USA |
అమెరికా (America) లోని ఆరిజోనా రాష్ట్రంలో ఉన్న ప్రపంచప్రఖ్యాత ప్రదేశం.. గ్రాండ్ కేనియాన్ (Grand Canyon) గురించి అందరికీ తెలిసిందే.. మొనలు తేలిన భారీ రాళ్లు.. భయంగొలిపే లోయలతో సాహసికులను ఆహ్వానిస్తుంది. తాజాగా కుటుంబంతో కలిసి గ్రాండ్ కానియాన్ సందర్శనకు వెళ్లిన 13 ఏళ్ల బాలుడు 100 అడుగుల లోయలోకి ప్రమాదవశాత్తు పడిపోయాడు (Boy Falls). ఇక్కడ ఇలా పడిపోయి చనిపోయిన వారే తప్ప.. బతికున్న వారు లేకపోవడంతో అధికారులు, కుటుంబ సభ్యులు కూడా బాలుడు చనిపోయి ఉంటాడనే అనుకున్నారు.
అయితే కిందకి వెళ్లి చూడగా.. తీవ్రగాయాలపాలైన బాలుడు స్పృహ లోనే ఉండటంతో.. వారు ఆశ్చర్య పోయారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వ్యాట్ కాఫ్మెన్ అనే ఈ బాలుడికి ప్రమాదంలో కాలేయం, ఊపిరి తిత్తులు దెబ్బతిన్నాయి. 9 పక్కటెముకలు విరిగిపోగా.. చేయి, ఒక వేలు స్థానభ్రంశం చెందాయి.
ఒకరు ఫొటో తీసుకుంటుండగా అడ్డుగా ఉన్నానని పక్కకు తప్పుకొన్నా.. అంతే కాలు జారి లోయలోకి పడిపోయా.. ఆ మధ్యలో ఒక చిన్న రాయిని పట్టుకున్నప్పటికీ.. అక్కడ ఒక చేయి పెట్టడానికే చోటుంది. దీంతో ఇక లోయలోకి పడిపోయా అక్కడి వరకే గుర్తుంది అని వ్యాట్ వెల్లడించాడు. తర్వాత అంబులెన్స్‌లో ఒకసారి స్పృహ వచ్చిందని.. హెలికాప్టర్, ఆ తర్వాత విమానంలో ఆసుపత్రికి తీసుకురావడం లీలగా గుర్తున్నాయని చెప్పుకొచ్చాడు.
అయితే ఈ బాలుణ్ని కొండ పైకి తీసుకురావడానికి పార్క్ అధికారులు కష్టపడాల్సి వచ్చింది. కొండల మధ్య ఉండే సన్నని ఖాళీలో తాడు వేసుకుని సిబ్బంది కిందకి దిగారు. ఒక చిన్న బుట్టలో బాలుణ్ని పెట్టుకుని మెల్లిగా పైకి ఎక్కారు. ఈ ప్రక్రియకు ఏకంగా రెండు గంటల పాటు సమయం పట్టింది. ఈ రెండు గంటలూ తమకు కొన్ని యుగాలుగా గడిచిందని బాధితుడి తండ్రి బ్రియన్ కాఫ్మెన్ అన్నారు. ఎంతో కష్టపడి తన కుమారుణ్ని రక్షించిన గ్రాండ్ కేనియాన్ పార్క్ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.