ABVP Wins HCU Student Union Elections| హెచ్ సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ విజయం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ విజయం సాధించింది. ఏబీవీపీ-ఎస్ఎల్వీడీ కూటమి అన్ని సెంట్రల్ ప్యానెల్ పోస్టుల్ని కైవసం చేసుకుంది.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Sep 21, 2025, 12:25 pm IST
Read Time: 4 mins
ABVP Wins HCU Student Union Elections| హెచ్ సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ విజయం

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) విద్యార్థి సంఘం ఎన్నికల్లో(Student Union Elections) ఏబీవీపీ(ABVP Wins) అన్ని విభాగాల్లో విజయం సాధించింది. ఏబీవీపీ-ఎస్ఎల్వీడీ కూటమి అన్ని సెంట్రల్ ప్యానెల్ పోస్టుల్ని కైవసం చేసుకుంది. కూటమికి చెందిన శివ పాలెపు అధ్యక్షుడిగా( Shiv Palepu elected as President) ఎన్నికయ్యారు. ఏబీవీపీ కూటమికి చెందిన శ్రుతి ప్రియ ప్రధాన కార్యదర్శిగా, సౌరభ్ శుక్లా సంయుక్త కార్యదర్శిగా విజయం సాధించారు. వీనస్, జ్వాలా సాంస్కృతిక, క్రీడా కార్యదర్శులుగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 81 శాతం కన్నా ఎక్కువ ఓటింగ్ నమోదైంది. ఎస్ఎఫ్ఐ, ఎన్‌ఎస్‌యూఐలపై ఏబీవీపీ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించడం విశేషం.

ఢిల్లీ తర్వాతా హైదరాబాద్ కైవసం

ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ విజయం తర్వాత, హెచ్‌సీయూలో కూడా ఏబీవీపీ కూటమి గెలుపొందడంపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా, రాహుల్ గాంధీని జెన్-జీ యువత తిరస్కరించిందని ఆ పార్టీ నేతలు ట్వీట్స్ చేస్తున్నారు. యువత మోదీ , బీజేపీ వెంట ఉందని వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నిర్ణయాత్మక విజయం ‘నేషన్ ఫస్ట్, ‘నిస్వార్థ సేవ’ అనే సిద్ధాంతాలకు దేశవ్యాప్తంగా యువతలో పెరుగుతున్న ఆదరణను, మరోసారి స్పష్టం చేస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అభివర్ణించారు.

జెన్ జీ యువత మోదీ వెంటే..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ క్లీన్ స్వీప్ చేసిందని బీజేపీ నేత అమిత్ మాల్వీయా ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విద్యార్థి సంఘం ఎన్ఎస్‌యూఐ తుడిచిపెట్టుకుపోయిందని, రాహుల్ గాంధీ ‘‘జెన్ జీ విప్లవం’’ గురించి కలలు తొలగిపోయాయని అన్నారు. పాట్నా యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ, జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీ, గౌహతి యూనివర్సిటీ, మణిపూర్ యూనివర్సిటీ, ఉత్తరాఖండ్‌లోని అనేక యూనివర్సిటీల్లో ఏబీవీపీ సత్తా చాటిందని, ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కైవసం చేసుకుందని ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ సిక్స్ ప్యాక్స్ చూపించి, స్టేజ్‌లపై తిరగడం యువతను ఆకట్టుకోదని చురకలేశారు.