ఎర్ర‌స‌ముద్రంలో వాణిజ్యనౌక‌పై డ్రోన్ దాడి.. నేవీ రెస్క్యూ ఆప‌రేష‌న్‌

ప్ర‌పంచ‌వాణిజ్యానికి కీల‌క‌మైన ఎర్ర స‌ముద్రంలో ఉద్రిక్త‌త‌లు త‌గ్గ‌డం లేదు.

  • Publish Date - January 18, 2024 / 10:26 AM IST

ప్ర‌పంచ‌వాణిజ్యానికి కీల‌క‌మైన ఎర్ర స‌ముద్రం (Red Sea) లో ఉద్రిక్త‌త‌లు త‌గ్గ‌డం లేదు. తాజాగా గురువారం ఉద‌యం తెల్ల‌వారుజామున మార్ష‌ల్ ఐలాండ్ దేశం జెండాతో ఉన్న ఎంవీ జెన్‌కో పికార్డీ అనే నౌక‌పై డ్రోన్ దాడి (Drone Attack on Vessel) జ‌రిగింది. ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న భార‌త నేవీ త‌న ఫ్లీట్‌లోని ఐఎన్ఎస్ విశాఖ‌ప‌ట్నాన్ని ఘ‌ట‌నా స్థ‌లానికి పంపించింది. వెంట‌నే ప్ర‌మాదంలో ఉన్న పికార్డీ ఓడ‌ను గుర్తించి.. డ్రోన్ దాడిని తిప్పికొట్టింది.


ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ గాయాలు కాలేద‌ని నేవీ వ‌ర్గాలు తెలిపాయి. ఈ నౌక‌లో మొత్తం 22 మంది సిబ్బంది ఉండ‌గా వీరిలో 9 మంది భార‌తీయులు. డ్రోన్ దాడిలో నౌక‌లో కొంత భాగం దెబ్బతింద‌ని.. అయినా ప్ర‌మాదం ఏమీ లేద‌ని అధికారులు వెల్ల‌డించారు. నేవీకి చెందిన క్షిప‌ణి విధ్వంస‌క నౌక ఐఎన్ఎస్ విశాఖ‌ప‌ట్నాన్ని ఏడెన్ గ‌ల్ఫ్ వ‌ద్ద‌కు రెస్క్యూ ఆప‌రేష‌న్‌పై పంపాం. 17వ తేదీ అర్ధ‌రాత్రి త‌మ‌పై డ్రోన్ దాడి జ‌రుగుతున్న‌ట్లు ఎంవీ జెన్‌కో పికార్డీ స‌మాచారం ఇచ్చింది. 18వ తేదీ తెల్ల‌వారుజామునే ఆ నౌక వ‌ద్ద‌కు చేర‌కుని ఐఎన్ఎస్ విశాఖ‌ప‌ట్నం ర‌క్షించింది అని నేవీ ఎక్స్‌లో ప్ర‌క‌టించింది.


ఈ ఆప‌రేష‌న్‌లో ఎవ‌రూ గాయ‌ప‌డలేద‌ని.. పికార్డీ ఓడ‌లో ఎటువంటి పేలుడు ప‌దార్థాలు ఏమీ లేవ‌ని భ‌ద్ర‌తా సిబ్బంది నిర్ధారించార‌ని పేర్కొంది. డిసెంబ‌రు 23న జ‌రిగిన ఇదే త‌ర‌హా ఘ‌ట‌న‌లో లైబీరియా జెండాతో ఉన్న ఎంవీ కెమ్ ప్లూటో ఓడ‌పైనా ఇదే త‌ర‌హాలో డ్రోన్ దాడి జ‌రిగింది. ఇందులో 21 మంది భార‌త సిబ్బంది సైతం ఉన్నారు. ప్ర‌మాదంలో ఈ నౌక మంట‌ల్లో చిక్కుకోగా భార‌త నేవీ రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది.


అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయిన‌ప్ప‌టికీ.. ఈ దాడుల‌ను యెమ‌న్‌లోని హౌతీ తిరుగుబాటు ద‌ళాలే చేస్తున్నాయ‌నేది భ‌ద్ర‌తా ద‌ళాల అభిప్రాయం. ఇరాన్ మ‌ద్ద‌తు ఉన్న ఈ ముఠా.. అమెరికా, దాని మిత్ర‌దేశాల నౌక‌ల‌పై అత్యాధునిక క్షిప‌ణులు, డ్రోన్ల‌తో విరుచుకుప‌డుతోంది. ఈ దాడుల వ‌ల్ల వాణిజ్య నౌక‌లు ఆఫ్రికా చుట్టూ తిరిగి యూర‌ప్ పోర్టుల‌కు వెళ్లాల్సి వ‌స్తోంది. దీని వ‌ల్ల స‌మ‌యం అధికం కావ‌డంతో పాటు ర‌వాణా ఖ‌ర్చులూ పెరిగిపోతున్నాయి.

Latest News