విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం అర్ధరాత్రి లెక్కల ప్రకారం 70. 66% ఓటింగ్ నమోదయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 73.37% పోలింగ్ నమోదైంది. ఈ దఫా అత్యల్పంగా యాకత్ పుర లో 39.69 శాతం, అత్యధికంగా మునుగోడులో 91.51శాతం ఓటింగ్ నమోదయింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓట్ల సంఖ్య పెరిగినప్పటికి పోలింగ్ శాతం మాత్రం తగ్గడం గమనార్హం.
ఐదు గంటల వరకు 64 శాతం పోలింగ్ నమోదవ్వగా అప్పటికే క్యూలైన్లో ఉన్నవారు తమ ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యంలో పోలింగ్ శాతం చివరి గంటల్లో పెరిగింది. చివర్లో పెరిగిన పోలింగ్ శాతం తమ పార్టీకి అనుకూలంగా ఉంటుందని బీఆర్ఎస్ ధీమాగా ఉంది. అయితే అప్పటికే ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ ఆధిక్యత సాధిస్తుందని జరిగిన ప్రచారం నేపథ్యంలో చివరి గంటలో పెరిగిన పోలింగ్ శాతం తమకే అనుకూలమని కాంగ్రెస్ నమ్ముతుంది.