కూడా నిర్మించలేదు. ఎక్కడ చూసినా టవర్లు, కాంక్రీటు జంగిల్ తప్ప ఒక పెద్ద పార్కును ఏర్పాటు చేయాలన్న ఆలోచనే టీజీఐఐసీకి (TGIIC) రాలేదు. ఉన్న భూములను అమ్మడం మీద శ్రద్ధ పెడుతున్నారుగానీ.. భవిష్యత్తులో తలెత్తబోయే ప్రమాదం గురించి ఆలోచించడం లేదు.
అగ్నిమాపన 18 అంతస్తుల వరకే
మన నాయకులు అద్భుతమైన టవర్లు నిర్మిస్తున్నామని సంబరపడుతున్నారు తప్ప, ఆ టవర్లలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎదుర్కోడానికి ఉన్న అవకాశాల గురించి యోచించడం లేదు. హైదరాబాద్‌లో అగ్నిమాపకదళం వద్ద ఇప్పటికి 18 అంతస్తుల వరకే అందుకోగల అగ్నిమాపక యంత్రాలు (extinguishers) ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. యాభై అరవై అంతస్తులను నిర్మిస్తే ఏదైనా ప్రమాదం జరిగితే ఆపై అంతస్తులలో ఉన్నవారి పరిస్థితి ఏమిటి? వారిని ఎలా కాపాడతారు? వారి భద్రతకు ఎవరు పూచీపడతారు? నిన్నగాక మొన్న హైటెక్ సిటీలో ఒక కంపెనీ టవర్‌లో గ్యాస్ సిలిండరు పేలి పెద్ద ప్రమాదమే జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కువమంది సిబ్బంది ఆ భవనంలో లేకపోవడం వల్ల ప్రాణనష్టం వాటిల్లలేదు. మరో టవరులో కరెంటు షార్ట్ సర్క్యూట్ జరిగి ఏడంతస్తుల దాకా మంటలు ఎగిశాయి.
కాలుష్య నగరాల్లో ఏడవ స్థానం
హైదరాబాద్ దేశంలోని అత్యంత కాలుష్య నగరాల్లో (polluted cities) ఏడవ స్థానంలో ఉన్నట్టు తాజాగా ఒక సర్వే రిపోర్టు పేర్కొంది. ఇప్పుడే ఇలా ఉంటే ఈ అక్రమ/సక్రమ నిర్మాణాలన్నీ పూర్తయితే? ఒక పరిమిత ప్రాంతంలో వేలాది, లక్షలాది మంది జీవించాల్సిన పరిస్థితి ఏర్పడితే? గాలి పీల్చుకోవడానికి పచ్చని చెట్లు పది లేకపోతే? పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులలో గ్రీన్ కవర్ ఎంత శాతం ఉందో ఎవరయినా లెక్కలు తీస్తే మన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల ఆరోగ్యాలు ఎంత బాగా ఉండబోతున్నాయో అంచనా వేయవచ్చు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ నగరంలో స్పేస్ ఫ్లోర్ ఇండెక్స్ విధానాన్ని మళ్లీ తీసుకువస్తామని చెప్పారు. కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయంలో ఇంత వరకూ ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదు. ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే తగినంత సీవరేజీ సదుపాయాలు లేక హైదరాబాద్ మురికి కూపంలా మారే అవకాశాలు ఉన్నాయి. అసలు జన జీవనానికే హైదరాబాాద్ నగరం పనికి రాకుండా పోయే ప్రమాదం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ నగర భవితవ్యాన్ని కాపాడాలంటే ఎఫ్ఎస్ఐ విధానాన్ని తీసుకురావాలని నగర ప్రజలు కోరుతున్నారు.