హైదరాబాద్ ఇక నివాస యోగ్యం కాదా? పట్టని పాలకులు.. అడ్డగోలుగా అనుమతులు
హైదరాబాద్ ఇక నివాస యోగ్యం కాదా? పట్టని పాలకులు.. అడ్డగోలుగా అనుమతులు ,కుంభకోణంలా మారిన రియల్ వ్యాపారం, నాడు ఎకరాకు 70 వేల ఎస్‌ఎఫ్టీ వరకే నిర్మాణం,ఇప్పడు తొమ్మిది లక్షల ఎస్‌ఎఫ్టీ వరకూ అనుమతి, ఎఫ్‌ఎస్‌ఐ ఎత్తివేతతో భారీగా ఆకాశహర్మ్యాలు, నింగినంటే భవనాలే అభివృద్ధికి కొలమానమా?, అభివృద్ధి మాటన అంతులేని విధ్వంసకాండ, వ్యవసాయాన్ని బలిపెట్టి నీళ్లు తేవచ్చేమో! కానీ రోడ్లు, మురుగుకాల్వల పరిస్థితి ఏంటి? ఏ దారిలో చూసినా అనునిత్యం ట్రాఫిక్ జామ్‌లే

- కుంభకోణంలా మారిన రియల్ వ్యాపారం
- నాడు ఎకరాకు 70 వేల ఎస్‌ఎఫ్టీ వరకే నిర్మాణం
- ఇప్పడు తొమ్మిది లక్షల ఎస్‌ఎఫ్టీ వరకూ అనుమతి
- ఎఫ్‌ఎస్‌ఐ ఎత్తివేతతో భారీగా ఆకాశహర్మ్యాలు
- నింగినంటే భవనాలే అభివృద్ధికి కొలమానమా?
- అభివృద్ధి మాటన అంతులేని విధ్వంసకాండ
- వ్యవసాయాన్ని బలిపెట్టి నీళ్లు తేవచ్చేమో!
- కానీ రోడ్లు, మురుగుకాల్వల పరిస్థితి ఏంటి?
- ఏ దారిలో చూసినా అనునిత్యం ట్రాఫిక్ జామ్‌లే
(విధాత ప్రత్యేకం) హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని నిర్మించినప్పుడు గోల్కొండ నవాబు కులీ కుతుబ్ షా (Quli Qutb Shah).. చెరువులో చేపల్లా జనాభాతో నా నగరం నిండిపోవాలని కోరుకున్నాడట! కులీ కుతుబ్‌షా కోరిక మరీ ఇంతగా నిజమైపోతుందని ఆనాడు ఆయనకూడా ఊహించి ఉండడు! ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మహానగరం (metropolis), నగర జనాభా రోజురోజుకూ విస్తరిస్తూ పోతున్నది. 2006కు ముందు హైదరాబాద్ నగరంలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (FSI) అమలులో ఉన్నది. అప్పట్లో ఒక్క ఎకరం భూమిలో దాదాపు 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాల్సిన భవనాలు నిర్మించే వాళ్లు. దీనివల్ల ఎకరానికి 60 ఫ్లాట్ల వరకు వచ్చేవి. ఒక్క ఫ్లాటుకు నలుగురు చొప్పన ఉంటారని అంచనా వేసినా దాదాపు 250 మంది వరకు మాత్రమే నివశించడానికి వీలుండేది. కానీ ఇప్పడు 9 లక్షల చదరపు అడుగుల వరకు నిర్మిస్తున్నారు. దీంతో ఒక్క ఎకరం భూమిలో దాదాపు 500కు పైగా ఫ్లాట్లు వస్తున్నాయి. ఈ లెక్కన ఇప్పుడు ఒక్క ఎకరం భూమిలో దాదాపు రెండు వేల మంది వరకు నివశించేలా బహుళ అంతస్థుల భవనాలు (multi-storied buildings) నిర్మిస్తున్నారు. దీని ప్రభావం తాగునీరు (drinking water), డ్రైనేజీ (drainage), రోడ్లపై (roads) తీవ్రంగా చూపిస్తోంది. ఫలితంగానే నగరంలో నిత్యం ట్రాఫిక్ జామ్ (traffic jam)లు అవుతున్నాయి. ఎక్కడో ఒక చోట డ్రైనేజీ లీకై మంచి నీటి పైపుల్లో కలుస్తోంది. రోడ్లపైన మురుగు పారుతోంది.
