ముంబైలోని వసాయిలో ఘటన
విధాత: అది రెండు అంతస్థుల భవనం. పై అంతస్థులో తాళం వేసి ఉన్న ఇంటి నుంచి దారుణంగా దుర్వాసన వస్తున్నది. భరించలేకుండా దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా, మూడు మృతదేహాలు కుళ్లినస్థితిలో కనిపించాయి. ఈ దారుణ ఘటనలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం.. ముంబయి సమీపంలోని వాసాయ్‌లో ఉన్న ఆనంద్ నగర్‌లోని తాళం వేసి ఉన్న భవనం రెండో అంతస్తు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఆదివారం మధ్యాహ్నం సమాచారం అందించారు. పోలీసులు ఘటనస్థలికి వెళ్లారు. తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా, కుళ్లిపోయిన స్థితిలో మూడు శవాలు కనిపించాయి. మృతదేహాలకు ఎలాంటి గాయం గుర్తులు లేవు. ఇంట్లో గ్యాస్ వాసన వస్తున్నది. మృతులను మో అజం, రాజు, ఛోట్కుగా గుర్తించారు. వారు పండ్ల విక్రయదారులని స్థానికులు పేర్కొన్నారు.
ఎవరైనా గ్యాస్‌ని వదిలేసి ఉంటారని, ఆక్సిజన్ లేకపోవడం వారి మరణానికి దారితీసిందని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. సరైన కారణం పోస్ట్‌మార్టం తర్వాత మాత్రమే తెలుస్తుందని పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.