ఓ శునకం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. కుక్క ఏంటి..? గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడం ఏంటని అనుకుంటున్నారా? అవునండి మీరు చదువుతున్నది నిజమే. ప్రపంచంలోనే ఆ శునకానికి అత్యంత అధిక వయసు ఉన్నది. ఆ కుక్క వయసు 22 సంవత్సరాలు. దీంతో వరల్డ్‌లోనే అత్యధిక వయసున్న కుక్కగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది గినో వోల్ఫ్. మరి ఈ కుక్క గురించి తెలుసుకోవాలంటే యూఎస్ఏలోని కాలిఫోర్నియా వెళ్లాల్సిందే.
అలెక్స్ వోల్ఫ్ అనే వ్యక్తి (40) గినో వోల్ఫ్‌ను 2002లో కొలరాడో హ్యుమనే సోసైటీ నుంచి దత్తత తీసుకున్నాడు. గినో 2000, సెప్టెంబర్ 24న జన్మించింది. ఇక తాను దత్తత తీసుకున్న తర్వాత గినోను ఎంతో చక్కగా చూసుకున్నాడు. ఆ కుక్కకు ఎలాంటి లోటు లేకుండా పెంచాడు. మంచి ఆహారాన్ని అందించాడు. దీంతో కుక్క ఆకారంలో ఎలాంటి మార్పులు సంభవించలేదు. చూడటానికి కూడా క్యూట్‌గా ఉంది. దీంతో దాన్ని వయసును కూడా అంచనా వేయలేనంతగా ఉంది ఆ శునకం. గినోకు ధైర్యం కూడా ఎక్కువే అని యజమాని చెప్పుకొచ్చాడు.
గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కే నాటికి ఆ శునకం వయసు 22 సంవత్సరాల 52 రోజులు. గినో ప్రపంచంలోనే అత్యధిక వయసున్న కుక్కగా రికార్డు సృష్టించడం, ఇందులో భాగంగా గిన్నిస్ రికార్డులోకి ఎక్కడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు అలెక్స్.