హైదరాబాద్ ఎందుకిలా అవుతున్నది?
ఒకవైపు నగరం నానాటికీ కిక్కిరిసిపోతున్నా (congested).. కొన్నేళ్లుగా ఇష్టారాజ్యంగా బహుళ అంతస్థుల భవనాలకు, ఆకాశ హర్మ్యాలకు (skyscrapers) అనుమతులు ఎందుకు ఇస్తున్నారు? ప్రజలు ఎందుకు బలవుతున్నారు? ఇందులో రియల్‌మాఫియా (real mafia conspiracy) కుట్ర ఉన్నదా? ఒక్క హెచ్‌ఎండీఏ (HMDA) ప్లానింగ్ డైరెక్టర్‌ను పట్టుకుంటేనే అనేక అక్రమాలు, కోట్లకొద్దీ అక్రమ సంపాదన వెలుగులోకి వచ్చింది. కానీ.. బడాబాబులకు, కార్పొరేట్ బిల్డర్లకు (corporate builders) లబ్ధికలిగేలా పాలకులు తీసుకుంటున్న చర్యలు ఎంత భారీ కుంభకోణాలకు ఆస్కారమిస్తున్నాయి?
కోటికి పైగా జనాభా ఉన్న నగరంలో…
ప్రణాళికాయుతంగా నిర్మించే నగరాల్లో (planned cities) రవాణా, భద్రత, యాక్సెస్ కీలకంగా ఉంటాయి. వీటితోపాటు పర్యావరణ అనుకూలతకోసం నిర్దిష్టమైన లంగ్‌స్పేస్ (lungspace for eco-friendliness) ఉంటుంది. కానీ.. పాలకులకు ముందు చూపు కొరవడటం, నగరాల, పట్టణాల విస్తరణలో తగిన ప్రణాళికలు అమలు చేయలేకపోవడంతో హైదరాబాద్ మహానగరం కాస్తా.. మహా మురికికూపంలా మారిపోతున్నది. కోటికి పైగా జనాభా ఉన్న నగరంలో ప్రజలకు తగిన విధంగా రవాణా, డ్రైనేజీ వ్యవస్థలు, రోడ్లు లేకుండా పోయాయి. నగర ప్రజలకు ఆహ్లాదాన్నిచ్చే చెరువులు, పార్కులు కబ్జాలకు గురవుతున్నాయి. అనేకం కబ్జా అయ్యాయి కూడా.
నిత్యం ట్రాఫిక్ జాంలే..
