FSI : ఆకాశహర్మ్యాలపై పరిమితులు విధిస్తామంటే రియల్టర్లకు ఉలుకెందుకు?
అయితే రియల్ ఎస్టేట్ మాఫియా మాత్రం.. రేవంత్ రెడ్డి ఆలోచనలనే ప్రభావితం చేసేలా ప్రయత్నిస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎఫ్ఎస్ఐ తీసుకు వస్తే ఏదో నష్టం జరిగిపోతుందనే ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఆకాశ హర్మ్యాలు కట్టి అమ్ముకొనే అవకాశం పోతుందనే దుగ్ధతోనే ఇటువంటి తప్పుడు ప్రచారాలకు ఒడిగడుతున్నారని అంటున్నారు.

- సోషల్ మీడియాలో రియల్ మాఫియా యాగీ
- ఎఫ్ఎస్ఐతోనే సురక్షిత హైదరాబాద్
- తేల్చి చెబుతున్న నిపుణులు
(విధాత ప్రత్యేకం)
హైదరాబాద్ ఒకప్పుడు పేదవాడి ఊటీ అన్న పేరు ఉండేది. అంతటి అహ్లాదకరమైన వాతావరణం హైదరాబాద్ సొంతం. ఎక్కడ చూసినా పూల తోటలు, విశాలమైన రోడ్లు, మండు వేసవిలో కూడా చల్లటి వాతావరణం ఈ నగరం ప్రత్యేకత. కాలక్రమేణా హైదరాబాద్‌ను రియల్ ఎస్టేట్ మాఫియా ఆక్రమించింది. అడ్డగోలుగా కాంక్రీట్ భవనాలు నిర్మించింది. దీంతో చల్లటి వాతావరణంలో ఉన్న హైదారాబాద్‌లో నేడు ఆ చల్లదనమే లేకుండా పోయింది. ఈ ఏడాది ఫిబ్రవరికి ముందే ఎండలు దంచి కొట్టడం ప్రారంభించాయి. దీనికి కారణం పచ్చదనం ఉండాల్సిన చోట కూడా కట్టడాలే వెలియడమే. రోడ్ల విస్తీర్ణాన్ని మించి భవనాలు వెలిశాయి. సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక హైరైజ్ ప్రాజెక్ట్ గురించి చెపుతూ 3000 చదరపు గజాలలో నిర్మించిన టవర్‌లో 500 కార్లు, 1000 బైక్‌లు ఉంటాయని అన్నారు. పరిమితులు లేకుండా నిర్మించిన ఆకాశహర్మ్యాల వల్ల రోడ్లపై నిత్యం ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. చిన్నపాటి వర్షం వచ్చినా రోడ్లు వరద కాలువలు అవుతున్నాయి. కాలనీలు, అపార్ట్‌మెంట్ల సెల్లార్లు చెరువులుగా మారుతున్నాయని, వర్షం వల్ల ఏర్పడిన అల్లకల్లోలాలనికి బీఆరెస్ ప్రభుత్వ విధానమే కారణమని రేవంత్ అప్పట్లో ఆరోపించారు. అలాగే హైదరాబాద్ ట్రాఫిక్ గందర గోళానికి బీఆరెస్ ప్రభుత్వం ఎఫ్ఎస్ఐని అమలు చేయకపోవడమే కారణమని రేవంత్ గతంలో విమర్శించారు.
హైదరాబాద్ మినహా అన్ని నగరాల్లో ఎఫ్ఎస్ఐ
వాస్తవంగా దేశవ్యాప్తంగా ఒక్క హైదరాబాద్ మినహా అన్ని నగరాలలో ఎఫ్ఎస్ఐ అమలులో ఉంది. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీమాంధ్ర రియల్ ఎస్టేట్ కంపెనీలను ప్రోత్సహించేందుకు 2006లో అప్పటి వరకు అమలులో ఉన్న ఎఫ్ఎస్ఐని ఎత్తివేశారు. ఆ తరువాత నుంచి క్రమంగా 30 నుంచి 50 అస్తులకు పైగా భవనాల నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగాయి. ల్యాంకో హిల్స్‌లో 121 అంతస్తుల భవన నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నట్లు ఆ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఒక్క కిలో మీటర్ రేడియస్ పరిధిలోనే పదుల కొద్దీ ఆకాశ హర్మ్యాలు వెలిశాయంటే హైదరాబాద్‌లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
విస్తరణతోనే మేలు
హైదరాబాద్ విస్తరించడానికి విశాలమైన భూభాగం ఉంది. నగరం నలువైపులా విస్తరించవచ్చు. దేశంలో ఏ మహా నగరానికి లేని ఆ అవకాశం హైదరాబాద్‌కే ఉన్నది. అలాంటి హైదరాబాద్‌లో ఆకాశ హర్మ్యాలు నిర్మించడం కన్నా.. నగరాన్ని విస్తరించడమే మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.గతంలో ప్రభుత్వం హైదరాబాద్ చుట్టు పక్కల వసతులు కల్పించి, కాలనీలు ఏర్పాటు చేసింది. అలా నగరం విస్తరించే అవకాశం కల్పించింది. కానీ రాను రాను ప్రభుత్వాల అధినేతలు కార్పొరేట్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ మాఫియా గుప్పిట్లో చిక్కుకొని, ఆయా కంపెనీల బాస్‌ల ఆలోచనలే ప్రభుత్వ నిర్ణయాలుగా అమలు చేసినట్లు కనిపిస్తున్నదనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఫలితంగా రాజపుష్ప, మై హోం, ఫీనిక్స్, వాసవి, వంశీరాం లాంటి అనేక సంస్థలు ఆకాశమే హద్దుగా టవర్లు నిర్మిస్తున్నాయి.
