Indian Navy | ఇరాన్ నౌక‌ హైజాక్ చేసిన స‌ముద్ర దొంగ‌లు

కొచ్చి స‌ముద్ర తీరంలో సోమాలియ స‌ముద్ర దొంగ‌లు ఇరాన్ నౌక‌ హైజాక్ చేశారు. రంగంలోకి దిగిన భార‌తీయ యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర.. సొమాలీ పైరేట్స్‌ను అడ్డుకున్న‌ది

  • Publish Date - January 30, 2024 / 06:37 AM IST
  • అడ్డుకున్న ఇండియ‌న్ నేవీ
  • 19 మంది పాకిస్థానీయుల‌ను
  • ర‌క్షించిన భార‌త నౌకాద‌ళం


Indian Navy | విధాత‌: కొచ్చి స‌ముద్ర తీరంలో సోమాలియ స‌ముద్ర దొంగ‌లు ఇరాన్ నౌక‌ హైజాక్ చేశారు. రంగంలోకి దిగిన భార‌తీయ యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర.. సొమాలీ పైరేట్స్‌ను అడ్డుకున్న‌ది. బోటులో ఉన్న 19 మంది పాకిస్థానీయుల‌ను ర‌క్షించింది. 11 మంది సాయుధులైన సోమాలియా స‌ముద్ర దొంగ‌ల‌ను అరెస్టు చేసింది. రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే ఐఎన్ఎస్ సుమిత్ర భారీ రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్ట‌డం ఇది రెండోసారి.


సోమాలియా తూర్పు తీరంలో సోమవారం 11 మంది సాయుధులైన‌ సముద్రపు దొంగలు ఇరాన్ జెండాతో కూడిన ఫిషింగ్ ఓడను అడ్డ‌గించారు. ఓడ‌లోకి ఎక్కి పాకిస్థాన్ జాతీయులైన 19 మంది సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. కొచ్చికి సుమారు 800 మైళ్ల దూరంలో పైరెట్స్ ఆధీనంలో ఉన్న ఇరానీ నౌక‌ను ఐఎన్ఎస్ సుమిత్ర అడ్డగించింది. సముద్రపు దొంగలను అదుపులోకి తీసుకొని 19 మంది పాకిస్థాన్ జాల‌ర్ల‌ను ర‌క్షించింది. ఈ విష‌యాన్ని ఇండియ‌న్ నేవీ మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

భారతీయ నావికాదళానికి చెందిన‌ ఐఎన్ఎస్ సుమిత్ర అనేది పెట్రోలింగ్ నౌక. ఇది సోమాలియా, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌కు తూర్పున నేర వ్య‌తిరేక‌, సముద్ర భద్రతా కార్యకలాపాల కోసం మోహరింపబడింది. అంతకుముందు, ఇండియన్ నేవీకి చెందిన గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ విశాఖపట్నం పైరసీ నిరోధక మిషన్‌లో ఉన్న‌ది. శనివారం రాత్రి గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో క్షిపణితో ఢీకొన్న తర్వాత ఒక వ్యాపార నౌకపై భారీ మంటలను ఆర్పడానికి సహాయపడింది.