Telangana Lands | భూముల విక్రయాలా? భ‌వ‌న నిర్మాణాల‌కు అడ్డ‌గోలు అనుమ‌తులా? ఏదీ స్కామ్‌?

నాటి చంద్ర‌బాబు, వైఎస్‌ ప్ర‌భుత్వాలైనా, మొన్న కేసీఆర్‌ స‌ర్కారైనా.. ఇప్పుడు రేవంత్‌డ్డి ప్ర‌భుత్వ‌మైనా.. అన్నీ ప్ర‌భుత్వ‌ భూముల విక్ర‌యాల ద్వారానే ఆదాయాన్ని స‌మ‌కూర్చుకుంటూ వ‌చ్చాయి. భూములు అమ్ముకొని ఆదాయాన్ని స‌మ‌కూర్చుకుంటామ‌ని ఎలాంటి భేష‌జాలు లేకుండా నిండు అసెంబ్లీలోనే ప్ర‌క‌టిస్తున్నాయి.

Telangana Lands | భూముల విక్రయాలా? భ‌వ‌న నిర్మాణాల‌కు అడ్డ‌గోలు అనుమ‌తులా? ఏదీ స్కామ్‌?

(మ‌నోహ‌ర కృష్ణ తూనుగుంట)
Telangana Lands | హెద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ (Hyderabad Central University) కి ఆనుకొని ఉన్న కంచ‌ గ‌చ్చిబౌలి (Kancha Gachibowli) లోని 400 ఎక‌రాల భూమిని రేవంత్ రెడ్డి స‌ర్కారు విక్ర‌యానికి పెట్ట‌డం వివాదంగా మారిన నేప‌థ్యంలో స్కామ్‌ల‌పై మ‌రోసారి విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. వాస్త‌వంగా ఏ ప్ర‌భుత్వాలైనా భూములు విక్ర‌యించ‌కుండా, ఉత్ప‌త్తి ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలి. నాటి చంద్ర‌బాబు, వైఎస్‌ ప్ర‌భుత్వాలైనా, మొన్న కేసీఆర్‌ స‌ర్కారైనా.. ఇప్పుడు రేవంత్‌డ్డి (Revanth Reddy) ప్ర‌భుత్వ‌మైనా.. అన్నీ ప్ర‌భుత్వ‌ భూముల విక్ర‌యాల ద్వారానే ఆదాయాన్ని స‌మ‌కూర్చుకుంటూ వ‌చ్చాయి. భూములు అమ్ముకొని ఆదాయాన్ని స‌మ‌కూర్చుకుంటామ‌ని ఎలాంటి భేష‌జాలు లేకుండా నిండు అసెంబ్లీలోనే ప్ర‌క‌టిస్తున్నాయి. భూములు అమ్మితే సంప‌ద క‌రిగి పోతుంది కానీ సంప‌ద పెర‌గ‌దు. ఇది గుర్తించ‌నిరాక‌రిస్తున్న పార్టీలు.. త‌మ ఓటు బ్యాంకు (Vote Bank) ను కాపాడుకునేందుకు అమ‌లు చేసే సంక్షేమ ప‌థ‌కాల కోసం భూములు తెగ‌న‌మ్మేందుకే మొగ్గుచూపుతున్నాయి. ఎందుకంటే.. అవి ఇన్‌స్టంట్ మ‌నీ మేక‌ర్స్‌. విచిత్రం ఏమిటంటే.. పాల‌క‌ప‌క్షంగా ఉన్న‌ప్పుడు భూముల అమ్మ‌కాల‌ను స‌మ‌ర్థించుకునే పార్టీలు.. ప్ర‌తిప‌క్షంలోకి మార‌గానే భూ సంర‌క్ష‌కుల అవ‌తారం దాల్చుతున్నాయి. తెలంగాణ‌లో భూముల అమ్మ‌కాల‌ను (selling of lands) నాడు ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీఆరెస్‌ (BRS) తీవ్రంగా వ్య‌తిరేకించింది. ఆందోళ‌న‌లు చేసింది. అదే బీఆరెస్ తెలంగాణ‌లో ప్ర‌భుత్వ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత వ‌రుస‌బెట్టి భూ విక్ర‌యాల‌కు దిగింది. ఇప్పుడు మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ కూడా ఆదాయం కోసం భూముల అమ్మ‌కాల‌నే న‌మ్ముకున్న‌ది. ఈ క్ర‌మంలోనే కంచ గ‌చ్చిబౌలిలో 400 ఎక‌రాల విక్ర‌యానికి రంగం సిద్ధం చేసింది. గ‌తంలో కోకాపేట‌(Kokapet), మోకిల (Mokila)  త‌దిత‌ర ప్రాంతాల్లో భూములను బీఆరెస్ విక్ర‌యిస్తే.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం దృష్టి కంచ గచ్చిబౌలిపై పడింది. ఏతావాతా తేలేదేమిటంటే.. భూముల విక్రయం విషయంలో రెండు పార్టీలదీ ఒకటే సిద్ధాంతం. కాకపోతే.. ఒక అడుగు ముందుకేసిన బీఆరెస్‌.. కంచ గచ్చిబౌలి భూముల వేలం విషయంలో భారీ స్కామ్ చోటుచేసుకున్నదని ఆరోపిస్తున్నది. గజం భూమి కూడా అమ్మకుండానే స్కామ్ జరిగిందని ఆరోపణల నేపథ్యంలో నిజానికి స్కామ్ అంటే ఏమిటనే చర్చ కూడా జరుగుతున్నది.

బీఆరెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు కేటీఆర్ త‌న‌కు ఇష్ట‌మైన బిల్డ‌ర్ల‌కు 12 వేల ల‌గ్జ‌రీ ప్లాట్ల నిర్మాణం కోసం రూ.1600 కోట్ల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేష‌న్ చార్జీల (Stamp duty and registration charges)  విన‌హాయింపు ఇచ్చార‌న్న విష‌యంలో ర‌చ్చ న‌డుస్తున్న‌ది. అలా మిన‌హాయింపులు ఇవ్వ‌డంలో ఆంత‌ర్యం ఏమిట‌న్న చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. ఇందులో ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ నిర్మాణానికి బ‌ల‌మైన పునాదులు వేసిన ప్ర‌ఖ్యాత అంత‌ర్జాతీయ ఆఫీస్ స్పేస్ డెవ‌ల‌ప‌ర్.. తన రెండో మెగా ప్రాజెక్టుకు ప్లాన్లు సిద్ధం చేస్తున్న సమయంలోనే గెంటేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెల్లాపూర్‌లో హెచ్ఎండీఏ వ‌ద్ద టిష్‌మన్ స్పేయర్‌.. వంద ఎకరాల భూమిని కొనుగోలు చేస్తే.. 2020 నాటికి అవి బీఆరెస్ అనుకూల వ్యక్తులకు చెందిన మై హోం, ప్రతిమ సంస్థల చేతిలోకి వెళ్లడంపై ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతున్నది.

నిజానికి హైద‌రాబాద్‌లో భ‌వ‌న నిర్మాణాల‌పై ప‌రిమితులు విధించకుండా, అడ్డ‌గోలుగా ఎంత ఎత్తైన భ‌వ‌నాల‌నైనా నిర్మించ‌డానికి అనుమ‌తులు ఇవ్వ‌డంలోనే భారీ స్కామ్ ఉంద‌న్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ‌చ్చిబౌలి, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌, మ‌ణికొండ‌, నాన‌క్ రామ్ గూడ‌, మంచి రేవుల‌, నార్సింగి, కోకాపేట, తెల్లాపూర్‌.. ఇలా ఔట‌ర్ రింగ్‌రోడ్‌ (Outer Ring Road)కు  రెండు వైపులా విచ్చలవిడిగా ఆకాశ హర్మ్యాలకు ప‌ర్మిష‌న్లు ఇవ్వ‌డం వెనుక ఆంత‌ర్యం ఏమిట‌న్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బ‌డా బిల్డ‌ర్ల‌కు మేలు చేసే ప‌ద్ద‌తిలో నీకింత‌.. నాకింత అన్న ప్రాతిప‌దిక‌న క్విడ్ ప్రో కోలో అనుమతులు ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా పనిచేసిన బాలకృష్ణ అరెస్టు వ్యవహారం ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్న‌ది.