పుట్లకొద్దీ ప్రజలు ఒకే చోట నివాసం ఉండటం వల్ల కార్యాలయాలకు వెళ్లే సమయాల్లో ప్రజలంతా ఒకే సమయంలో రోడ్లపైకి రావడంతో నిత్యం ట్రాఫిక్ జాంలు అవుతున్నాయి. ఎల్బీ నగర్ నుంచి పటాన్ చెరువు వరకు ముంబై జాతీయ రహదారిపై (Mumbai National Highway) మలక్‌పైట, కోఠి, ఆబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, జేఎన్‌టీయూ, మియాపూర్, లింగంపల్లి ఇలా ప్రతి ప్రాతంలో అనేక చోట్ల గంటల కొద్ది ట్రాఫిక్ జాం అవుతోంది. ఉప్పల్ నుంచి పంజాగుట్ట వైపు సికింద్రాబాద్ వద్ద, అలాగే జూబ్లీహిల్స్, మాధాపూర్ (Madhapur), హైటెక్ సిటీ (Hi-Tech City), గచ్చిబౌలి (, Gachibowli), లక్డీకాపూల్, మెహదీపట్నం ఇలా నగరంలో ఫలానా ఏరియా అనేది లేకుండా ప్రతి చోట నిత్యం ట్రాఫిక్ జాంలు అవుతున్నాయి. 10 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి పీక్ అవర్స్‌లో గంటకు పైగా సమయం పడుతోంది. చదరపు కిలోమీటరుకు 2 వేల నుంచి 8 వేల వరకు జనాభా ఉంటే అది ఆరోగ్యకరమైన నగరమని పర్యావరణవేత్తలు (Environmentalists) చెబుతున్నారు. గృహాల లభ్యత, రవాణా, సదుపాయాలు, ప్రజా సర్వీసులు, గ్రీన్‌స్పేస్ జన సాంద్రతను ప్రభావితం చేసే అంశాలని అంటున్నారు. ప్రతి చదరపు కిలోమీటర్లకు వెయ్యి మంది జనాభా, ప్రతి వ్యక్తికి వంద చెట్లు ఉంటే అది ఆరోగ్యవంతమైన ఆదర్శ నగరమని (ideal healthy city) షేక్ ఎజ్రా (Sheikh Ezra) అనే రచయిత పేర్కొన్నారు. మూడు వందల చదరపు కిలోమీటర్ల నగరానికి మూడు లక్షల జనాభాయే ఉండాలనేది ఆయన అభిప్రాయం. కానీ.. జీహెచ్‌ఎంసీ జనాభా (GHMC population) 2020 అంచనా ప్రకారం కోటీ పదిలక్షలు. 625 చదరపు కిలోమీటర్ల హైదరాబాద్‌లో జనసాంద్రత (density) ప్రతి చదరపు కిలోమీటరుకు సుమారు 18,480.
ప్రణాళిక లేకపోవడంతో..
ఒక ప్రాంతంలో ఎన్ని అంతస్తుల భవనం నిర్మిస్తే ఎంత మంది అక్కడ నివసిస్తారు? వారంతా బయటకు వెళ్లడానికి, తిరిగి రావడానికి ఎంత రోడ్డు అవసరం ఉంటుంది? ఆ భవనంలో నివసించే వారికి ఎంత నీరు అవసరం అవవసరం? ఎంత నీరు మురుగు రూపంలో బయటకు వస్తుంది? దీనిని ఏ విధంగా నిర్వహించాలి? అనే కనీస అంచనాలు భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చే సమయంలో పరిశీలించాల్సి ఉంటుంది. కనీస ప్రణాళిక లేకుండా ఇస్తున్న అనుమతులతోనే నగరంలో డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యలు తీవ్ర రూపందాల్చాయని నిర్మాణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక నగరంలో ఎక్కడో ఒక చోట నిత్యం పొంగి రోడ్లపైనే మురుగు (sewage) పారుతోంది. దీంతో ఉన్న రోడ్లు కూడా అధ్వాన్న స్థితికి చేరుకున్నాయి. 625 చదరపు కిలో మీటర్లున్న గ్రేటర్ హైదాబాద్ (Greater Hyderabad) నగరంలో ప్రతి రోజు 1400 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఉత్పత్తి అవుతున్నది. ఇంత మురుగునీటిని సరఫరా చేసే వ్యవస్థ లేదని అర్థమవుతోంది.
కాంక్రీట్ జంగిల్‌గా హైదరాబాద్ ..
ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (Floor Space Index) (ఎఫ్‌ఎస్‌ఐ) అమలు చేయక పోవడంవల్ల హైదరాబాద్ మహానగరం కాంక్రీట్ జంగిల్(concrete jungle)గా మారిపోయింది. హైదరాబాద్ అభివృద్ధి పేరుతో ఉమ్మడి రాష్ట్రంలో 2006లో నాటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (YS Rajasekhar Reddy) ప్రభుత్వం బడాబులకు మేలు చేయడం కోసం ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) ఎత్తివేసింది. దీంతో నగరంలో బహుళ అంతస్థుల నిర్మాణాలు యథేచ్ఛగా పెరిగిపోతున్నాయి. నగరంలో 1.5 ఉండాల్సిన ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్‌ను 10 నుంచి 15 వరకు అనుమతించారు. 18 ఏళ్లుగా ఎఫ్ఎస్ఐపై కనీస సమీక్ష కూడా తదుపరి ప్రభుత్వాలు చేయలేదు. జాతీయ స్థాయిలో ఇండెక్స్ 2.5 మాత్రమే ఉన్నది. ముంబైలో ఎఫ్ఎస్ఐ కొన్ని ప్రాంతాల్లో 1.3, మరికొన్ని ప్రాంతాల్లో 2, 3గా ఉంది. మహారాష్ట్ర ప్రత్యేక అభివృద్ధి కాలనీల్లో మాత్రం తాజాగా ఎఫ్ఎస్ఐని 10 నుంచి 15 దాకా అనుమతించారు. బెంగళూరులో 2.5గా ఉంది. ఢిల్లీలో 1.5 నుంచి 3.5 వరకు ఉంది. చెన్నై ఎఫ్ఎస్ఐ 2గా ఉంది. జాతీయ సగటు2 నుంచి 2.5 వరకు ఉంది.
అపరిమిత అంతస్థుల నిర్మాణాలు
హైదరాబాద్ మహానగరంలో ఎటువంటి పరిమితులు లేకుండా నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు. రోడ్ల వెడల్పును బట్టి కొన్ని నియమాలు ఉన్నా వాటిని అమలు చేసే నాథుడు లేడు. హైదరాబాద్‌లో ఎఫ్ఎస్ఐ లేకపోవడం వల్ల ఒక్క గజం భూమికి 9 నుంచి 15 గజాల వరకు వర్టికల్‌గా (నిలువుగా) నిర్మిస్తున్నారు. దీని వల్ల ఇప్పటికే మహానగరం చాలా కోల్పోయింది. రాబోయే కాలంలో మహానగరం మహా మురికి కూపంగా మారి, నివాసానికి ఆయోదయోగ్యంకాని ప్రాంతంగా తయారయ్యే దుస్థితి ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy government) ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్‌ను హైదరాబాద్‌లో అమలు చేయాలని కోరుతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారంలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్‌ను హైదారాబాద్‌లో అమలు చేస్తామని ప్రకటించారు. కానీ అధికారంలో వచ్చి 8 నెలలు అవుతున్నా దీనిపై కేంద్రీకరించలేదన్న విమర్శలు సర్వత్రా వెలువడుతున్నాయి.
నిర్మాణాలు సరే.. సౌకర్యాలు ఎలా?