పెరిగిపోయిన జన సాంద్రత
వికృతంగా సాగిన భారీ భవనాల నిర్మాణాల ఫలితంగా ఒకే చోట జనసాంద్రత పెరిగి పోయింది. దాని ఫలితంగా ట్రాఫిక్ కష్టాలు, వాటితోపాటే మురుగు నీటి పారుదల కష్టాలు కూడా ఎక్కువయ్యాయి. 10 వేల మంది నివాసానికి సరిపోయే మురుగునీటి వ్యవస్థ ఉన్న చోట బహుళ అంతస్తుల టవర్లలో లక్ష మంది నివాసం ఉండేసరికి పాత డ్రైనేజీ వ్యవస్థ తట్టుకోలేక పోతున్నది. ఫలితంగా మురుగునీరు రోడ్లపైకి వచ్చి చేరుతున్నది. విపరీతమైన ట్రాఫిక్ కారణంగా రోడ్లు కూడా త్వరగా గుంతలమయం అవున్నాయి. ఇలాంటి పరిస్థితిలో నగరాన్ని కాపాడుకోవాలంటే నిర్మాణాలపై పరిమితులు విధించడం అవసరమేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్మాణాలపై పరిమితులు విధించాలని మాట్లాడారు. నగర విస్తరణలో భాగంగా ఫోర్త్ సిటీ నిర్మాణం చేస్తానని చెపుతున్నారు కూడా.. ప్రజలు ఫోర్త్ సిటీ వైపు వెళ్లాలన్నా నగరంలో మౌలిక వసతుల కల్సన జరగాలన్నా, ట్రాఫిక్ కష్టాలు తీర్చాలన్నా ఎఫ్ఎస్ఐ అమలు చేయాలని నిర్మాణ రంగ నిపుణులు అంటున్నారు.
గాయి గాయి చేస్తున్న రియల్ మాఫియా
నగరంలో క్రమబద్ధమైన నిర్మాణాల కోసం ఎఫ్ఎస్ఐ తీసుకు వచ్చే దిశగా పయనిస్తున్న క్రమంలో రియల్ మాఫియా హైదరాబాద్ నగరానికి ఏదో అయిపోతుందన్న రీతిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నదని, హైదరాబాద్ అభివృద్ది ఆగిపోతుందని, పెట్టుబడులు రావని, కంపెనీలు వెళ్లి పోతాయని గగ్గోలు పెడుతూ సోషల్ మీడియాలో కథనాలు వండి వారుస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని మీడియాలలో కూడా ఈ దిశగా కథనాలు వస్తున్నాయి. ‘దేశంలో ఏ నగరంలో కూడా ఆగిపోని అభివృద్ది ఎఫ్ఎస్ఐ వస్తే ఆగిపోతుందా? అర్థం లేని వాదనలు తెస్తూ మైండ్‌గేమ్ ఆడటం మినహా మరొకటి కాదు’ అని ఒక సీనియర్ జర్నలిస్ట్ అన్నారు. ‘ప్రస్తుత పరిస్థితి వల్ల 10 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి ఆఫీస్ టైమింగ్‌లో గంట సమయం పడుతుందని, ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇదేమి నరకం రా బాబూ అని విసుక్కుంటున్నారు. ఈ స్థితి పోవాలంటే ఎఫ్ఎస్ఐ అమలు చేయాల్సిందే’ అని పేరు రాయడానికి ఇష్టపడని ఒక టౌన్ ప్లానింగ్ అధికారి అన్నారు. నగరంలో ప్రశాంతమైన జీవితం, ఇబ్బందులు లేని ప్రయాణం, అహ్లాదకరమైన వాతావరణం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, కంపెనీలు పెట్టడానికి పెట్టుబడిదారులు వస్తారని అంటున్నారు. ఇప్పటివరకు బడా పెట్టుబడిదారులు బెంగళూరు. ముంబై లాంటి నగరాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, అదే ఇక్కడ ఒక మంచి వాతావరణం ఉంటే పెట్టుబడిదారులు కూడా భారీ ఎత్తున ఇక్కడకు వచ్చి శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుందని చెపుతున్నారు. అయితే రియల్ ఎస్టేట్ మాఫియా మాత్రం.. రేవంత్ రెడ్డి ఆలోచనలనే ప్రభావితం చేసేలా ప్రయత్నిస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎఫ్ఎస్ఐ తీసుకు వస్తే ఏదో నష్టం జరిగిపోతుందనే ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఆకాశ హర్మ్యాలు నిర్మించుకుని అమ్ముకొనే అవకాశం పోతుందనే దుగ్ధతోనే ఇటువంటి తప్పుడు ప్రచారాలకు ఒడిగడుతున్నారని అంటున్నారు.