బీఆరెస్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌లో (Kaleswaram Lift Irrigation Project) భారీ ఎత్తున అంచ‌నాలు పెంచి నీకింత నాకింత అన్న తీరుగా పంచుకుతిన్నార‌ని కాంగ్రెస్ నేత‌లు తీవ్రంగా ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై విజిలెన్స్, జ్యుడిషియ‌ల్ విచార‌ణ‌కు ఆదేశించింది. ఇదే స‌మ‌యంలో గొర్రెల పంపిణీ ప‌థ‌కంలో అవకత‌వ‌క‌లు జ‌రిగాయ‌ని గ‌చ్చిబౌలి పోలీస్టేష‌న్‌లో ఆనాటి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ పీఎస్ క‌ల్యాణ్‌పై కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ కేసును ఏసీబీ దర్యాప్తు చేస్తున్నది. ఫైళ్ల త‌ర‌లింపుపై నాంప‌ల్లిలో కేసు న‌మోదైంది. ఫార్ములా ఈ రేస్‌లో ప్ర‌భుత్వ ఆదేశాలు లేకుండా రూ.55 కోట్లను నాటి పుర‌పాల‌క‌శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ చెల్లించేశారు. అదేంటంటే.. తాను కేటీఆర్ చెప్పినట్టే చేశానని అంటున్నారు. జ‌న‌గామ ఎమ్మెల్యే ప‌ల్లారాజేశ్వ‌ర్ రెడ్డిపై భూ క‌బ్జా కేసులో ఎఫ్ఐఆర్ న‌మోదైన విష‌యం అంద‌రికీ తెలిసిందే.

ఇలా ఒక్కో స్కీమ్‌, ఒక్కో ప్రాజెక్ట్‌లో కిక్‌బ్యాక్స్‌ తీసుకొని చేసే వాటిని స్కామ్‌లు అంటారు కానీ, భూముల అమ్మ‌కాల‌ను స్కామ్‌లుగా చూస్తారా? అన్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల‌లో జోరుగా సాగుతోంది. రేవంత్ రెడ్డి కంచ గ‌చ్చిబౌలిలో భూములు అమ్మ‌కానికి పెట్ట‌డం స్కామ్ అయితే గ‌త ప్ర‌భుత్వం కోకాపేట‌, మోకిల తదితర ప్రాంతాల్లో భూముల‌ను విక్రయించడం కూడా కుంభకోణాలేనా? అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. వాస్త‌వానికి వ‌చ్చే ఆదాయానికి, చేసే ఖ‌ర్చుల‌కు పొంత‌న లేని ప‌రిస్థితి ఉండ‌టంతో భూముల అమ్మ‌కాల‌కు ప్ర‌భుత్వాలు తెర‌లేపాయ‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. రాజ‌కీయ నేత‌లు, పాల‌కులు లేదా ప్ర‌తిప‌క్షాలు ఓట్ల కోసం అడ్డ‌గోలు వాగ్దానాలు చేస్తున్న ప‌రిస్థితులు కొన‌సాగుతూనే ఉన్నాయి. వీటికి ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టాల్సి ఉన్నది. ఆ స్థానంలో ప్ర‌భుత్వ రంగంలో విద్య , వైద్యాన్ని మెరుగుప‌ర్చి, మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌ను ఉత్ప‌త్తిలో భాగ‌స్వాముల‌ను చేయాలి. అప్పుడే నిజమైన అభివృద్ధి జ‌రుగుతుంది కానీ.. కిక్‌బ్యాక్‌ల కోసం ప‌ని చేస్తే అభివృద్ది ఎలా సాధ్య‌మ‌తుంది?