కాసులకు కక్కుర్తిపడే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అడ్డగోలుగా ఆకాశ హర్మ్యాలు నిర్మించి సొమ్ము చేసుకుంటున్నారు. కానీ ఆ తరువాత అక్కడ నివసించే ప్రజల సౌకర్యాల (facilities) గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పాలకులు కూడా వీటినే అభివృద్ధికి కొలమానాలుగా చూపిస్తూ గొప్పలు చెప్పుకొంటున్నారు కానీ నిజమైన అభివృద్ధిపై దృష్టిసారించడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నగరం దినాదినాభివృద్ధి చెందాలని అందరూ ఆకాంక్షిస్తారు. కానీ అభివృద్ధి పేరుతో సమస్యలు తీసుకు రాకూడదని చెపుతారు. ఒక ప్రణాళిక అంటూ లేకుండా పాలకులు అడ్డగోలుగా టవర్ల నిర్మాణానికి అనుమతులు ఇస్తే ఎలా? అని నిర్మాణ రంగ నిపుణులు (construction sector) అడుగుతున్నారు. ఒక బడా బిల్డర్ తన మిత్రుల వద్ద మాట్లాడుతూ ఇది వరకు బిల్డర్లు అంతా 5 అంతస్థుల వరకే పరిమితమయ్యే వారని, ఎవరో ఒకరిద్దరు మహా అంటే 10 నుంచి 15 అంతస్థుల వరకే అపార్ట్‌మెంట్లు నిర్మించేవారని గుర్తు చేశారు. ఇఫ్పుడు సంప్రదాయ బిల్డర్లు కాకుండా కార్పొరేట్ బిల్డర్లు వచ్చారని, వారికి 50 అంతస్థులు 100 అంతస్థుల భవనాల నిర్మాణాలకు అనుమతి ఇవ్వడమేంటని ప్రశ్నించారు. భూమి, స్టీల్, సిమెంట్ ఉంది కాబట్టి టవర్లు నిర్మిస్తున్నారు కానీ వాటిల్లో నివసించే ప్రజలకు వ్యవసాయాన్ని బలి చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి నీళ్లను బలవంతంగా ఇక్కడకు తీసుకు వస్తున్నారని ఆయన చెప్పారు. మెదక్ జిల్లా రైతులను బలి చేసి మంజీరా నీటిని (Manjira water) హైదరాబాద్‌కు, దేవరకొండ ప్రాంత రైతులను బలి చేసి కృష్ణా జలాలను (Krishna water) హైదరాబాద్‌కు తరలిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. నీళ్లయితే తెస్తారు కానీ.. రోడ్లు ఎక్కడి నుంచి తెస్తారు? డ్రైనేజీ వ్యవస్థ పరిస్థితి ఏమిటి? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రోడ్లపై ట్రాఫిక్ పుణ్యమాని.. రెండు మూడు పనులు పెట్టుకొని బయటకు వెళ్లలేని దుస్థితి మహానగరంలో దాపురించిందని అన్నారు.
ముంబాయిలో ఎంత పెద్ద వర్షం కురిసినా…
ముంబైలో ఎంత పెద్ద వర్షం కురిసినా (rains in Mumbai) గంటలో క్లియర్ అయ్యేలా మురుగునీటి వ్యవస్థ నిర్మించారని, కానీ ఇక్కడ అంత వ్యవస్థను ఏర్పాటు చేయలేదని హెచ్ఎండీఏలో పదవీ విరమణ చేసిన ఒక ప్లానింగ్ అధికారి చెప్పారు. ముంబైలో 3 ఫీట్ల డయా పైప్‌లైన్ ఉందని, మన నగరంలో గతలో 8 ఇంచుల డయాపైప్ ఉండేదని ఇప్పుడు 12 ఇంచుల డయా పైప్ మాత్రమే ఉందని తెలిపారు. ఎక్కడికక్కడ మురుగు నీరు, వర్షం నీరు సాఫీగా వెళ్లిపోయేలా పైప్ లైన్ నిర్మాణం, వర్షపు నీటి కాలువల నిర్మాణం జరగాలని సదరు అధికారి తెలిపారు. దానికి తగిన విధంగానే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని చెపుతున్నారు. పాలకులు మేలుకోకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారుల ధన దాహానికి హైదరాబాద్ బలి కావడం ఖాయమని అంటున్నారు.
ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) అంటే ఏమిటి?
ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) అన్నా ఫ్లోర్ ఏరియా రేషియా (Floor Area Ratio (FAR)) (ఎఫ్ఏఆర్) అన్నా ఒకటే. ఒక నిర్దిష్ట స్థలంలో గరిష్ఠంగా నిర్మించడానికి అనుమతించే విస్తీర్ణం. అంటే గజం స్థలంలో రెండు గజాల విస్తీర్ణం కట్టుకోవచ్చు అంటే, అక్కడ ఎఫ్ఎస్ఐ ఒకటి నిష్పత్తి రెండుగా ఉందని అర్థం. నిలువుగా రెండు గజాల విస్తీర్ణంలో నిర్మించుకోవడం అన్నమాట. అంటే.. వంద గజాల స్థలం ఉంటే రెండు వందల గజాల విస్తీర్ణం వరకు కట్టుకోవచ్చు. ఎఫ్ఎస్ఐ జాతీయ సగటు 2.5 అంటే వంద గజాల స్థలంలో 250 గజాల విస్తీర్ణం కట్టుకోవచ్చు. దీనినే మరో విధంగా చెప్పాలంటే (వంద గజాలు అంటే) 900 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిలువుగా 2250 చదరపు అడుగుల్లో భవంతి కట్టుకోవచ్చు. ఈ నిష్పత్తి ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఒకే నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు నిష్పత్తుల్లో కూడా ఉంటుంది. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పార్కులు వంటి మౌలిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిష్పత్తిని ఖరారు చేస్తారు.
వాల్టా చట్టం ఏం చెబుతున్నది?
వాల్టా చట్టం ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని నివాస ప్రాంతాల్లో ప్రతి వంద చదరపు మీటర్లకు మూడు చెట్లు ఉండాలి. వంద నుంచి రెండు వందల మీటర్లకు ఐదు చెట్లు, 200 నుంచి 300 మీటర్ల వరకు పది చెట్లు, 300 నుంచి ప్రతి వంద మీటర్లకు అదనంగా ఐదేసి చెట్లు పెంచాలని చట్టం పేర్కొంటున్నది. కమర్షియల్ ప్రాంతాల్లో 200 చదరపు మీటర్లకు 2, 200 నుంచి 500 చదరపు మీటర్లకు 4 చెట్లు, 500 నుంచి వెయ్యి చదరపు మీటర్ల వరకు ఆరు చెట్లు, వెయ్యి చదరపు మీటర్లపైన ప్రతి వంద చదరపు మీటర్లకు అదనంగా రెండు చెట్లు చొప్పున పెంచాలి.
పెద్ద బిల్డర్లు ఎకరాల్లో బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తున్నారు. ఉన్న భూమి విస్తీర్ణం మొత్తంలో రెండు మూడు సెల్లార్లు కడుతున్నారు. దీంతో వీటిల్లో చెట్లు అనేవి ఎక్కడా కనిపించకుండా పోతున్నాయి. పేరుకు మాత్రం చుట్టుపక్కల అలంకారప్రాయంగా కొన్ని చెట్లు కట్టేసి చేతులు దులుపుకొంటున్నారు.
– సురేశ్ గౌడ్, చందానగర్ నివాసి
సాధారణ మధ్యతరగతి పరిస్థితి ఏంటి?
బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశ హర్మ్యాల నిర్మాణాల నేపథ్యంలో సగటు మధ్య తరగతి ప్రజలకు ఫ్లాట్లు అందని పండులా మారిపోయాయి. కట్టేవి కూడా లగ్జరీ అపార్ట్‌మెంట్‌లు కావడంతో కోటిన్నర దాకా వెచ్చించి కొనే స్థితి మాలాంటి వాళ్లకు ఉండటం లేదు. మామూలు అపార్ట్‌మెంట్‌లు సైతం 80, 90 లక్షలకు తక్కువలో దొరకడం లేదు.
– ప్రగతినగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
నగరంలోని ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లతో ప్రయాణం దుర్లభంగా మారింది. ఎప్పుడు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో అర్థం కాని పరిస్థితి. లక్డీకాపూల్ నుంచి కూకట్‌పల్లికి పీక్ అవర్స్‌లో రావడానికి గంటన్నర పైనే పడుతున్నది.
– గజ్జెల నర్సిరెడ్డి, కుకట్‌పల్లి నివాసి