Kadiyam Srihari vs KTR : కడియం కేటీఆర్ మధ్య మాటల తూటాలు

మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య రాజకీయ యుద్ధం తారస్థాయికి చేరింది. వ్యక్తిగత విమర్శలు, రాజీనామా సవాళ్లతో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం అట్టుడుకుతోంది.

Kadiyam Srihari vs KTR

విధాత, ప్రత్యేక ప్రతినిధి: మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం పైన గత కొద్ది రోజులుగా కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనికి అంతే ధీటుగా కడియం ప్రతిస్పందిస్తూ వస్తున్నారు. ఇటీవల సుప్రీం కోర్డు ఆదేశాలు, కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పై స్పీకర్ విచారణ చేపట్టిన నేపథ్యంలో కడియం కేంద్రంగా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శల వాడి వేడి పెరిగింది. ఘాటైన పదాలతో పాటు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు ఎంత ఘాటుగా విమర్శిస్తున్నారో అంతకంటే ఘాటుగా కడియం స్పందించడమేకాకుండా సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలో స్టేషన్ ఘన్ పూర్ కేంద్రంగా కడియం వర్సెస్ బీఆర్ఎస్ మధ్య రసవత్తర రాజకీయం సాగుతోంది.

కడియం వర్సెస్ కేటీఆర్

పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పై కేటీఆర్ విమర్శిస్తున్న క్రమంలో కడియం పై తీవ్ర పదజాలం ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఈ వయస్సులో కడియం, పోచారం లాంటి వాళ్ళకు ఈ దుస్థితి అవసరమా? వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దయనీయ స్థితిలో ఉన్నారంటూ కేటీఆర్ విమర్శించారు. పైగా నేనుండాల్సిన పార్టీలోనే ఉన్నానంటూ కడియం చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ క్రమంలోనే దమ్ముంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి గెలువాలని సవాల్ విసిరారు. అదే విధంగా స్పీకర్ కు కడియం రాసిన సమాధానంలో తానింకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని చెప్పడం పై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేస్తూ దూషించారు. ఈ అంశం పై కడియం స్పందిస్తూ నిజంగానే కడియం దమ్మున్న నాయకుడేనంటూ పేర్కొన్నారు. కేటీఆర్ స్థాయి మరిచి మాట్లడుతున్నారంటూ నీ అయ్యలేకుంటే నీ అడ్రస్ ఎక్కడంటూ సవాల్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు కడియం ఫోటోతో బీఆర్ఎస్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం రచ్చకు దారి తీసింది. దీనిపై కూడా కడియం స్పందిస్తూ ఏ పార్టీకైనా తన ఫోటో ఇప్పుడు అవసరమంటూ చమత్కరిస్తూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా కడియం మగాడైతే ఎమ్మెల్యేగా రాజీనామా చేయలంటూ కేటీఆర్ విమర్శించడం పై కూడా తీవ్రంగానే స్పందించారు. కేటీఆర్ కు అహంకారం, బలుపు ఎక్కువ, నన్ను, పోచారం శ్రీనివాస్ రెడ్డిని వీళ్ళు ఆడ మగ అని కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటని కడియం తాజాగా మండిపడ్డారు. నీ తండ్రి కెసిఆర్ కంటే వయసులో పెద్దవాడిని నేను…కేసీఆర్ 10ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తే నేను 14 ఏళ్ళు మంత్రి గా చేశాను…నేను… ఆడో, మగో స్టేషన్ ఘనపూర్ కు వచ్చి చూడు తెలుస్తుందంటూ సవాల్ చేశారు. నియోజకవర్గంలో 143 కు 100 సర్పంచ్ లను గెలిపించుకున్న మొగాన్ని నేను అంఊ నీలాంటి నీచ సంస్కృతి నాకు లేదంటూ విమర్శించారు.
బిఆర్ఎస్ ఫ్లెక్సీలలో నా ఫోటో పెట్టడం నాకు సంతోషం…నియోజకవర్గంలో ఏ పార్టీ కైన నేనే మగాడ్ని అందుకే నా ఫోటో వాడుకుంటున్నారని అన్నారు. కడియం వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే స్థాయిలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విరుచుకపడుతున్నారు. కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేయాలని పదేపదే సవాల్ చేశారు. రాజయ్యపై కూడా కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ యొక్క పరువు ప్రతిష్టలకు కూడా దెబ్బతీసే విధంగా ఆయన ప్రవర్తించారని విమర్శించారు. గత ప్రభుత్వం ఇలాంటి అవినీతిపరులకు టికెట్ ఇవ్వొద్దని పక్కన పెట్టి నన్ను పిలిచి టికెట్ ఇచ్చారని అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి టిఆర్ఎస్ ఓడిపోగానే కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నావు. ఇలాంటి వాడు పార్టీలోకి వస్తే మా మహిళలకు భద్రత ఉండదు అని చెప్పారని కడియం విమర్శించారు. ఒక వైపు రోజూ ఒక చోట బీఆర్ఎస్ నాయకులు కడియం పైన విమర్శలు చేస్తుండగా కడియం వారికి ధీటుగా స్పందిస్తున్నారు. దీంతో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో నిత్యం విమర్శ, ప్రతివిమర్శలతో రాజకీయ వేడి మాత్రం చల్లారడం లేదు.

ఇవి కూడా చదవండి :

Revanth Reddy : అధికారులకు నెల రోజుల గడువు విధించిన సీఎం రేవంత్
Aliens Exist | గ్రహాంతరవాసుల జాడ తెలిసేది ‘ఆ సంవత్సరం’లోనే .. బ్రిటన్‌ శాస్త్రవేత్త ధీమా

Latest News