విధాత: మనుషులు ఒకప్పుడు నరమాంస భక్షణ (Cannibalism) గా ఉండేదని చెబుతోందని భావిస్తున్న మానవుని కాలి ఎముకను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇటీవల వారికి దొరికిన ఆ ఎముకపై రాతి ఆయుధాలతో గాట్లు చేసినట్లు ఉన్న గుర్తుల్ని బట్టి వారు ఈ అవగాహనకు వచ్చారు. కాలి ఎముకపై ఉన్న ఈ లోతైన గాయాలను చూస్తుంటే అప్పట్లో మనుషులు ఒకరిని ఒకరు చంపుకుని తినేవారని తెలుస్తోందని సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన వెల్లడించింది.
అంతే కాకుండా మనుషుల్లో నరమాసం భక్షణపై దొరికిన అతి ప్రాచీన ఆధారంగా ఈ ఎముకను పేర్కొంది. మాకు లభించిన ఈ తుంటి ఎముక సుమారు 15 లక్షల సంవత్సరాల క్రితంది. రాతి ఆయుధంతో చేసిన 9 లోతైన గాయాలున్నాయి. మానవుడు తొలిసారి పరిణామం చెందాడన్న ఆఫ్రికా (Africa) ఖండంలోని కెన్యాలోనే ఈ ఎముక దొరికింది కాబట్టి ఇది చెప్పే విషయాలను నమ్మొచ్చు అని పరిశోధకులు బృందం పేర్కొంది.
తొలి తరం మానవుల్లో నర మాంస భక్షణ ఉందని ఇప్పటికే శాస్త్రవేత్తలు చూచాయిగా తెలుసుకున్నప్పటికీ.. ఆధునిక మానవుడికి సమీప బంధువైన జాతిలో ఈ లక్షణం ఉందని బయటపడటం ఇదే తొలిసారి. అందులోనూ ఈ కాలి ఎముక స్పష్టంగా ఉండటంతో 99 శాతం కచ్చిత్వంతో నరమాంస భక్షణ లక్షణంపై పరిశోధకులు తుది అంచనాలకు రాగలిగారు.
ఉచ్చులోకి దింపారు
కాలిపై గాట్లను పరిశీలించిన శాస్త్రవేత్తలకు … ఈ కాలుతో ఉన్న వారిని ఉచ్చులో చిక్కుకున్నపుడు పట్టుకున్నట్లు అర్థమైంది. ఇలాంటి పరిస్థితుల్లో జంతువులకు ఎలాంటి గాయాలవుతాయో అలాంటి గాయాలే ఈ ఎముక మీదా ఉన్నాయి. అంతే కాకుండా కాలిపై మాంసం ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడే రాయితో చీల్చినట్లు గాట్లు ఉన్నాయి.
దీనిని బట్టి ఈ మనిషిని తినడానికే చంపి ఉంటారని తెలుస్తోంది. నర బలులు ఇవ్వడానికి చంపారనుకున్నా.. వారిని ఇంతలా కోసి కోసి హింసించాల్సిన అవసరం లేదని పరిశోధనకు నేతృత్వం వహించిన డా.పోబినిర్ అభిప్రాయపడ్డారు. ఏకంగా తొమ్మిది గాయాలున్నాయి కాబట్టి ప్రమాదంలో ఇలా జరిగి ఉండొచ్చేమో అన్న వాదనను కొట్టిపడేయొచ్చని తెలిపారు. ఈ సాక్ష్యాలన్నీ చూస్తుంటే ఇది నరమాంస భక్షణ కోసమేనన్న అంచనాకు రావొచ్చన్నారు.
ఇంకా ఆధారాలు కావాలి..
కాలిపై ఉన్న గాయాలను బట్టి మాత్రమే మన పూర్వీకులు నర మాంస భక్షకులన్న అంచనాకు రాకూడదని కొంత మంది శాస్త్రవేత్తలు అన్నారు. అయితే ఆ దశలో పరిశోధన చేయడానికి ఇది ఒక పెద్ద మలుపు అని తెలిపారు. మరి కొంత మంది శాస్త్రవేత్తలు మాత్రం.. మనుషుల్లో నరమాంస భక్షణ ఉందని చెప్పడానికి ఈ ఎముక అసలు సాక్ష్యమే కాదని కొట్టిపడేస్తున్నారు.
దీని ద్వారా చనిపోయింది మనిషని తెలుస్తోంది కానీ దానిని తిన్నది మనిషా కాదా అన్న సమాచారం మన వద్ద లేదని గుర్తు చేస్తున్నారు. మనం ఇప్పుడిప్పుడే అన్ని విషయాలనూ గుది గుచ్చుతున్నామని.. అప్పుడే ఒక అభిప్రాయానికి రాకూడదని పాలియోఆంత్రోపాలజిస్ట్ జెర్సెనే అల్‌మెసెజ్‌డ్ వ్యాఖ్యానించారు. ఇంచుమించుగా మనం చేసేపని మన పూర్వీకుల మెదళ్లలోకి తొంగిచూడటం.. అది ఇప్పుడప్పుడే అయ్యేది కాదు. అంత సులువైనదీ కాదు అని పేర్కొన్నారు.