త‌మ ఇంటిని వ‌దిలేయాల్సి వ‌స్తుందేమోన‌ని భ‌య‌ప‌డుతున్న 57 శాతం మంది భార‌తీయులు

దుబాయ్‌లో వాతావ‌ర‌ణ మార్పుల (Climate Change) పై తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి వ‌చ్చే నెల‌లో కాప్‌-28 స‌ద‌స్సు (COP-28) జర‌గ‌నున్న విష‌యం తెలిసిందే

  • Publish Date - November 29, 2023 / 07:36 AM IST

  • వాతావ‌ర‌ణ మార్పులే కార‌ణం



విధాత‌: దుబాయ్‌లో వాతావ‌ర‌ణ మార్పుల (Climate Change) పై తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి వ‌చ్చే నెల‌లో కాప్‌-28 స‌ద‌స్సు (COP-28) జర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వాతావ‌ర‌ణ మార్పులు, భూ ఉష్ణోగ్ర‌త‌ల వ‌ల్ల సామాన్య ప్ర‌జ‌ల నివాసాల‌పై ప‌డే ప్ర‌భావాన్ని అంచ‌నా వేస్తూ ఒక నివేదిక వెలువ‌డింది. దీని ప్ర‌కారం.. కొన్ని కోట్ల మంది ప్ర‌జ‌లు వ‌చ్చే 25 ఏళ్లలో ఇప్పుడు ఉంటున్న ఇంటిని వ‌దిలేసి వ‌లస వెళ్లాల్సి ఉంటుంద‌ని తేలింది.


వాతావ‌ర‌ణ‌మార్పుల వ‌ల్ల త‌లెత్తే ప్ర‌కృతి విప‌త్తులు, వ‌ర‌ద‌లు, కార్చిచ్చులు, కొండ వాలులు కుంగిపోవ‌డం, ఆక‌స్మిక కుండ‌పోత వ‌ర్షాలు మొద‌లైనవి తీవ్రంగా ఇబ్బంది పెట్ట‌డం వ‌ల్ల ప్ర‌జ‌లు త‌మ నివాసాల‌ను వ‌దిలి వెళ్లిపోయే ప‌రిస్థితి రావొచ్చు. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో ప్ర‌తి 10 మందిలో క‌నీసం న‌లుగురు త‌మ ఇల్లు వ‌దిలేసి వ‌ల‌స పోవాల్సిన‌ దుస్థితి రావొచ్చ‌ని భ‌య‌ప‌డుతున్న‌ట్లు ఈ నివేదిక అంచ‌నా వేసింది. వాతావ‌ర‌ణ మార్పులు – వ‌ల‌స‌లు అనే అంశంపై 31 దేశాల్లో ఉన్న‌ 24,000 మందిని అధ్య‌య‌న‌క‌ర్త‌లు స‌ర్వే చేశారు.


వీరిలో 38 శాతం మంది వ‌చ్చే 25 ఏళ్ల‌లో వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా తమ ఇంటిని, ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోవాల్సి రావొచ్చ‌ని భ‌య‌ప‌డుతున్న‌ట్లు వెల్ల‌డించారు. మిగిలిన అన్ని దేశాల‌తో పోలిస్తే తుర్కియే, బ్రెజిల్, భార‌త్‌ల‌లో ఈ స‌మ‌స్య మ‌రింత తీవ్రంగా ఉంటుంద‌ని ఈ అధ్య‌య‌నంలో పేర్కొన్నారు. త‌మ నివాసాల‌ను వ‌దిలిపెట్టాల్సి రావొచ్చ‌ని భ‌య‌ప‌డేవారు తుర్కియేలో ఏకంగా 68 శాతం మంది, బ్రెజిల్‌లో 61 శాతం మంది, భార‌త్‌లో 57 శాతం మంది ఉండ‌టం గ‌మ‌నార్హం.


నెద‌ర్లాండ్స్‌లో ప్ర‌జ‌లు మాత్రం వాతావ‌ర‌ణ మార్పుల గురించి, దాని దుష్ఫ‌లితాల గురించి పెద్ద‌గా ఆందోళ‌న చెంద‌డం లేద‌ని తేలింది. ఈ అంశంపై ఆందోళ‌న‌కు గుర‌య్యే వారి సంఖ్య అక్క‌డ 19 శాతంగా ఉంది. మొత్తానికి ఈ స‌ర్వే ఫ‌లితాల‌ను ప్ర‌పంచ‌దేశాల‌కు ఆపాదిస్తే గ‌నుక క‌నీసం 200 కోట్ల మంది ప్ర‌జ‌లు వచ్చే రెండు ద‌శాబ్దాల్లోనే త‌మ ఇళ్ల‌ను వ‌దిలి పెట్టాల్సి ఉంటుంద‌ని ఈ నివేదిక హెచ్చ‌రించింది.

Latest News